ఫార్ములా ఈ-రేస్ కేసు.. మరో కీలక నిర్ణయం తీసుకున్న ఏసీబీ!

ఫార్ములా ఈ-రేసు కేసు తెలంగాణలో తీవ్ర సంచలనంగా మారిన సంగతి తెలిసిందే.

Update: 2025-01-16 13:17 GMT

ఫార్ములా ఈ-రేసు కేసు తెలంగాణలో తీవ్ర సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ఇప్పటికే బీఆరెస్స్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, అరవింద్ కుమార్, బీ.ఎల్.ఎన్. రెడ్డిలకు నోటీసులు ఇచ్చిన ఏసీబీ.. ఈ ముగ్గురి నుంచీ కీలక సమాచారం సేకరించినట్లు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో మరో వ్యక్తికి నోటీసులు అందించింది తెలంగాణ ఏసీబీ!

అవును... ఫార్ములా ఈ-రేసు కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇందులో భాగంగా... గ్రీన్ కో మేనేజింగ్ డైరెక్టర్ అనిల్ కుమార్ చలమశేట్టికి తెలంగాణ ఏసీబీ సమన్లు జారీ చేసింది. ఈ నెల 18 లోపు కోర్టుకు హాజరుకావాలని కోరింది. దీంతో... ఈ విషయం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

కాగా... అప్పటి మున్సిపల్ శాఖ మంత్రిగా వ్యవహరించిన కేటీఆర్ ను ప్రధాన నిందితుడి (ఏ1) గా పేర్కొంటూ ఈ కేసులో తెలంగాణ ఏసీబీ నమోదు చేసిన కేసు తీవ్ర సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. ఫార్ములా ఈ-రేసు వ్యవహారంలో నమోదైన ఈ కేసులో అరవింద్ కుమార్ (ఏ2), చీఫ్ ఇంజినీర్ బీ.ఎల్.ఎన్. రెడ్డి (ఏ3) లనూ ఎఫ్.ఐ.ఆర్. లో చేర్చింది

ఈ నేపథ్యంలో తాజాగా గ్రీన్ కో సంస్థ ఎండీకి సమన్లు జారీ చేసింది ఏసీబీ. మరోపక్క ఫార్ములా ఈ-రేస్ నిర్వహించిన గ్రీన్ కో సంస్థ బీఆరెస్స్ పార్టీకి రూ.41 కోట్ల ఎలక్టోరల్ బాండ్లు చెల్లించినట్లు ప్రభుత్వం ఇటీవల వెల్లడించిన సంగతీ తెలిసిందే.

7 గంటల పాటు కేటీఆర్ ను విచారించిన ఈడీ!:

తీవ్ర సంచలనంగా మారిన ఫార్ములా ఈ-రేస్ కేసులో మాజీ మంత్రి కేటీఆర్ ను ఈడీ అధికారులు సుమారూ 7 గంటల పాటు ప్రశ్నించారు. ఉదయం 10:40 గంటల ప్రాంతంలో మొదలైన విచారణ.. సాయంత్రం 5:30 గంటల వరకూ జరిగింది! ఇందులో ప్రధానంగా.. విదేశీ సంస్థకు రూ.45.7 కోట్ల బదిలీ వ్యవహారంపై ప్రశ్నించినట్లు తెలుస్తోంది.

ఇదే సమయంలో... హెచ్.ఎం.డీ.ఏ. అకౌంట్ నుంచి విదేశీ సంస్థకు నిధుల బదిలీపై ఈడీ అధికారులు ఆరా తీసినట్లు చెబుతున్నారు. ఈ కేసులో ఇప్పటికే బీ.ఎల్.ఎన్. రెడ్డి, అర్వింద్ కుమార్ ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా ఈడీ అధికారులు విచారించారు.

Tags:    

Similar News