విశాఖ డెయిరీ పై అయ్యన్నపాత్రుడు కన్నేశారా?
అయ్యన్నపాత్రుడు కుమారుడు చింతకాయల విజయ్ ను విశాఖ డెయిరీ చైర్మన్ చేయాలని స్పీకర్ చాలాకాలం నుంచి ఎదురుచూస్తున్నారట.
ఉత్తరాంధ్ర రాజకీయాల్లో విశాఖ డెయిరీ పాలిటిక్స్ హీట్ పుట్టిస్తున్నాయి. డెయిరీ చైర్మన్ అడారి ఆనంద్ కుమార్ కుటుంబ ఆధిపత్యానికి చెక్ చెప్పి తన జెండా ఎగరేయాలని స్పీకర్ అయ్యన్నపాత్రుడు ప్లాన్ చేసినట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అయ్యన్నపాత్రుడు కుమారుడు చింతకాయల విజయ్ ను విశాఖ డెయిరీ చైర్మన్ చేయాలని స్పీకర్ చాలాకాలం నుంచి ఎదురుచూస్తున్నారట.. అందుకే డెయిరీ చైర్మన్ ఆనంద్ కుమార్ అవినీతిపై ప్రత్యేకంగా దర్యాప్తునకు ఆదేశించడమే కాకుండా, ఆయన టీడీపీలోకి వస్తానన్నా వద్దని అడ్డుకున్నారని ప్రచారం జరుగుతోంది.
ఉత్తరాంధ్రలోని మూడు ఉమ్మడి జిల్లాల్లో విశాఖ డెయిరీ కార్యకలాపాలను కొనసాగిస్తుంది. 1973లో మొదలైన ఈ డెయిరీని మాజీ చైర్మన్ అడారి తులసీరావు ఎంతో ఉన్నతస్థితికి చేర్చారు. సుమారు 1100 కోట్ల రూపాయల టర్నోవర్ ఉన్న విశాఖ డెయిరీని సొసైటీ నుంచి కంపెనీగా మార్చారు. తులసీరావు మరణించేవరకు ఆయనే విశాఖ డెయిరీ చైర్మన్ గా పనిచేశారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి ఆ పార్టీలోనే కొనసాగిన తులసీరావు ఆ పార్టీలో మరే పదవీ కోరుకోలేదు. ఉత్తరాంధ్రలో టీడీపీ బలపడేలా కృషి చేశారు. ఇటు పార్టీలోనూ, అటు డెయిరీ ద్వారా పాల రైతుల్లోనూ తులసీరావుకు గట్టి పట్టు ఉండేది.
దీంతో విశాఖ డెయిరీ అంటే తులసీరావు మాత్రమే గుర్తుకు వచ్చేవారు. ఆయన హయాంలో రైతులకు మెరుగైన సేవలు అందించడం, నాణ్యమైన ఉత్పత్తులు ద్వారా వినియోగదారుల నమ్మకాన్ని సంపాదించడంతో ఉత్తరాంధ్రలో విశాఖ డెయిరీ వ్యాపారం మూడు పువ్వులు.. ఆరు కాయలుగా వర్ధిల్లింది. దీంతో ఎప్పుడు ఎన్నికలైనా తులసీరావు నాయకత్వంలోని టీడీపీ ప్యానల్ దిగ్విజయం సాధించేది. అయితే 2019లో టీడీపీ ఓడి, వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత విశాఖ డెయిరీ యాజమాన్యం వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తూ వచ్చేది. తులసీరావు మరణాంతరం 2023లో ఆయన కుమారుడు ఆనంద్ కుమార్ చైర్మన్ అయ్యారు.
ఈయన అంతకుముందే వైసీపీలో చేరడంతో గత ఏడాది తొలిసారిగా విశాఖ డెయిరీపై పసుపు జెండా దించేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీన్ని జీర్ణించుకోలేని విశాఖ జిల్లా టీడీపీ నేతలు.. ఆనంద్ కుమార్ కు చెక్ చెప్పాలని చాలా కాలం నుంచి పట్టుబడుతున్నారు. దీంతో గత ఏడు నెలల నుంచి విశాఖ డెయిరీలో చోటుచేసుకున్న అవకతవకలపై ఫిర్యాదులు, విచారణలు అంటూ హడలెత్తిస్తున్నారు. ఇదంతా పైకి బాగానే కనిపిస్తున్నా... టీడీపీలో ఈ హడావుడి వెనుక ఇంకో ప్లాన్ ఉందని ప్రచారం జరుగుతోంది.
అడారి కుటుంబానికి కంచుకోటైన డెయిరీపై తన జెండా ఎగరేయాలని శాసనసభాపతి చింతకాయల అయ్యన్నపాత్రుడు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. తన రాజకీయ వారసుడిగా ఇప్పటికే ప్రకటించిన పెద్ద కుమారుడు విజయ్ ను డెయిరీ చైర్మన్ చేయాలని అయ్యన్నపాత్రుడు కలలు కంటున్నట్లు చెబుతున్నారు. అందుకే విశాఖ డెయిరీ చైర్మన్ అడారి ఆనంద్ కుమార్ కుటుంబం అవినీతిపై అయ్యన్నపాత్రుడు ఎక్కువ ఫోకస్ చేశారంటున్నారు. దీన్ని గమనించిన ఆనంద్ కుమార్ బీజేపీలో చేరి, అయ్యన్నపాత్రుడిని అడ్డుకునేలా పావులు కదిపారంటున్నారు.
విశాఖ జిల్లాలో అయ్యన్నపాత్రుడికి గట్టి పట్టుంది. విశాఖ డెయిరీ విస్తరించిన జిల్లాల్లో టీడీపీకి బలమైన పునాదులు ఉన్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం బలంగా ఉంది. ఈ ఈక్వేషన్ వల్ల విశాఖ డెయిరీ చైర్మన్ గా తన కుమారుడిని కూర్చోపెట్టడం పెద్ద పనేమీ కాదని అయ్యన్నపాత్రుడు భావించారట. ప్రభుత్వం అధికారంలోకి రాగానే విజయ్ కు ఏదో ఒక నామినేటెడ్ పదవి ఇస్తారని ప్రచారం జరిగింది. కానీ, అయ్యన్నపాత్రుడి కోరిక మేరకు విశాఖ డెయిరీ పదవి విజయ్ ను వరించేలా సహకరిస్తామని టీడీపీ అధిష్టానం హామీ ఇచ్చిందంటున్నారు. అందుకే డెయిరీ చైర్మన్ అడారి ఆనంద్ టార్గెట్ గా పావులు కదిపారంటున్నారు. కానీ, ఈ పాలిటిక్స్ లోకి సడన్ గా బీజేపీ దూసుకురావడం టీడీపీ పెద్దలకు షాకిచ్చినట్లైంది. అయ్యన్నపాత్రుడి ప్లాన్ తెలుసుకోకుండా బీజేపీ అడారికి పచ్చజెండా ఊపడంతో ఇప్పుడు ఏం జరుగుతుందోననే ఉత్కంఠ నెలకొంది.