రేవంత్ తో ఢీ కొట్టేందుకు బాబు రెడీ !
ఇదిలా ఉంటే తెలంగాణాలో తెలుగుదేశం రంగంలోకి దిగితే నేరుగా కాంగ్రెస్ ప్రభుత్వాన్నే విమర్శించాలి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఢీ కొట్టాలి.;
తెలంగాణాలో తెలుగుదేశం పుట్టింది. ఉమ్మడి ఏపీని ఎన్టీఆర్ ఏడేళ్ళ పాటు పాలిస్తే చంద్రబాబు తొమ్మిదేళ్ల పాటు పాలించారు. ఆ విధంగా చూస్తే టీడీపీకి తెలంగాణాలో మంచి పట్టు ఉంది ఆదరణ కూడా ఉందని చెప్పాలి. ఈ రోజుకీ చంద్రబాబు విజన్ అంతా హైదరాబాద్ లో కనిపిస్తుంది. పల్లెల్లో అన్న గారి సంక్షేమ పధకాలు ఆయన చేసిన అభివృద్ధి కార్యక్రమాల గుర్తులు కనిపిస్తాయి.
అటువంటి తెలంగాణాతో తెలుగుదేశం బంధం ఒక భావోద్వేగమైన అంశంతో కాస్తా ఇబ్బంది పడింది. 2014లో 15 ఎమ్మెల్యేలు గెలుచుకున్న టీడీపీ 2018 నాటికి మూడు సీట్లకే పరిమితం అయింది. 2023లో పోటీ చేయలేదు. అయితే టీడీపీకి ఈ రోజుకీ హైదరాబాద్ ఖమ్మం, నిజమాబాద్, నల్గొండ, మహబూబ్ నగర్ వంటి జిల్లాలలో మంచి ఓటు బ్యాంకు ఉందని అంటారు.
ఇక పార్టీని వీడి బీఆర్ ఎస్ బీజేపీ కాంగ్రెస్ లలో చాలా మంది నేతలు చేరిపోయారు. ఇపుడు అక్కడ కాంగ్రెస్ అధికారంలో ఉండడంతో బీఆర్ఎస్ ప్రతిపక్ష పాత్రలోకి రావడంతో టీడీపీ ఎదిగేందుకు ఇదే సరైన తరుణం అని టీడీపీ పెద్దలు భావిస్తున్నారు. తెలంగాణా టీడీపీలో మాజీ నేతలను తిరిగి చేర్చుకునే కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నారు.
వారికి ఘర్ వాపసీ పేరుతో పిలుపులు వెళ్తాయని అంటున్నారు. అదే విధంగా తొలి బోణీగా గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో పోటీ చేయడానికి టీడీపీ అధినాయకత్వం నిర్ణయించింది అని వార్తలు వస్తున్నాయి. 2015లో గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో పోటీ పడిన తరువాత మళ్ళీ టీడీపీ ఎన్నికల గోదాలోకి దిగలేదు. కానీ ఈసారి అలా కాదు అని అంటోంది.
అయితే పక్కా లెక్కలతోనే టీడీపీ తెలంగాణాలో రీ ఎంట్రీ ఇచ్చేందుకు రంగం సిద్ధం చేస్తోంది అని అంటున్నారు. కేవలం తాము మాత్రమే కాకుండా జనసేన బీజేపీలను కలుపుకుని ఎన్డీయే కూటమిగా గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో పోటీకి దిగితే మంచి ఫలితాలు వస్తాయని అంచనా వేస్తున్నారు.
తమకు బలమున్న చోటనే పోటీకి అభ్యర్ధులను నిలిపి వారిని గెలిపించుకుంటే పార్టీ ఇమేజ్ పెరుగుతుందని అది 2028 అసెంబ్లీ ఎన్నికల నాటికి బలపడుతుందని టీడీపీ పెద్దలు లెక్క వేస్తున్నారు. ఈ నేపధ్యంలో యాక్షన్ ప్లాన్ ని టీడీపీ రెడీ చేత్స్తోంది అని అంటున్నారు.
ఇదిలా ఉంటే తెలంగాణాలో తెలుగుదేశం రంగంలోకి దిగితే నేరుగా కాంగ్రెస్ ప్రభుత్వాన్నే విమర్శించాలి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఢీ కొట్టాలి. ఒకనాడు టీడీపీలో ఉంటూ బాబు శిష్యునిగా ముద్రపడిన రేవంత్ రెడ్డి మీదనే టీడీపీ పోరు సాగించాలన్నది ఒక వింత అయిన అనుభవమే. కానీ రాజకీయాల్లో తమ్ముడు తమ్ముడే అన్నది నీతి. సో రేవంత్ రెడ్డి మీద టీడీపీ పోరాటం సాగుతుందనే అంటున్నారు. మరో వైపు బీజేపీ ఘాటుగానే కాంగ్రెస్ ని విమర్శిస్తోంది. ఆ మిత్రపక్షంగా టీడీపీ సైతం అదే బాటలో నడవాల్సి ఉంది. సో గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో అమీతుమీకి టీడీపీ రెడీ అంటోంది. చూడాలి మరి ఏమి జరుగుతుందో.