బాబు యంగ్ టర్క్ టీం అదృశ్యమవుతోందా ?

ఇక బాబు కోర్ కమిటీగా ఒక యంగ్ టర్క్ టీం వర్క్ చేస్తూ ఉండేవి. బాబుకు బ్రైట్ ఫ్యూచర్ ఉందని నమ్మిన వారంతా అలా ఆయనతో అల్లుకుని పోయి ఆయన మేలు కోసం పనిచేసేవారు.;

Update: 2025-03-12 02:45 GMT

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుది సుదీర్ఘమైన రాజకీయ ప్రస్థానం. ఈ ప్రయాణంలో ఎందరో ఆయనకు మిత్రులు ఉన్నారు. మరెందరో శ్రేయోభిలాషులు ఉన్నారు. ఇక బాబు రాజకీయంగా కలసి మెలసి పనిచేసిన వారు ఎంతో మంది ఉన్నారు. బాబు కాంగ్రెస్ నుంచి కూడా ఎంతో మంది మిత్రులను కలిగి ఉన్నారు. ఈ రోజుకీ జాతీయ స్థాయిలో గులాబ్ నబీ అజాద్, అలాగే తెలంగాణాకు చెందిన సీనియర్ నేత వి హనుమంతరావు, వెంకయ్యనాయుడు బండారు దత్తాత్రేయ వంటి వారు బాబు సమకాలీనులుగా ఉంటూ వస్తున్నారు.

అయితే బాబు తెలుగుదేశంలోకి వచ్చాక ఆయనకు మంచి మిత్రులు అక్కడ దొరికారు. వారి మధ్య ఎమోషనల్ బాండేజ్ కూడా ఏర్పడింది. బాబు ఏజ్ గ్రూప్ వారే అంతా కావడం వల్ల కలసిమెలసి అంతా పనిచేసేవారు. యువకులుగా వీరంతా కలిసారు. బాబు 1984లో టీడీపీలో చేరారు. ఆయన 1989 దాకా ఎన్నికల్లో పోటీ చేయలేదు. అయితే పార్టీ బాధ్యతలను ఆయన చూస్తూ వచ్చారు. దాంతో ఆయనకు టీడీపీలో మంత్రులు కీలక నేతలతో మంచి సంబంధాలు ఉండేవి.

ఇక బాబు కోర్ కమిటీగా ఒక యంగ్ టర్క్ టీం వర్క్ చేస్తూ ఉండేవి. బాబుకు బ్రైట్ ఫ్యూచర్ ఉందని నమ్మిన వారంతా అలా ఆయనతో అల్లుకుని పోయి ఆయన మేలు కోసం పనిచేసేవారు. బాబు కూడా వారిని తనతో పాటే ఎదగనిస్తూ ముందుకు తీసుకుని వెళ్ళారు. అలా బాబు యంగ్ టర్క్ టీం లో విజయనగరానికి చెందిన పూసపాటి అశోక్ గజపతిరాజు అతి ముఖ్యుడు. ఈయన బాబుతో పాటే 1978లో తొలిసారి ఎమ్మెల్యేగా జనతా పార్టీ తరఫున శాసనసభకు నెగ్గారు.

బాబు ఆనాడు కాంగ్రెస్ లో మంత్రిగా ఉంటే విపక్షంలో అశోక్ ఉండేవారు. 1983 నాటికి అశోక్ టీడీపీలో చేరి వ్యవస్థాపక సభ్యుడు అయ్యారు. బాబు ఆ పార్టీలోకి వచ్చిన తరువాత వీరి స్నేహ బంధం బాగా విస్తరించింది. ఇక మంత్రిగా అనేక కీలక శాఖలను చేపడుతూ అంచెలంచెలుగా ఎదిగిన అశోక్ వెనక బాబు ఉన్నారు. అలాగే బాబు సీఎం కావడం వెనక అశోక్ ఉన్నారు.

అదే విధంగా మరో నేత యనమల రామక్రిష్ణుడు. ఈయన తుని నుంచి 1983లో తొలిసారి టీడీపీ తరఫున గెలిచారు. కీలక మంత్రిత్వ శాఖలను ఎన్టీఆర్ మంత్రివర్గంలో చూశారు. బాబుతో మంచి స్నేహం యనమలకు ఉంది. యనమల తనదైన శైలిలో ఇచ్చే సలహాలు సూచనలు కూడా యంగ్ టర్క్ టీం వెలగడానికి కారణాలుగా ఉండేవి. బాబుకు అత్యంత సన్నిహితులలో యనమల ఒకరు అని వేరుగా చెప్పాల్సింది లేరు.

అలాగే కాంగ్రెస్ నుంచి కూడా బాబుతో బంధం పెనవేసుకుని వచ్చిన వారు కర్నూలు జిల్లాకు చెందిన కేఈ క్రిష్ణ మూర్తి. ఆయన కూడా బాబు మేలు కోరుకునే వారు. బాబు కూడా ఆయనను ఎంతగానో గౌరవిస్తూ వచ్చారు. అలాగే విశాఖ జిల్లాకు చెందిన చింతకాయల అయ్యన్నపాత్రుడు బాబు టీం లో కీలక నేతగా ఉండేవారు. ఆయన బాబు కోసం ఎందాకైనా అన్నట్లుగా ఉండే ఫైర్ బ్రాండ్. శ్రీకాకుళం జిల్లాకు చెందిన మాజీ మంత్రి కిమిడి కళా వెంకటరావు, అదే జిల్లాకు చెందిన దివంగత నేత ఎర్రన్నాయుడు బాబు యంగ్ టర్క్ టీం లో అత్యంత ముఖ్యులుగా ఉండేవారు.

వీరే కాదు ఇంకా చాలా మంది బాబు యంగ్ బ్యాచ్ లో ఉండేవారు. అయితే వీరిలో చాలా మంది చనిపోయారు రాష్ట్రం వేరుపడ్డాక తెలంగాణాలో కొందరు ఉండి వేరే పార్టీలలోకి వెళ్ళారు. మరి కొందరు రాజకీయ విరామం తీసుకున్నారు. ఇక టీడీపీలో మాత్రం మిగిలిన అతి కొద్ది మందికి కంపల్సరీ రిటైర్మెంట్ ఇస్తూ బాబు ఒకనాటి యంగ్ టర్క్ టీం ని లేకుండా చేస్తున్నారా అన్న చర్చ అయితే సాగుతోంది.

నిన్న అశోక్ గజపతిరాజు, నేడు యనమల రామకృష్ణుడు టీడీపీలో ఇపుడు పదవీ రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. గత ఎన్నికల్లో పోటీ చేయకుండా అశోక్ ఉంటే ఎమ్మెల్సీ పదవి పూర్తి కావడంతో యనమల కూడా అదే బాట పట్టారు. అయ్యన్న రాజకీయాల నుంచి రాజ్యాంగ పదవిలోకి వచ్చేశారు. కేయీ క్రిష్ణమూర్తి పాలిటిక్స్ కి విరామం ప్రకటించారు. కళా వెంకట్రావు కూడా సీనియర్ కోటాలో ఉన్నారు కాబట్టి జస్ట్ ఎమ్మెల్యేగానే ఉన్నారు.

మొత్తానికి చూస్తే తెలుగుదేశం పార్టీలో 1995 ఎపిసోడ్ లో బాబు చుట్టూ కనిపించి ఆయన సీఎం గా ఉండడానికి తెర వెనక తెర ముందు ఎంతో కృషి చేసిన వారు టీడీపీలో తమ జీవితాన్ని మొదలెట్టి ఆ పార్టీ ఎదుగుదలలో భాగం అయిన వారు అంతా ఇపుడు సైడ్ అవుతున్నారు. బాబు టీం అలా పక్కకు జరిగితే అదే ప్లేస్ లోకి లోకేష్ టీం మెల్లగా ఎంటర్ అవుతోంది. 2029 నాటికి దీని మీద పూర్తి చిత్రం ఆవిష్కృతం అవుతుంది అని అంటున్నారు.

Tags:    

Similar News