అమెరికా వెళ్లాలనుకునే ఇండియన్స్ కి మరో గుడ్ న్యూస్!
అమెరికా వెళ్లాలనుకునే వారికి అతి పెద్ద టాస్క్ వీసా అపాయింట్మెంట్ కోసం ఎదురుచూడటం అని చాలా మంది అంటుంటారు.
అమెరికా వెళ్లాలనుకునే వారికి అతి పెద్ద టాస్క్ వీసా అపాయింట్మెంట్ కోసం ఎదురుచూడటం అని చాలా మంది అంటుంటారు. యూఎస్ వీసా అపాయింట్మెంట్ కోసం నెలల తరబడి వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఈ క్రమంలో ప్రస్తుతం బీ1/బీ2 విజిటర్ వీసా కోసం ఇంటర్వ్యూ అపాయిట్మెంట్ కోసం ముంబై లో 438 రోజులు వెయిట్ చేయాల్సిన పరిస్థితి.
ఈ సమయం హైదరాబాద్ లోనూ 429 రోజులుగా ఉంది. ఇదే క్రమంలో... విద్యార్థి విసా అపాయింట్మెంట్ కైతే హైదరాబాద్ లో సుమారు 115 రోజులు వేచి చూడాలి. ఇలా వీసా ఇంటర్వ్యూ అపాయింట్మెంట్స్ కోసం నెలలు, సంవత్సరాలూ వేచి చూస్తున్న నేపథ్యంలో... భారతీయులకు అమెరికా ఈ విషయంలో ఓ గుడ్ న్యూస్ చెప్పింది.
అవును... అమెరికా వెళ్లాలనుకునే ఇండియన్స్ కి అమెరికా మరో గుడ్ న్యూస్ చెప్పింది. ఇందులో భాగంగా... వీసా ఇంటర్వ్యూ అపాయిట్మెంట్ కోసం నెలలు, సంవత్సరాల తరబడి నిరీక్షించాల్సిన పరిస్థితిని తగ్గించేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా... షెడ్యూలింగ్, రీషెడ్యూలింగ్ లో కొత్త నిబంధనలు తీసుకొస్తోంది.
దీని ప్రకారం.. ఇకపై ఎటువంటి అదనపు ఫీజు చెల్లించాల్సిన అవసరం లేకుండా ఒకసారి అపాయింట్మెంట్ ను రీషెడ్యూల్ చేసుకునే అవకాశం కల్పించనుంది. నూతన సంవత్సర కానుక అన్నట్లుగా 2025 జనవరి 1 నుంచి ఈ కొత్త నిబంధనలు అమలు చేయనున్నట్లు భారత్ లోని అమెరికా దౌత్య కార్యాలయం వెల్లడించింది.
ఈ సందర్భంగా... ప్రతీ ఒక్కరికీ పారదర్శకంగా వీసా ఇంటర్వ్యూ అపాయింట్మెంట్స్ కల్పించాలని.. వెయిటింగ్ సమయాన్ని తగ్గించలనే ఉద్దేశ్యంతో దీనికి సంబంధించిన నిబంధనల్లో కొన్ని మార్పులు చేస్తున్నామని.. వచ్చే ఏడాది జనవరి 1 నుంచి ఇవి అమల్లోకి రానున్నాయని ఓ ప్రకటనలో ఎంబసీ వెల్లడించింది.
ఇదే సమయంలో... నాన్ ఇమ్మిగ్రెంట్ వీసాకు దరఖాస్తు చేసుకునేవారు నచ్చిన లొకేషన్ లో అపాయింట్మెంట్ షెడ్యూల్ చేసుకోవచ్చని తెలిపింది. ఈ క్రమంలో ఒకవేళ ఏ కారణం చేతనైనా రీషెడ్యూల్ చేసుకోవాల్సిన పరిస్థితి వస్తే.. ఎటువంటి అదనపు రుసుము లేకుండా షెడ్యూల్ ను ఒకసారి మార్చుకునేందుకు వీలుందని తెలిపింది.
అయితే.. రెండోసారి రీషెడ్యూల్ చేసుకోవాలంటే మాత్రం కొత్త అపాయింట్మెంట్ కింద బుక్ చేసుకోవాలని తెలిపింది. దానికి మళ్లీ అప్లికేషన్ ఫీజు చెల్లించాలని దౌత్య కార్యాలయం ఓ ప్రకటనలో వెల్లడించింది.