అమరావతి రాజధాని కాదా...లీగల్ గా ఎన్నో చిక్కులు ?

దాంతో రాజధాని లేని రాష్ట్రం అన్న ఎగతాళితో పాటు సెటైర్లు అన్ని వైపుల నుంచి పడ్డాయి.

Update: 2024-10-07 00:30 GMT

ఏపీ రాజధాని ఏది అంటే అమరావతి అని టీడీపీ కూటమి ప్రభుత్వం గత నాలుగు నెలలుగా చెబుతోంది. దీని కంటే ముందు అయిదేళ్ళు అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వం ఏపీకి రాజధాని ఏది అంటే మూడు దిక్కులా మూడు ప్రాంతాలను చూపించి పుణ్య కాలం అంతా గడిపేసింది. దాంతో రాజధాని లేని రాష్ట్రం అన్న ఎగతాళితో పాటు సెటైర్లు అన్ని వైపుల నుంచి పడ్డాయి.

ఇక విభజన తరువాత 2014లో ఏపీకి తెలంగాణాకు కలిపి పదేళ్ళ కాలానికి ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ని గుర్తిస్తూ ఆంధ్ర పదేశ్ రీ ఆర్గనైజేషన్ చట్టంలో పేర్కొన్నారు. అయితే ఈ ఏడాది జూన్ 2 తో ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ గడువు ముగిసిపోయింది. దాంతో ఆ చాప్టర్ అక్కడితో అయినట్లే.

మరి ఏపీకి రాజధాని ఏది అన్నది నోటిఫై చేస్తూ ఎక్కడా కేంద్ర హోం శాఖ నుంచి ఒక నోట్ కానీ ఆర్డర్ కానీ అధికారికంగా ఈ రోజుకీ లేకపోవడాన్ని పరిపాలనా రంగానికి సంబంధించిన నిపుణులు తప్పు పడుతున్నారు. హైదరాబాద్ ఉమ్మడి రాజధాని కాదు, మరి ఏపీకి కొత్త రాజధాని ఏది అన్నది నిర్ధారించాలి కదా అని అంటున్నారు. ఏపీకి అమరావతి రాజధాని అని ఒక నోటిఫికేషన్ అయితే కేంద్ర హోం శాఖ నుంచి రావాల్సి ఉందని స్పష్టం చేస్తున్నారు.

అలా అధికారికంగా నోటిఫికేషన్ రానంతవరకూ అమరావతి ఏపీ రాజధానిగా లీగల్ గా గుర్తించబడదని దానివల్ల ఫ్యూచర్ లో సమస్యలు కూడా ఎన్నో వస్తాయని కూడా చెబుతున్నారు. మామూలుగా ఎన్ని అయినా చెప్పుకోవచ్చు కానీ అమరావతి ఏపీకి రాజధాని అన్నది మాత్రం లీగల్ గా నిలబడదు అని విశాఖకు చెందిన మాజీ ఐఏఎస్ అధికారి, సామాజిక అంశాల మీద ప్రముఖంగా ప్రస్తావించే ఈఏఎస్ శర్మ అంటున్నారు.

ఆయన ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరభ్ కుమార్ ప్రసాద్ కి లేఖ రాస్తూ అందులో అమరావతి రాజధాని లీగల్ గా ఎందుకు నిలబడదన్న అంశాలను ప్రస్తావించారు. ముందు అమరావతి విషయంలో లీగల్ గా చిక్కులు తప్పించుకోకుండా ముందుకు వెళ్తే ఇబ్బందే అని ఆయన అంటున్నారు. అమరావతి పేరు మీద భారీ ప్రాజెక్టులు ఇతర నిర్ణయాలు అన్నీ కూడా లీగల్ గా కూడా ప్రశ్నించబడతాయి అని ఆయన అంటున్నారు.

రాజధాని అన్న పేరుతోనే వీటిని చేస్తున్నారు కానీ అమరావతి రాజధానిగా కేంద్రం గుర్తించినట్లుగా నోటిఫికేషన్ ఏదీ అని ఆయన ప్రశ్నిస్తున్నారు. అయితే ఈ లీగల్ చిక్కులను సులువుగనే అధిగమించవచ్చునని ఆయన కొన్ని సూచనలు చేశారు.

రాష్ట్ర ప్రభుత్వం వెంటనే అమరావతిని రాజధానిగా పేర్కొంటూ అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపించాలని ఆయన సూచించారు. దాని మీద కేంద్ర హోం శాఖ నోటిఫికేషన్ జారీ చేస్తుందని అపుడు అంతా ఓకే గా ఉంటుందని ఆయన అంటున్నారు. ముందు ఈ రకమైన ప్రోసెస్ ని కరెక్ట్ గా చేయకుండా అమరావతి రాజధాని అని ముందుకు వెళ్తే ఎపుడైనా లీగల్ గా అబ్జెక్షన్లు కచ్చితంగా వస్తాయని ఆయన అంటున్నారు.

నిజంగా చూస్తే కనుక అమరావతి రాజధాని గా 2024 జూన్ 2 నుంచి గుర్తిస్తూ నోటిఫికేషన్ జారీ కావాల్సి ఉంది అని అంటున్నారు. మరి ఆ విషయంలో ఎవరూ ఇంతవరకూ పట్టించుకోలేదా అన్న చర్చ కూడా ఉంది. గత అయిదేళ్ల టీడీపీ హయాంలో అయితే అమరావతి రాజధాని ఆలోచన జరిగింది. ఇక వైసీపీ వచ్చాక అమరావతి మీద చడీ చప్పుడూ లేదు. ఈ లోగా పదేళ్ళ కాలం ముగిసింది.

ఇపుడు కచ్చితంగా అమరాతి రాజధానిని నోటిఫై చేయాల్సిందే అంటున్నారు. నిజానికి వైసీపీ అయిదేళ్ళ పాలనలో రాజధాని ఏపీకి లేదు అని అనేవారు కానీ లీగల్ గా ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ఉంది. ఇదే వైసీపీ నేతలు కూడా అప్పట్లో గుర్తు చేస్తూ ఉండేవారు. ఇపుడే ఏపీకి రాజధాని లేని పరిస్థితి ఉందని అంటున్నారు. సో టీడీపీ కూటమి ప్రభుత్వం వీలైనంత తొందరగా అసెంబ్లీలో తీర్మానం పెట్టి మరీ రాజధానిగా అమరావతిని పేర్కొంటూ తీర్మానం చేసి కేంద్రానికి పంపాల్సి ఉంది. ఎటూ కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వం ఉంది కాబట్టి వెంటనే నోటిఫై చేస్తారు అని అంటున్నారు.

Tags:    

Similar News