వైఎస్సార్ సొసైటీ గృహాలు.. మాజీ మంత్రుల అనుచరుల టోకరాలు!

గత ప్రభుత్వ హయాంలో జరిగిన మోసాలు, దారుణాలపై విజయవాడ ప్రజలు పెద్ద ఎత్తున ఫిర్యాదులు చేశారు.

Update: 2024-11-26 05:30 GMT

గత ప్రభుత్వ హయాంలో జరిగిన మోసాలు, దారుణాలపై విజయవాడ ప్రజలు పెద్ద ఎత్తున ఫిర్యాదులు చేశారు. మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన "జనవాణి" కార్యక్రమంలో మంత్రి కందుల దుర్గేష్ వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా పలు సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.


అవును... గత ప్రభుత్వ హయాంలో వైఎస్సార్ సొసైటీ గృహాల పేరిట మాజీ మంత్రి జోగి రమేష్, వెల్లంపల్లి శ్రీనివాస్ ల అనుచరులు తమ వద్ద డబ్బు వసూలు చేసి, నకిలీ ఇళ్ల పట్టాలు ఇచ్చారని ఆరోపిస్తూ విజయవాడ అజిత్ సింగ్ నగర్ కు చెందిన బాధితులు వాపోయారు. ఈ సందర్భంగా పలువురి పేర్లు తెరపైకి తెచ్చారు.


ఇందులో భాగంగా.. వైసీపీ కార్యకర్తలు కొల్లాటి హరిబాబు, నాగరాజులు తమ వద్ద నుంచి సింగిల్ బెడ్ రూం ఇళ్లకు రూ.3 లక్షలు, డబుల్ బెడ్ రూం ఇళ్లకు రూ.6 లక్షల చొప్పున వసూలు చేశారాని, అనంతర మోసం చేశారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారిని నిలదీస్తే మాజీ మంత్రుల పేర్లు చెబుతున్నారని వాపోయారు.

గత ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో కురిసిన భారీ వర్షాలకు రేపల్లె డ్రెయిన్ పొంగి తమ పొలాలు మునిగిపోయాయని, ఆ సమయంలో ప్రభుత్వ ఆదేశాలతో పంట నష్టం అంచనాకు వచ్చిన వ్యవసాయ అధికారులు చేతివాటం చూపారని ఆరోపిస్తూ.. వేమూరు నియోజకవర్గం, పెరవలి రెవెన్యూ గ్రామ పరిధిలోని సుమారు 100 మంది బాధిత రైతులు జనవాణిలో ఫిర్యాదు చేశారు.

ఇదే సమయంలో... వైసీపీ మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి అనుచరులు తన నాలుగు అంతస్తుల భవనాన్ని ఆక్రమించారంటూ పల్నాడు జిల్లా గురజాల మండలానికి చెందిన అరిగెల అరుణ్ ఫిర్యాదు చేశారు. నాటి పోలీసు ఉన్నతాధికారులైన విశాల్ గున్నీ, రవిశంకర్ వారికి అనుకూలంగా పనిచేశారని తెలిపారు.

ఇదే క్రమంలో... చిత్తూరు జిల్లా, బంగారుపాళ్యం మండల పరిధిలోని సంక్రాంతిపల్లెలో ఉన్న పీర్లగుడి ధర్మరాజులు దేవాలయానికి చెందిన 18 ఎకరాల భూమిపై అక్రమార్కుల కన్ను పడిందని, వారి నుంచి పీర్ల గుడి భూములకు శాశ్వత రక్షణ కల్పించాలని కోరుతూ ఆ గ్రామ ప్రజలు వినతిపత్రం ఇచ్చారు.

Tags:    

Similar News