అబార్షన్ విషయంలో అలహాబాద్ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు!
అవును... గర్భాన్ని కొనసాగించాలా లేక వైద్యపరంగా రద్దు చేయాలా అనే విషయంలో ఫైనల్ డెసిషన్ బాధిత మహిళదే అని అలహాబాద్ హైకోర్టు తాజాగా వ్యాఖ్యానించింది.
గర్భాన్ని కొనసాగించాలా.. లేక, వైద్యపరంగా తొలగించుకోవాలా అనేది పూర్తిగా మహిళ ఇష్టమని.. ఈ విషయంలో ఆమె నిర్ణయమే ఫైనల్ అని.. ఆమె నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం గౌరవించి, సహకరించాలని అలహాబాద్ హైకోర్టు స్పష్టం చేసింది! 32 వారాల గర్భాన్ని తొలగించుకునేందుకు అనుమతి ఇవ్వాల్సిందిగా 15 ఏళ్ల అత్యాచార బాధితురాలు కోర్టును ఆశ్రయించిన కేసులో న్యాయస్థానం ఈ వ్యాఖ్యలు చేసింది.
అవును... గర్భాన్ని కొనసాగించాలా లేక వైద్యపరంగా రద్దు చేయాలా అనే విషయంలో ఫైనల్ డెసిషన్ బాధిత మహిళదే అని అలహాబాద్ హైకోర్టు తాజాగా వ్యాఖ్యానించింది. బాధిత మహిళ తన గర్భాన్ని తొలగించుకోవాలా వద్దా అనే నిర్ణయాన్ని ఆమె తప్ప మరెవరూ తీసుకోకూడదని కోర్టు అభిప్రాయపడిందని జస్టిస్ శేఖర్ బీ సరఫ్, జస్టిస్ మంజీవ్ శుక్లాతో కూడిన ధర్మాసనం పేర్కొంది.
ఇదే సమయంలో... తల్లిగా ఉండటానికి అవును.. లేదా, కాదు అని చెప్పడంతో పాటుగా తన శరీరంపై స్త్రీకి పూర్తి హక్కు ఉందని గమనించాలని అలహాబాద్ హైకోర్టు అభిప్రాయపడింది! గర్భాన్ని కొనసాగించడం.. లేక, దానికి వైద్యపరమైన ముగింపు ఇవ్వడం వంటి విషయాల్లో ఆమెను కట్టివేయడం అనేది ఆమె గౌరవంగా జీవించే హక్కుని తిరస్కరించినట్లే అవుతుందని తెలిపింది.
ఇదే సమయంలో... బాధిత బాలిక తన గర్భాన్ని కొనసాగించి, పుట్టే బిడ్డను దత్తతకు ఇవ్వాలనుకుంటే కూడా అలాగే చేయొచ్చని.. అయితే ఈ విషయాన్ని వీలైనంత ప్రైవేట్ గా ఉంచాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని న్యాయస్థానం స్పష్టం చేసింది. అయితే... ఈ సమయంలో అబార్షన్ వల్ల ప్రమాదం పొంచి ఉందనే విషయం వైద్యులు కౌన్సెలింగ్ ద్వారా చెప్పడంతో... గర్భాన్ని కొనసాగించాలనే ఆ బాలిక, ఆమె తల్లిదండ్రులు నిర్ణయించుకున్నారని తెలుస్తోంది!