పడతులపై పాపాల్లో ప్రజా ప్రతినిధులు.. ఏపీలో 21 మంది సంచలన రిపోర్ట్
అయితే.. బాధ్యతాయుత ప్రజాప్రతినిధులు కూడా ఇందుకు అతీతులు కాదన్నది ఈ రిపోర్టు చెబుతున్న విషయం.
పడతులపై పాపాలకు ఒడిగడుతున్న వారిలో పోకిరీలే కాదు.. ప్రజాప్రతినిధులు కూడా ఉన్నారని తాజాగా అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్(ఏడీఆర్) సంచలన రిపోర్టును వెలువరించింది. సాధారణంగా మహిళలపై దాడులు చేసేవారు.. అత్యాచారా లు చేసి హత్యలు చేసేవారు.. పోకిరీలనే భావన ఉంది. ఇది వాస్తవమే. అయితే.. బాధ్యతాయుత ప్రజాప్రతినిధులు కూడా ఇందుకు అతీతులు కాదన్నది ఈ రిపోర్టు చెబుతున్న విషయం. దేశవ్యాప్తంగా పార్లమెంటు, అసెంబ్లీలకు ఎన్నికైన ప్రజప్రతినిధుల్లో 151 మందిపై మహిళలకు సంబంధించిన నేరాలు ఉన్నాయని ఏడీఆర్ స్పష్టం చేసింది.
2019-24 మధ్య జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసి, గెలుపు గుర్రం ఎక్కిన అసెంబ్లీ, పార్లమెంటు అభ్యర్థులు సమర్పించిన ఎన్నికల అఫిడవిట్ల ఆధారంగా(అంటే.. స్వయంగా తమపై ఏయే కేసులు ఉన్నాయో వారే చెప్పినట్టు) ఏడీఆర్ ఈ నివేదికను వెలువరించ డం గమనార్హం. ఆయా కేసుల్లో అత్యాచారాలు, బెదిరింపులు, లైంగిక వేధింపులకు సంబంధించినవి ఉన్నాయని నివేదిక తెలిపిం ది. ప్రస్తుతం పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతాలో ఉన్న ఆర్జీకర్ ఆసుపత్రిలో జరిగిన జూనియర్ వైద్యురాలి హత్యాచార ఘటన నేపథ్యంలో ఈ విషయాలు అత్యంత ఆసక్తిగా మారాయి.
మహిళలకు భద్రతగా ఉండాల్సిన ప్రజాప్రతినిధులపైనే ఇలాంటి ఘోరాలు, నేరాలు నమోదు కావడం అందరినీ విస్మయానికి గురి చేస్తుండడం గమనార్హం. మరీ ముఖ్యంగా పశ్చిమ బెంగాల్‌లోనే 25 మంది ప్రజాప్రతినిధులపై మహిళలపై దాడులు, ఇతర త్రా కేసులు నమోదై ఉండడం విస్మయం కలిగిస్తోంది. ఇక, ఆంధ్రప్రదేశ్ లో ఇలాంటి కేసులు ఎదుర్కొంటున్నవారి సంఖ్య 21గా ఉంది. వెనుక బడిన రాష్ట్రంగా పేరున్న ఒడిశాలో 17 మందిపైనా ఈ తరహా కేసులు ఉన్నాయి. మొత్తం 16 మంది పార్లమెంటు సభ్యులు, 135 మంది శాసన సభ్యులు మహిళలపై దాడులకు, నేరాలకు పాల్పడినట్టు ఈ నివేదిక స్పష్టం చేసింది.
ఏయే తరహా కేసులు..
+ మహిళలను అపహరించి విక్రయించడం.
+ మహిళలపై లైంగిక దాడులు.
+ అత్యాచారాలు, హత్యలు.
+ మహిళలపై బెదిరింపులు, కొట్టడం, చిత్రహింసలకు గురిచేయడం.
+ గృహ హింస.. ఆస్తులు లాక్కోవడం.
ఎవరెవరు..? ఎంత మంది?
+ పశ్చిమ బెంగాల్‌లో: 25 మంది
+ ఏపీలో: 21 మంది
+ ఒడిశాలో : 17 మంది
+ బీజేపీకి చెందిన వారే 54 మంది ప్రజాప్రతినిధులు ఉన్నారు.
+ కాంగ్రెస్ పార్టీకి చెందిన వారు 24 మంది ఉన్నారు.
+ నేరాలు రుజువైతే 10 ఏళ్లు లేదా జీవిత ఖైదు పడే అవకాశం.