కొంటాస్ తో ఢీ.. 20 శాతం ఫీజు కోత.. కోహ్లిపై తప్పిన వేటు
దీంతో కోహ్లి పై ఓ మ్యాచ్ నిషేధం పడనుందనే కథనాలు వచ్చాయి.. కానీ, చివరకు ఏం జరిగిందంటే?
ఆటగాళ్ల ప్రవర్తన పరంగా ఇప్పటివరకు కాస్త సాఫీగానే సాగిన బోర్డర్-గావస్కర్ ట్రోఫీలో బాక్సింగ్ డే టెస్టు సాక్షిగా సంవాదం.. అది కూడా టీమ్ ఇండియా స్టార్ బ్యాటర్ విరాట కోహ్లి.. ఆస్ట్రేలియా సంచలనం 19 ఏళ్ల శామ్ కొంటాస్ మధ్య కావడం గమనార్హం. దీంతో కోహ్లి పై ఓ మ్యాచ్ నిషేధం పడనుందనే కథనాలు వచ్చాయి.. కానీ, చివరకు ఏం జరిగిందంటే?
బాక్సింగ్ డే టెస్టులో కోహ్లికి-కొంటాస్ కు మధ్య ఇంతకూ ఏం జరిగింది? ఇప్పుడిదే హాట్ టాపిక్.. మెల్‌బోర్న్ టెస్టు ద్వారానే అంతర్జాతీయ క్రికెట్ అరంగేట్రం చేసిన కొంటాస్ దూకుడుగా బ్యాటింగ్ చేశాడు. 65 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్లతో 60 పరుగులు చేశాడు. ప్రపంచ నంబర్ వన్ బౌలర్ జస్‌ప్రీత్ బుమ్రాతో పాటు హైదరాబాదీ స్టార్ పేసర్ మహ్మద్ సిరాజ్ బౌలింగ్ నూ అలవోకగా ఎదుర్కొన్నాడు. బుమ్రా బౌలింగ్‌లో అతడు కొట్టిన సిక్స్ హైలెట్. ఓ దశలో కొంటాస్ ను ఆపేందుకు బౌలర్లు విఫలం అవుతుండడంతో కోహ్లి అసహనానికి గురయ్యాడు. కొంటాస్ ను కవ్వించే ప్రయత్నం చేశాడు.
ఇన్నింగ్స్ 10 ఓవర్ తర్వాత ఓ ఎండ్ నుంచి మరో ఎండ్ కు కొంటాస్ వస్తుండగా.. ఎదురువెళ్లిన కోహ్లి భుజంతో ఢీ కొట్టాడు. దీంతో ఇద్దరి మధ్య స్వల్ప వాగ్వాదం చోటుచేసుకుంది. మరో ఓపెనర్ ఖవాజా, అంపైర్లు వచ్చి వారిద్దరికీ సర్దిచెప్పారు.
కేవలం 19 ఏళ్ల వయసున్న కుర్రాడి పట్ల కోహ్లి వ్యవహరించిన తీరు చర్చనీయాంశం అయింది. ఐసీసీ నిబంధనల ప్రకారం ఓ ఆటగాడు ఉద్దేశపూర్వకంగా ఢీ కొట్టడం లెవల్ 2 నేరం. దీనికి అతడి ఖాతాలో 3 లేదా 4 డి మెరిట్ పాయింట్స్ జోడిస్తారు. మ్యాచ్ ఫీజులో 50 శాతం లేదా పూర్తి ఫీజును జరిమానాగా విధిస్తారు.
24 నెలల్లో నాలుగు డీమెరిట్ పాయింట్స్ చేరితే.. ఓ టెస్టు మ్యాచ్ లేదా రెండు పరిమిత ఓవర్ల మ్యాచులు ఆడకుండా నిషేధం విధిస్తారు. కోహ్లి ఎలాగూ టి20ల్లో లేడు. ఇప్పట్లో వన్డేలు లేవు. మరి టెస్టు నిషేధం తప్పదనే అభిప్రాయం వ్యక్తం అయింది. అయితే, అతడి ఖాతాలో ఒక్క డి మెరిట్ పాయింట్ కూడా లేదు. తాజా ఘటనను మ్యాచ్ రిఫరీ తీవ్రంగా పరిగణించి 4 డి మెరిట్ పాయింట్స్ కేటాయిస్తే మాత్రం మ్యాచ్ నిషేధం ఎదురయ్యేది.
అయితే, కోహ్లిపై మ్యాచ్ ఫీజులో 20 శాతం జరిమానా ధించారు. కొంటాస్ ను ఢీకొట్టడాన్ని అతడు అంగీకరించడంతో జరిమానాతో సరిపెట్టారు.
ఇక కోహ్లి ఢీకొట్టిన ఘటనపై గురించి సామ్ కొంటాస్ స్పందించాడు. విరాట్ పై ఎలాంటి ఫిర్యాదు చేయలేదు. ఇద్దరమూ కాస్త భావోద్వేగానికి గురయ్యామని అన్నాడు. అతడు వస్తున్నట్లు తానూ గమనించలేని.. గ్లవ్స్ సరిచేసుకుంటున్నానని క్రికెట్‌లో ఇలా జరుగుతూ ఉంటుందని పేర్కొన్నారు.