ఐదేళ్లు జగన్ చేసేందేమీ లేదు : సినీ నిర్మాత ఆదిశేషగిరిరావు

ఇటీవల మీడియాతో మాట్లాడిన ఆదిశేషగిరిరావు మాజీ ముఖ్యమంత్రి జగన్ పై ఈ స్థాయిలో ఫైర్ అవ్వడం రాజకీయంగా హీట్ పుట్టిస్తోంది.

Update: 2025-02-05 04:52 GMT

ముఖ్యమంత్రిగా రాష్ట్రాన్ని ఐదేళ్లు పాలించిన వైసీపీ అధినేత జగన్ రాష్ట్రానికి ఒక్క మంచిపని కూడా చేయలేదని ప్రముఖ సినీ నిర్మాత, సూపర్ స్టార్ మహేశ్ బాబు బాబాయ్ ఘట్టమనేని ఆదిశేషగిరిరావు విమర్శించారు. చంద్రబాబు, ఆయన కుటుంబాన్ని దుర్భాషలాడటానికే జగన్, ఆయన మంత్రులు సమయం కేటాయించారని ఆరోపించారు. చంద్రబాబు, ఆయన కుటంబాన్ని ఎలా బాధపెట్టాలా? అనేది మాత్రమే ఆలోచించారని, రాష్ట్ర అభివృద్ధి, పాలన వ్యవహారాలను గాలికి వదిలేశారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇటీవల మీడియాతో మాట్లాడిన ఆదిశేషగిరిరావు మాజీ ముఖ్యమంత్రి జగన్ పై ఈ స్థాయిలో ఫైర్ అవ్వడం రాజకీయంగా హీట్ పుట్టిస్తోంది.

ఒకప్పుడు వైసీపీతో అనుబంధం కొనసాగించిన నిర్మాత ఆదిశేషగిరిరావు కొన్నాళ్లుగా ఆ పార్టీకి దూరంగా ఉంటున్నారు. ప్రస్తుతం తాడేపల్లిలో జగన్ నివాసం ఉంటున్న ఇంటి స్థలం ఆదిశేషగిరిరావు వద్ద కొనుగోలు చేసినదే.. జగన్ తాడేపల్లిలో నివసించేలా తన స్థలంలో ఇల్లు నిర్మించుకోవాలని అప్పట్లో ఆదిశేషగిరిరావు సూచించారట. ఆయన సూచనలతోనే జగన్ తాడేపల్లిలో ఇల్లు నిర్మించుకున్నారని చెబుతారు. అయితే ఆదిశేషగిరిరావు అన్న సూపర్ స్టార్ క్రిష్ణ అల్లుడు గల్లా జయదేవ్ టీడీపీ తరఫున గతంలో గుంటూరు ఎంపీగా పనిచేయడంతో ఆయన కూడా టీడీపీలో చేరారు. ఈ నేపథ్యంలో ఆ పార్టీకి బ్యాక్ ఎండ్ లో పనిచేసే కొద్ది మందిలో ఆదిశేషగిరిరావు ఒకరుగా చెబుతారు.

అయితే తాజాగా ఏపీకి వచ్చిన ఆదిశేషగిరిరావు మాజీ సీఎం జగన్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రజలు ఐదేళ్లు పాలించమని అధికారం అప్పగిస్తే.. ఆయన విధ్వంసకర రాజకీయాలే చేశారన్నారు. ఎంతసేపు చంద్రబాబు కుటుంబాన్ని వేధించడానికి సమయం కేటాయించారే తప్ప, ఒక్క ముఖ్యమైన పని కూడా చేయలేదని విమర్శించారు. మూడు రాజధానుల ప్రతిపాదనతో భారీ విధ్వంసానికి పాల్పడ్డారని ఆక్షేపించారు. రాజధాని తరలింపు జగన్ ఇమేజ్ ను దెబ్బతీసిందని చెప్పారు. సామాన్య ప్రజలకు మేలు చేసే ఒక్క పథకాన్ని జగన్ తీసుకురాలేకపోయారని, తన పాలనకు గుర్తుగా ఏ పనీ చేయలేదని తెలిపారు.

కాగా, జగన్ పాలనలో ఐదేళ్ల పాటు విధ్వంసం చోటుచేసుకుందని వ్యాఖ్యానించిన ఆదిశేషగిరిరావు.. చంద్రబాబు ప్రమాణస్వీకారానికి హాజరైన సమయంలో ఆనంద భాష్పాలతో కన్నీరు పెట్టుకున్నారు. రాష్ట్రానికి మంచి రోజులు వచ్చాయని సంబర పడ్డారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు 4వసారి బాధ్యతలు స్వీకరించిన సమయంలో ఆదిశేషగిరిరావు తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. ఆ సమయంలో ఆయన వీడియోలు వైరల్ అయ్యాయి.

Tags:    

Similar News