ప్రాణహాని ఉందంటూ హైకోర్టును ఆశ్రయించిన అంబటి!
ఈ మేరకు తనకు ఇప్పటివరకూ ఉన్న 4+4 గన్ మెన్ల భద్రతను ఉపసంహరించడాన్ని సవాల్ చేస్తూ ఆయన హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం మాజీ మంత్రులు, వైసీపీ నేతలకున్న సెక్యూరిటీని తొలగిస్తున్నారంటూ వార్తలొస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇది సహజ ప్రక్రియ అన్నట్లుగా పలువురు స్పందిస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా సెక్యూరిటీ విషయంలో అంబటి హైకోర్టును ఆశ్రయించారు. తమ సమస్యను విన్నవించారు. తన ఆందోళనను వెళ్లబుచ్చారు.
అవును... తనకు ప్రాణహాని ఉందని.. అందువల్ల తనకు భద్రతను పునరుద్దరించేలా ప్రభుత్వానికి ఆదేశాలు జారీచేయాలని మాజీమంత్రి, వైసీపీ నేత అంబటి రాంబాబు హైకోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు తనకు ఇప్పటివరకూ ఉన్న 4+4 గన్ మెన్ల భద్రతను ఉపసంహరించడాన్ని సవాల్ చేస్తూ ఆయన హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
ఈ వ్యాజ్యంపై గురువారం న్యాయమూర్తి ఈ విషయంపై విచారణ జరిపారు! ఈ సమయంలో వాదనలు వినిపించిన అంబటి తరుపు న్యాయవాది... తన క్లైట్, మాజీమంత్రి అంబటి రాంబాబుకు భద్రతను కొనసాగించాలని పల్నాడు ఎస్పీ, డీజీపీకి వినతిపత్రాలు సమర్పించామని.. అయినా ప్రయోజనం లేదని అన్నారు. భద్రతను పునరుద్దరించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు.
ఈ సందర్భంగా స్పందించిన న్యాయమూర్తి... అంబటి రాంబాబు ప్రస్తుతం ఎక్కడ నివసిస్తున్నారని ప్రశ్నించారు. దీనికి సమాధానంగా గుంటూరులో అని అంబటి తరుపు న్యాయవాది సమాధానం ఇవ్వగా... మరి పల్నాడు ఎస్పీకి వినతిపత్రం ఇవ్వడం వల్ల ప్రయోజనం ఏమిటని ప్రశ్నించారు. అయితే.. అంబటి ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గం పల్నాడు జిల్లా పరిధిలో ఉందని లాయర్ తెలిపారు.
అందువల్లే ఆ జిల్లా ఎస్పీకి వినతిపత్రం ఇచ్చామని.. ఇది పూర్తిగా టెక్నికల్ ఇష్యూ అని కోర్టుకు వెళ్లడించారు. ఈ సమయంలో ప్రభుత్వం తరుపు న్యాయవాది స్పందించారు. ఇందులో భాగంగా... ఇది తాజా వ్యాజ్యమని, కాస్త గడువు ఇస్తే పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేస్తామని అన్నారు. ఈ నేపథ్యంలో.. తదుపరి విచారణను ఈ నెల 10కి వాయిదా వేశారు.