ఆర్నెల్లలో రూ.293 కోట్ల దోపిడీ.. రోజుకు రూ.1.62 కోట్ల మోసం

అసలు మనల్ని కలిసే చాన్స్ లేనివారు మనతో మాట్లాడుతూ మన డబ్బును కొల్లగొట్టేస్తున్నారు. అదే సైబర్ క్రైం.

Update: 2024-12-28 16:30 GMT

మన ఇంట్లో మనకు తెలియకుండా మన ఆస్తిని ఎవరైనా దోచేస్తే దాన్ని దొంగతనం అంటారు. మనకు తెలిసిన వారు మనల్ని నమ్మించి మన డబ్బు దోచేస్తే దాన్ని మోసం అంటాం.. కానీ ముక్కు ముఖం తెలియని వారు.. ఎప్పుడూ ఒకసారి కూడా కలవని వారు. అసలు మనల్ని కలిసే చాన్స్ లేనివారు మనతో మాట్లాడుతూ మన డబ్బును కొల్లగొట్టేస్తున్నారు. అదే సైబర్ క్రైం. వైట్ కాలర్ నేరాల్లో ఇప్పుడు ఎక్కువగా జరుగుతున్నవి ఈ సైబర్ దోపిడీలే..

పోలీసు, సీబీఐ, ఈడీ అధికారులమంటూ నకిలీ ఫోన్లు చేసి కొందర్ని, తమ సంస్థల్లో పెట్టుబడి పెడితే రెండు మూడు రెట్లు లాభాలు.. పెట్టుబడి పెట్టిన గంటలోనే కళ్లు చెదిరే రిటర్న్స్ అంటూ మరికొందర్ని.. కొరియర్, పార్సిల్ కార్యాలయం నుంచి ఫోన్లు చేస్తున్నామని, బ్యాంకర్లమని చెబుతూ మనకు ఫోన్ చేసి ఓటీపీలు చెప్పాలని మరికొందరిని మోసం చేయడం పరిపాటిగా మారింది. అయితే వీటిపై చైతన్యం రావడంతో కొందరు ఈ మాయల్లో పడటం లేదని డిజిటల్ మోసగాళ్లు ఇప్పుడు కొత్త మోసానికి తెరలేపుతున్నారు. అదే డిజిటల్ అరెస్టులు. ఏదో తప్పుచేశారని, మీ బంధువులు తమ అదుపులో ఉన్నారని, పోలీసు, జడ్జి వేషాల్లో ఉంటున్ననేరగాళ్లు ఫోన్లు చేసి డిజిటల్ అరెస్టులు అంటూ నిలువు దోపిడీ చేస్తున్నారు.

ఇటీవల కాలంలో పెరిగిపోయిన డిజిటల్ అరెస్టుల మోసంపై ప్రభుత్వం కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేస్తోంది. డిజిటల్ అరెస్టుకు ఎలాంటి చట్టం లేదని, ఎవరైనా డిజిటల్ అరెస్టు అంటే అది బూటకమని చెబుతోంది. కానీ, ప్రతిరోజూ కొన్ని వందల మంది ఈ తరహా మోసాలకు బలైపోతున్నారు. ఒక్క ఏపీలోనే రోజుకు సగటున 138 మంది తాము డిజిటల్ మోసాలకు బలైపోయామని సైబర్ క్రైం పోలీసులను ఆశ్రయిస్తున్నారు.

గత అర్నెల్లలో ఏపీలో రూ.293 కోట్ల రూపాయల మేర మోసపోయినట్లు ఫిర్యాదులు అందాయి. అంటే సగటున రోజుకు రూ.1.62 కోట్లను సబర్ నేరగాళ్లు దోచేస్తున్నారని సైబర్ పోలీసులు విడుదల చేసిన ఓ నివేదికలో తెలిపారు. ఈ నేరాలు గత ఏడాది కన్నా ఈ ఏడాది ఎక్కువైనట్లు గణాంకాలు చెబుతున్నాయి. గత ఏడాది సైబర్ నేరాలకు సంబంధించి ఇండియన్ సైబర్ క్రైం కో ఆర్డినేషన్

సెంటర్ (ఐ4సీ)కి 33,507 ఫిర్యాదులు వచ్చాయి. రూ.374.19 కోట్ల మేర బాధితులు దోపిడీకి గురయ్యారు. అంటే గత ఏడాది సగటున 93 ఫిర్యాదులు వస్తే, ఇప్పుడు ఆ సగటు 138కి పెరిగింది.

గత ఆరు నెలల్లో సైబర్ నేరగాళ్ల నుంచి 25 వేల ఫోన్ కాల్స్ వచ్చినట్లు సైబర్ రికార్డులు చెబుతున్నాయి. అయితే చాలా మంది తాము మోసపోకుండా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నా, కొందరు తేలిగ్గా దొరికిపోతూ నిలువు దోపిడీకి గురవుతున్నారు. మోసగాళ్ల చేతిలో మోసపోయిన వారి నుంచి డబ్బు రికవరీ చేయడమూ కష్టంగా మారుతోంది. రాష్ట్రంలో సాధారణ దొంగతనాలు, దోపిడీలు, మోసాల కేసులతో పోల్చితే సైబర్ నేరాల్లోనే ఎక్కువ మొత్తంలో నష్టపోతున్నారు. గత ఏడాది ఏపీలో ఆర్థిక నేరాలు, దొంగతనాల్లో రూ.79.5 కోట్లను ప్రజలు నష్టపోయారు. అదే సమయంలో సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోయి రూ.374.19 కోట్లు కోల్పోయారు. ఇక ఈ ఏడాది కేవలం ఆర్నెల్లోనే రూ.293 కోట్లు కోల్పోయారు. అంటే సాధారణ నేరాల్లో కోల్పోతున్న డబ్బుకు ఏడెనిమిది రెట్లే అధికంగా సైబర్ నేరాల్లో కోల్పోతున్నారు.

ఏటా పెరుగుతున్న సైబర్ నేరాలపై ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. రికవరీ కూడా కష్టంగా మారుతుండటం వల్ల చాలా మంది గుర్తు తెలియని ఫోన్ నుంచి కాల్ వస్తేనే హడలిపోతున్నారు. తెలిసిన వారు వేరే నంబర్ నుంచి కాల్ చేసినా లిఫ్ట్ చేయడానికి ఆలోచిస్తున్నారు. కానీ, మోసపోతున్న వారి సంఖ్య ఏటా పెరుగుతూనే ఉంది. 2021 నుంచి 2024 జులై వరకు రూ.940 కోట్లు నష్టపోతే, ఈ ఏడాది జులై నుంచి డిసెంబర్ వరకు రూ.293 కోట్లు నష్టపోయారు. అంటే గత నాలుగేళ్ల కన్నా అధికంగా గత ఆర్నెల్లలో సైబర్ దోపిడీదారులు రెచ్చిపోయారు. సో.. ఎవరైనా సరే సైబర్, డిజిటల్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాల్సివుంది.

Tags:    

Similar News