అక్షయ్ కుమార్ పొలిటికల్ ఎంట్రీ... నియోజకవర్గం ఇదే!
అవును... సాధారణంగా సినిమా ఇండస్ట్రీని - రాజకీయాలనూ వేరు చేసి చూడలేమనే కామెంట్లు అప్పుడప్పుడూ వినిపిస్తుంటాయి
లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ సరికొత్త పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇందులో భాగంగా... పలువురు సినీనటులు, క్రీడాకారుల పేర్లు.. వారి వారి పొలిటికల్ ఎంట్రీకి సంబంధించిన వార్తలు ఇప్పుడు మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. దీంతో... వారి వారి ప్రస్తుత రంగాల్లో రాణించిన వారు.. పొలిటికల్ రంగంలో ఏ మేరకు రాణిస్తారనే చర్చ మొదలవుతుంది.
అవును... సాధారణంగా సినిమా ఇండస్ట్రీని - రాజకీయాలనూ వేరు చేసి చూడలేమనే కామెంట్లు అప్పుడప్పుడూ వినిపిస్తుంటాయి. సినిమా ఇండస్ట్రీ తర్వాత మజిలీ పాలిటిక్స్ అనే విషయాన్ని ఇప్పటికే పలువురు రుజువు చేశారని చెబుతుంటారు! ఈ క్రమంలో పలువురు క్రికెటర్లు కూడా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చి బాగానే సక్సెస్ అవుతున్నారు! ఈ సమయంలో అక్షయ్ కుమార్ పేరు తెరపైకి వచ్చింది.
ఇందులో భాగంగా... బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ వచ్చే లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగబోతున్నారని కథనాలొస్తున్నాయి. ఈ క్రమంలో ఇప్పటికే బీజేపీ పెద్దలు అక్షయ్ ను సంప్రదించారని.. అందుకు ఒక నియోజకవర్గాన్ని కూడా ప్రస్థావించారని నేషనల్ మీడియాలో వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. అయితే... ఈ విషయంలో అక్షయ్ అభిప్రాయంపై మాత్రం ఇంకా స్పష్టత రావాల్సి ఉందని తెలుస్తుంది.
ప్రధానంగా... దేశ రాజధాని ఢిల్లీలో జెండా పాతాలని బీజేపీ తీవ్రంగా ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే! ఈ క్రమంలో ఢిల్లీలో గతంలో గెలిచిన 7 లోక్ సభ స్థానాలనూ తిరిగి దక్కించుకోవాలనే పట్టుదలతో కమలదళం ఉందని అంటున్నారు. ఈ సమయంలో చాంద్ నీ చౌక్ నియోజకవర్గం నుంచి అక్షయ్ కుమార్ ని బరిలోకి దింపాలని భావిస్తుందని అంటున్నారు.
వాస్తవానికి సినిమాల్లోకి రాకముందు అక్షయ్ కుమార్ చాలా సంవత్సరాల పాటు ఢిల్లీ చాంద్ నీ చౌక్ ప్రాంతంలో నివసించారు. ఈ నేపథ్యలో స్థానికతను దృష్టీలో ఉంచుకుని.. ఈ నియోజకవర్గం నుంచి అక్షయ్ ని బరిలోకి దింపితే అన్ని రకాలుగానూ కలిసి వస్తుందనే ఆలోచనలో కమలం పెద్దలు ఉన్నారని అంటున్నారు. మరి ఈ విషయంపై ఖిలాడీ ఎలా రియాక్ట్ అవుతారనేది వేచి చూడాలి!!
కాగా... 2014, 2019 ఎన్నికల్లో హస్తినలోని అన్ని లోక్ సభ స్థానాలనూ బీజేపీ కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో 2024 ఎన్నికల్లోనూ అదే ఊపు కంటిన్యూ చేయాలని భావిస్తోంది. మరోపక్క పొత్తులో భాగంగా... ఈ ఏడు స్థానాల్లోని మూడు స్థానాల్లో ఆప్, నాలుగు స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు బరిలోకి దిగనున్నారని అంటున్నారు.