మీరు రెడ్ బుక్ రాసుకోండి కార్యకర్తలకు జగన్ పిలుపు
ఇటీవల తనను కలిసిన కార్యకర్తలు రెడ్ బుక్ వేధింపులను జగన్ దృష్టికి తీసుకువెళితే అందుకు ప్రతిస్పందనగా కార్యకర్తలు ఎవరికి వారు రెడ్ బుక్ ఓపెన్ చేయాలని జగన్ చెబుతున్నారని సమాచారం.
రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్నారని నిత్యం విమర్శిస్తున్న ప్రతిపక్ష వైసీపీ ఇప్పుడు తమ కార్యకర్తలు కూడా రెడ్ బుక్ రాయమని సలహా ఇస్తోంది. కూటమి ప్రభుత్వంలో వైసీపీ కార్యకర్తలను ఇబ్బంది పెడుతున్న అధికారుల పేర్లు కార్యకర్తలే గుర్తుంచుకునేలా రెడ్ బుక్ రాసుకుంటే పార్టీ అధికారంలోకి వచ్చాక ఆయా అధికారులపై చర్యలు తీసుకుంటామని అధినేత జగన్ అభయమిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇటీవల తనను కలిసిన కార్యకర్తలు రెడ్ బుక్ వేధింపులను జగన్ దృష్టికి తీసుకువెళితే అందుకు ప్రతిస్పందనగా కార్యకర్తలు ఎవరికి వారు రెడ్ బుక్ ఓపెన్ చేయాలని జగన్ చెబుతున్నారని సమాచారం.
రెడ్ బుక్ అనగానే మంత్రి నారా లోకేశ్ టక్కున గుర్తుకు వస్తారు. ప్రతిపక్షంలో ఉండగా 2023లో యువగళం పాదయాత్ర చేసిన లోకేశ్ అప్పట్లో అధికార పార్టీ నేతలు, అధికారులు టీడీపీ కార్యకర్తలను వేధిస్తున్నారని, అటువంటి వారి పేర్లను ఎర్ర బుక్ లో రాస్తున్నానని, తాము అధికారంలోకి రాగానే వడ్డీతో సహా తిరిగి చెల్లించే బాధ్యత తాను తీసుకుంటానని విస్తృతంగా ప్రచారం చేశారు. చెప్పినట్లే అధికారంలోకి వచ్చిన తర్వాత రెడ్ బుక్కులో పేర్లు ఉన్నాయని చెబుతున్న అధికారులకు పోస్టింగులు ఇవ్వకుండా వెయిటింగులో పెట్టేశారు. పోలీసు అధికారులనైతే వీఆర్ కు పంపారు. అదేవిధంగా మాజీ మంత్రి కొడాలి నాని, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై కేసులు నమోదు చేయడంతోపాటు వారిని అరెస్టు చేసేందుకు ప్రయత్నాలు చేశారు. ఇప్పటికే రెడ్ బుక్ లో రెండు చాప్టర్లు పూర్తి చేశామని, త్వరలో మూడో చాప్టర్ తెరుస్తానని మంత్రి హోదాలో లోకేశ్ స్వయంగా ప్రకటించారు. దీంతో వైసీపీ నేతలు, కార్యకర్తలు అప్పట్లో వైసీపీకి అనుకూలంగా పనిచేశారని ప్రచారంలో ఉన్న అధికారులు రెడ్ బుక్ పేరు చెబితేనే హడలిపోయే పరిస్థితి నెలకొంది. దీంతో నేతలు, కార్యకర్తలు రెడ్ బుక్ అమలుపై మాజీ సీఎం జగన్ కు వరుస ఫిర్యాదులు చేస్తున్నారు. అదేవిధంగా ఢిల్లీలో ధర్నా చేసిన సమయంలో కూడా జగన్ రెడ్ బుక్ పై తీవ్ర ఆరోపణలు చేశారు.
ఈ పరిస్థితుల్లో టీడీపీ రెడ్ బుక్ పేరుతో వేధిస్తుంటే తాము గుడ్ బుక్ రాస్తామని, మంచి చేసిన వారిని, పార్టీ కోసం కష్టపడి పనిచేసిన వారిని ఆ బుక్ ద్వారా గుర్తుంచుకుని అధికారంలోకి రాగానే న్యాయం చేస్తామని గతంలో జగన్ ప్రకటించారు. ఇక వైసీపీకి చెందిన మాజీ మంత్రి అంబటి గ్రీన్ బుక్ రాస్తానని చెప్పారు. ఇలా రెడ్ బుక్ స్థానంలో వైసీపీ రెండు పుస్తకాలు రాస్తామని చెప్పారు. ఆ రెండు పుస్తకాలు రాస్తున్నారో లేదో కానీ, ఇప్పుడు కార్యకర్తలే రెడ్ బుక్ రాసుకోవాలని చెప్పడం క్యాడర్ లో హుషారు తెప్పిస్తోందంటున్నారు.
కూటమి ప్రభుత్వంలో వైసీపీ నేతలు, కార్యకర్తలపై వరుస కేసులు నమోదవుతున్న సమయంలో వారిన ఓదార్చేందుకు మాజీ సీఎం జగన్ రెడ్ బుక్ రాయాలని పురమాయిస్తున్నారా? లేక నిజంగా ఎక్కడికక్కడ రెడ్ బుక్ రాస్తామని చెప్పడం ద్వారా క్షేత్రస్థాయి నుంచి అధికారులను అదుపులో పెట్టే ప్లాన్ చేశారా? అన్నది చర్చనీయాంశంగా మారింది. ఏదిఏమైనా ఏపీలో రాజ్యాంగం బదులుగా అన్ని పార్టీలూ రెడ్ బుక్ అంటూ కొత్త పుస్తకాలు రాసుకోవడం విచిత్రంగా ఉందని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.