జగన్ మీద లక్ష బాణం... వర్కౌట్ అయిందా ?

ఆ ఆరోపణలకు ఆధారాలు ఉన్నాయా జనాలు నమ్ముతారా అన్నది సైతం పక్కన పెట్టి ఘాటు విమర్శలు చేస్తూనే ఉంటుంది.

Update: 2024-09-15 03:44 GMT

వైసీపీ అధినేత జగన్ మీద టీడీపీ ఎపుడూ చాలా బిగ్ వే లోనే ఆరోపణలు చేస్తుంది. ఆ ఆరోపణలకు ఆధారాలు ఉన్నాయా జనాలు నమ్ముతారా అన్నది సైతం పక్కన పెట్టి ఘాటు విమర్శలు చేస్తూనే ఉంటుంది. జగన్ రాజకీయాల్లోకి వచ్చిన కొత్తల్లో ఆయన మీద సీబీఐ కేసులు పడ్డాయి.

దానికి కాంగ్రెస్ తో పాటు టీడీపీ కూడా కారణం. ఈ రెండు పార్టీలు కలిసే కోర్టుకు వెళ్ళాయని జగన్ చాలా సార్లు ఆరోపించారు. ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టుకున్నారు అది కూడా తన తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని అని టీడీపీయే కాంగ్రెస్ కంటే స్ట్రాంగ్ గా ఆరోపణలు చేసింది.

అంతే కాదు లక్ష కోట్ల రూపాయలు జగన్ వెనకేసుకున్నారు అని అదంతా సర్కార్ ని అడ్డం పెట్టుకునే అని కూడా కామెంట్స్ చేసింది. అయితే లక్ష కోట్లు ఎలా లెక్క బెట్టారు అంటే దానికి లాజిక్ అయితే లేదు. కానీ అది పెద్ద నంబర్ గా ఉంటుందని వేశారు అని కూడా చెప్పుకున్నారు.

ఎందుకంటే ఈ కేసుని పూర్తిగా దర్యాప్తు చేసిన సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ కూడా అంత పెద్ద మొత్తం అయితే లేదని అన్నట్లుగా వార్తలు వచ్చాయి. అన్నీ కలిపి 1300 కోట్ల మేరకే ఉన్నాయని కూడా అంటూ వచ్చారు.

సరే లక్ష కోట్లు అంటూ 2014 ఎన్నికల దాకా టీడీపీ విమర్శించినా అది జనంలో అయితే వర్కౌట్ కాలేదు. దానికి రీజన్లు ఉన్నాయి. జనాలు అవినీతిని చూసి ఓట్లు వేయకుండా మానేసే విధానం అప్పటికే మారింది. వారు చూసేది తమకు ఇచ్చే హామీలు ఏంటి తమకు నేరుగా దక్కే లబ్ది ఏంటి అని మాత్రమే చూస్తున్నారు. అలా టీడీపీ 2014లో పొత్తులతో గెలిచినా 2019లో మాత్రం వైసీపీకి పట్టం కట్టారు జనాలు.

ఆ మీదట లక్ష కోట్ల ఆరోపణలను టీడీపీ మానుకుంది అని అంటున్నారు. అయితే లేటెస్ట్ గా ప్రకాశం బ్యారేజ్ కి అడ్డంగా వచ్చిన భారీ బోట్లు వైసీపీవే అని ఆ విధంగా గేట్లు విరగ్గొట్టి లక్ష మంది జనాలను జగన్ నీళ్ళలో ముంచాలని చూసారని టీడీపీ నేతలు ఆరోపిస్తూ వచ్చారు.

పిఠాపురం మాజీ ఎమ్మెల్యే టీడీపీ నేత వర్మ నోట కూడా అదే మాట వచ్చింది. జగన్ లక్ష మందిని పొట్టన పెట్టుకోవాలని చూసారు అని వర్మ ఆరోపించారు. అంటే మళ్లీ ఇక్కడ కూడా లక్ష నంబరే వచ్చింది. జగన్ మీద భారీ ఆరొపణలు చేయాలనుకున్నపుడు ఆ పెద్ద నంబర్ ఉండాల్సిందే అనీ అనుకుంటున్నారో ఏమో తెలియదు కానీ లక్ష మాత్రం కామన్ అవుతోంది.

అయితే ఈ బోట్ల వ్యవహారం కూడా తర్కానికి అందనిదిగా ఉంది. పడవలకు రంగులు ఉన్నాయనో మరోటనో చెప్పి అది వైసీపీ పని అని టీడీపీ ఆరోపణలు చేసినా వాటిని ఆధారాలు పక్కగా చూపిస్తేనే జనాలు నమ్ముతారు. లేకపోతే అవి గాలి ఆరోపణలుగా తేలిపోతాయి. ఏది ఏమైనా జగన్ కి గురి పెట్టి లక్షతో కొట్టాలనుకుంటే ఆ లక్ష్యం మాత్రం తప్పుతోందనే అంటున్నారు. దానికి కారణం అతిగా వ్యవహారాలు ఉంటే అవి జనాలకు కూడా ఒవర్ అయి ఎక్కేది ఉండదనే అంటున్నారు. చూడాలి మరి జగన్ కి లక్షకు ఉన్న బంధమేంటో టీడీపీ మరెన్ని లక్షలు తెచ్చి జగన్ నెత్తిన పోస్తుందో.

Tags:    

Similar News