బాబుగారూ ఆ మేకునే మీరు మళ్లీ తెచ్చుకుంటారు సుమా
కానీ, ఇప్పుడు ఆ మేక లేకపోతే.. కేంద్రం నిధులు ఇచ్చే పరిస్థితి ఉండదు.
ఏపీ సీఎం చంద్రబాబును ఉద్దేశించి వైసీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. గతంలో వైసీపీ ప్రభుత్వం అమలు చేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌ను చంద్రబాబు ముఖ్యమంత్రి కాగానే రెండో సంతకం కింద దానిని రద్దు చేశారు. ఇటీవల జరిగినఅసెంబ్లీ సమావేశాల్లో దానిని బిల్లు రూపంలో తెచ్చి.. రద్దు చేసినట్టు ప్రకటించారు. అంతేకాదు.. దీని కింద ఇప్పటికే కొందరు రైతులకు అప్పటి సీఎం జగన్ ఫొటోలు ముద్రించి ఇచ్చిన పాస్ పుస్తకాలు, భూ యాజమాన్య పుస్తకాలను కూడా రద్దు చేసి.. కొత్తవాటిని మంజూరు చేశారు. త్వరలో ఈ కార్యక్రమం క్షేత్రస్థాయికి కూడా చేరనుంది.
దీనిపై తాజాగా అంబటి రాంబాబు రియాక్ట్ అయ్యారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌ను మేకతో పోల్చారు. ''మేకను కుక్క.. కుక్క అంటూ.. తరిమి కొట్టారు. బాగానే ఉంది. కానీ, ఇప్పుడు ఆ మేక లేకపోతే.. కేంద్రం నిధులు ఇచ్చే పరిస్థితి ఉండదు. ఇది కేంద్రం తీసుకువచ్చిన చట్టమే. రాష్ట్రాల అవసరాలకు అనుగుణంగా అమలు చేసుకోవాలని సూచించింది. అందుకే అప్పటి సీఎం జగన్ దీనిని అమలు చేశారు. దీనిని ఎంత చెప్పినా.. మీరు మీ పరివారం వినిపించుకోకుండా.. కుక్క అని ప్రచారం చేసి.. ఎన్నికల్లో లబ్ధి పొందారు. ఇప్పుడు తరిమి కొట్టారు. కానీ, ఇప్పుడు కాకపోయినా..రేపయినా.. దానిని మీరు తెచ్చుకోవాల్సిందే'' అని అంబటి వ్యాఖ్యానించారు.
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది సుదీర్ఘ కాలంగా వివాదాల్లో ఉన్న భూములకు పరిష్కారం చూపించే కార్యక్రమమని మాజీ మంత్రి చెప్పారు. దీనిని మూడు దశల్లో సర్వేల ద్వారా అమలు చేయాల్సి ఉంటుందని ఇదే జగన్ సర్కారు చేసిందని చెప్పారు. రెండు దశల్లో సర్వేలు చేశామని ఆయన వివరించారు. గ్రామీణ ప్రాంతాల్లో సుదీర్ఘకాలంగా వివాదాల్లో ఉన్న భూములకు పరిష్కారం చూపించే ప్రయత్నం చేశామని.. 6 వేల గ్రామాల్లో సమగ్ర సర్వే పూర్తయిందని తెలిపారు. ఇందులో 4 వేల గ్రామాల్లో పాస్ పుస్తకాలు ఇచ్చామని, పలు గ్రామాల్లో డ్రోన్ సర్వే చేపట్టామన్నారు. అప్పట్లో టీడీపీ సహా అందరూ హర్షించారని చెప్పారు.
కానీ, మీరు(చంద్రబాబు) 'కుక్క'గా ముద్ర వేసి తరిమి కొట్టారని విమర్శించారు. ఇప్పుడు కేంద్రంలో మీరు భాగస్వామ్య పార్టీగా ఉన్న నేపథ్యంలో దీనిని అమలు చేయక తప్పదని చెప్పారు. పేరు మార్పుతో అయినా.. దీనిని అమలు చేయాల్సి ఉంటుందని అంబటి రాంబాబు వివరించారు. మరి దీనిపై టీడీపీ నాయకులు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.