పాక్ లోనూ 'డిపోర్టేషన్'.. శరణార్థుల ప్రాణాలు అరచేతిలో

అయితే, అసలు భూమ్మీద జీవనం దుర్భరంగా సాగే పాకిస్థాన్ కూడా డిపోర్టేషన్ చేస్తోంది.. అయితే, అదేమంత సవ్యంగా కాదు.

Update: 2025-02-19 22:30 GMT

డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడు అయ్యాక ప్రధానంగా ఫోకస్ పెట్టిన అంశం అక్రమ వలసదారుల ఏరివేత (డిపోర్టేషన్). ఈ క్రమంలో భారత్ సహా అనేక దేశాలకు చెందినవారిని వారి స్వదేశాలకు పంపేశారు. ఇదే బాటలో బ్రిటన్ కూడా గత వారం కొన్ని చర్యలు చేపట్టింది.. భారత్ సైతం అక్రమ వలసదారులు అంటూ ఢిల్లీలో కొందరిని గుర్తించింది. అయితే, అసలు భూమ్మీద జీవనం దుర్భరంగా సాగే పాకిస్థాన్ కూడా డిపోర్టేషన్ చేస్తోంది.. అయితే, అదేమంత సవ్యంగా కాదు.

పాకిస్థాన్ పొరుగునే ఉండే అఫ్ఘానిస్థాన్. దశాబ్దాలుగా అఫ్ఘాన్ లో అశాంతిని ప్రోత్సహించింది పాక్. తాలిబన్లను నెత్తిన పెట్టుకుంది. అలాంటి తాలిబన్లే ఇప్పుడు పాక్ కు ఎదురుతిరుగుతున్నారు. దీంతో పాక్ తన వైఖరి మార్చుకుంది. అఫ్ఘాన్ ప్రజలను శత్రువులుగా చూడడం మొదలుపెట్టింది. తాజాగా తమ దేశంలో ఉంటున్న

అఫ్గానిస్థాన్‌ శరణార్థులందరినీ బహిష్కరించాలని ఆ దేశం యోచిస్తోంది. ఇస్లామాబాద్‌ లోని అఫ్గాన్‌ రాయబార కార్యాలయం ఈ విషయం వెల్లడించి.. పాక్ నిర్ణయాన్ని తీవ్రంగా ఖండించింది.

పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్‌ సమీపంలో ఉండే రావల్పిండి నగరంలో అఫ్ఘాన్లు ఆశ్రయం పొందుతున్నారు. ఇలాంటివారి గురించి గాలింపు చేపట్టి, అరెస్టు చేయడానికి పాక్‌ సిద్ధం అవుతోంది. దీంతో శరణార్థులు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని అఫ్ఘాన్ ఎంబసీ సూచించింది. శరణార్థుల విషయంలో తమను పాక్ ముందుగా సంప్రదించలేదని చెబుతోంది.

అఫ్ఘాన్ శరణార్థులను సాగనంపడంపై పాక్ విదేశాంగ మంత్రిత్వ శాఖ కూడా స్పందించింది. రావల్పిండి నుంచి మాత్రమే కాక దేశంలోని అందరు అఫ్గాన్ శరణార్థులను బహిష్కరిస్తామని తేల్చిచెప్పింది. అక్రమంగా నివసిస్తున్న లక్షలమందితో పాటు, దాదాపు 1.45 మిలియన్ల అఫ్గాన్లు యూఎన్‌ రెఫ్యూజీ ఏజెన్సీలో శరణార్థులుగా నమోదు చేసుకున్నారని పేర్కొంది. వీరనికి 2025 జూన్ వరకు గడువు పొడిగించామని అప్పటివరకు అరెస్టు చేయమని పాక్‌ పేర్కొంది. దీనిని అఫ్గాన్‌ ఎంబసీ ఖండించింది. పాక్ ను వీడి వెళ్లడానికి శరణార్థులకు ఇంత తక్కువ సమయమా? అని ప్రశ్నించింది. పాక్‌ ది నిరంకుశ స్వభావం అని మండిపడింది.

రెండేళ్ల కిందట సైతం 17 లక్షల మంది అఫ్గాన్ శరణార్థులను పాకిస్థాన్ తరిమేసింది. శరణార్థులకు పునరావాసం తాత్కాలికం.. శాశ్వతం కాదు అనేది పాక్ వాదన. శరణార్థుల కారణంగా తమకు ఇబ్బంది ఎదురవుతోందనేది పాక్ అభిప్రాయం.

ఇటీవల తాలిబన్ ప్రభుత్వం మద్దతు ఉన్న ఉగ్రవాదులు పాకిస్థాన్ లో దాడులకు పాల్పడిన సంగతి తెలిసిందే. ముందుగా పాక్ చేసిన పని ప్రీతీకారంగా వారు ఈ చర్యలకు దిగారు. అందుకని పాక్ ఇప్పుడు అఫ్ఘాన్లను వెళ్లగొడుతోంది.

Tags:    

Similar News