కూటమి సభలో 'జూనియర్' కల్లోలం.. ఏంజరిగింది?
కూటమి పార్టీలు.. టీడీపీ-జనసేన-బీజేపీలు నిర్వహించిన ఉమ్మడి సభలో తీవ్ర కల్లోలం బయట పడింది
కూటమి పార్టీలు.. టీడీపీ-జనసేన-బీజేపీలు నిర్వహించిన ఉమ్మడి సభలో తీవ్ర కల్లోలం బయట పడింది. అనంతపురం జిల్లా ధర్మవరం నియోజకవర్గం నుంచి బీజేపీ నేత.. సత్యకుమార్ యాదవ్ పోటీ చేస్తున్నా రు. ఈయనకు మద్దతుగా ప్రచారం చేసేందుకు కేంద్ర మంత్రి, బీజేపీ అగ్రనేత ఇక్కడకు వచ్చారు. ఈ కార్యక్రమంలో టీడీపీ అధినేత చంద్రబాబు, ఇతర పార్టీల నాయకుడు పాల్గొన్నారు. అయితే.. అమిత్ షా ప్రసంగం ప్రారంభించిన వెంటనే పెద్ద ఎత్తున సభలో ఉన్నవారు.. జూనియర్ ఎన్టీఆర్ నినాదాలు చేశారు.
అంతేకాదు.. పెద్ద సంఖ్యలో భారీ కటౌట్లు.. బ్యానర్లు ప్రదర్శించారు. అక్కడితో కూడా ఆగని అభిమాను లు.. ఎన్టీఆర్ సీఎం అంటూ నినాదాలు అందుకున్నారు. దీంతో అమిత్ షా .. అసలు ఏం జరుగుతోందని సత్యకుమార్‌ను వాకబు చేశారు. సత్యకుమార్‌కు చెమటలు పట్టాయి. కూటమి సభలోకి జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఎలా వచ్చారంటూ.. పెద్ద ఎత్తున ఆయన నిర్వాహకుల(బీజేపీ-టీడీపీ నేతలు) ను ప్రశ్నించారు. అయితే.. అప్పటికే జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలతో సభా ప్రాంగణం నిండిపోయింది.
ధర్మవరంలోని సీఎన్‌బీ గార్డెన్స్ సమీపంలో నిర్వహించిన ఈ బహిరంగ సభ ను బీజేపీ-టీడీపీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. పెద్ద ఎత్తున జన సమీకరణ కూడా చేశారు. అయితే.. ఇలా వచ్చిన వారంతా.. కూడా.. బీజేపీ, టీడీపీ అభిమానులే. కానీ, ఎలా వచ్చారో తెలియదు కానీ.. జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు కూడా తండోపతండాలుగా చేరుకున్నారు. షా ప్రసంగం ప్రారంభించగానే.. కొన్ని నిముషాల్లోనే.. జై జూనియర్, జై ఎన్టీఆర్.. సీఎం.. సీఎం.. అంటూ నినాదాలతో హోరెత్తించారు.
చిత్రంఏంటంటే.. వీరు ప్రదర్శించిన ప్లకార్డుల్లో కానీ, బ్యానర్లు, ఫ్లెక్సీల్లోకానీ.. ఎక్కడా చంద్రబాబు, లోకేష్, బాలక్రిష్ణ ఫోటోలు లేవు. కేవలం సీనియర్ ఎన్టీఆర్, హరికృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ చిత్రాలు మాత్రమే కనిపించాయి. దీనిపై చంద్రబాబు కూడా.. సీరియస్ అయ్యారు. వెంటనే రంగంలోకి దిగిన టీడీపీ నాయకులు.. నినాదాలు చేస్తున్న వారిని పక్కకు తీసుకు వెళ్లే ప్రయత్నం చేశారు.