పాక్ తో చర్చల్లేవ్ తేల్చేసిన అమిత్ షా.. అలా ఎందుకు చెప్పారంటే?

జమ్ముకశ్మీర్ లోని మిగిలిన పార్టీలకు భిన్నంగా తమ విధానాల్ని.. తమ ఎన్నికల ప్రణాళికను చెప్పేశారు

Update: 2024-09-07 04:41 GMT

కేంద్ర హోం మంత్రి అమిత్ షా కుండ బద్ధలు కొట్టేశారు. శషబిషలు లేకుండా పాకిస్తాన్ విషయంలో తమ అభిప్రాయాన్ని నిర్మోహమాటంగా వెల్లడించారు. జమ్ముకశ్మీర్ లోని మిగిలిన పార్టీలకు భిన్నంగా తమ విధానాల్ని.. తమ ఎన్నికల ప్రణాళికను చెప్పేశారు. అంతేకాదు.. ఆర్టికల్ 370 రద్దు అన్నది ఒక ముగిసిన అధ్యాయమని.. దాన్ని ఎవరూ వెనక్కి తీసుకురాలేరని చెప్పిన ఆయన.. జమ్ముకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ మేనిఫెస్టో విడుదల చేశారు. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేవారు.

ఉగ్రవాదం అంతమయ్యేవరకు పాక్ తో చర్చలు ఉండవన్న అమిత్ షా.. ‘చర్చలు.. బాంబులు ఒకేసారి కొనసాగవు. ఉగ్రవాదం అంతమయ్యే వరకు పాక్ తో చర్చలు జరిపేందుకు మేం అనుకూలం కాదు. కశ్మీర్ యువతతో మేం కచ్ఛితంగా మాట్లాడి తీరతాం’’ అని వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా జమ్ముకశ్మీర్ ఎన్నికల మేనిఫెస్టోను సంకల్ప్ పత్ర పేరుతో విడుదల చేశారు. ఉగ్రవాదాన్ని.. వేర్పాటువాదాన్ని తుడిచిపెట్టటం మేనిఫెస్టోలో మొదటి అంశంగా పేర్కొన్నారు.

మహిళల ఆర్థిక భద్రత.. స్వావలంబనకు అధిక ప్రాధాన్యం ఇస్తూనే.. శాంతియుత.. సురక్షిత.. సుసంపన్నమైన జమ్ముకశ్మీర్ సాధించుకోవటమే తమ మేనిఫెస్టో లక్ష్యంగా పేర్కొన్నారు. ‘ స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి జమ్ముకశ్మీర్ కు బీజేపీ ప్రాధాన్యత ఇస్తూనే ఉంది. ఈ నేలను చెక్కు చెదరకుండా ఉంచేందుకు ఎప్పుడూ ప్రయత్నిస్తూనే ఉంది. 2014 వరకు జమ్ముకశ్మీర్ వేర్పాటువాదం.. ఉగ్రవాదం నీడలో ఉండేది. పలువురు నాయకులు రాష్ట్రంలో ఆస్థిరతను క్రియేట్ చేశారు. ఆ తర్వాత పరిస్థితులు మారిపోయాయి’’ అని పేర్కొన్నారు.

2019లో ఆర్టికల్ 370 రద్దు తర్వాత రాష్ట్ర హోదా కోల్పోయి కేంద్రపాలిత ప్రాంతంగా మారిన తర్వాత జమ్ముకశ్మీర్ రాష్ట్రానికి అసెంబ్లీ ఎన్నికలు జరగటం ఇదే తొలిసారి. 2014లో చివరిసారి ఈ రాష్ట్రంలో ఎన్నికలు జరిగాయి. అనంతరం పీడీపీతో పొత్తు పెట్టుకున్న బీజేపీ.. జమ్ముకశ్మీర్ లో కూటమి ప్రభుత్వాన్నిఏర్పాటు చేయటం తెలిసిందే. ఆ తర్వాత వారి ప్రయాణం ఎక్కువ కాలం సాగలేదు. ఆర్టికల్ 370 రద్దు తర్వాత కశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతంగా మారటం.. ఆ తర్వాత అసెంబ్లీ ఎన్నికలు జరగటం ఇదే తొలిసారి.

మొత్తం 90 అసెంబ్లీస్థానాలున్న జమ్ముకశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతంలో అసెంబ్లీ ఎన్నికలు మూడు దశల్లో జరగనున్నాయి. తొలిదశలో 24 అసెంబ్లీ స్థానాలకు.. రెండు, మూడు దశల్లో వరుసగా 26స్థానాలు.. 40 స్థానాలకు పోలింగ్ జరగనుంది. సెప్టెంబరు 18న తొలి విడత.. సెప్టెంబరు 25న రెండో విడత.. అక్టోబరు 1న మూడో విడత పోలింగ్ ను నిర్వహించనున్నారు. అక్టోబరు 8న ఫలితాలు వెల్లడి కానున్నాయి. బీజేపీ మేనిఫెస్టో విడుదల వేళ అమిత్ షా నోటి నుంచి ఆసక్తికర వ్యాఖ్య ఒకటి వచ్చింది. ‘‘జమ్ముకశ్మీర్ చరిత్ర గురించి రాసినప్పుడు 2014 తర్వాత 10 ఏళ్ల కాలం గోల్డెన్ పీరియడ్ గా మిగిలిపోతుంది’’ అని పేర్కొన్నారు. మరి.. జమ్ముకశ్మీర్ ప్రజలు ఈ ఎన్నికల్లో ఎలాంటి తీర్పు ఇవ్వనున్నారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారిందని చెప్పక తప్పదు.

బీజేపీ మేనిఫెస్టోలో పేర్కొన్న అంశాల్ని చూస్తే..

- ఉగ్రవాదం, వేర్పాటువాదాన్ని తుడిచిపెట్టడం ద్వారా జమ్ముకశ్మీర్ ను దేశాభివృద్ధి, పురోగతిలో అగ్రగామిగా తీర్చిదిద్దటం.

- ‘‘మా సమ్మాన్ యోజన'’ ద్వారా ప్రతి ఇంట్లోని మహిళల్లో పెద్ద వయస్కురాలికి ఏడాదికి రూ.18వేలు ఇవ్వటం

- ప్రధానమంత్రి ఉజ్వల యోజన లబ్ధిదారులకు ప్రతి ఏడాది 2 ఉచిత గ్యాస్ బండలు.

- 'ప్రగతి శిక్ష యోజన' కింద కళాశాల విద్యార్థులకు రవాణా ఖర్చుల కోసం డీబీటీ ద్వారా ఏటా రూ.3వేలు.

- 5 లక్షల ఉద్యోగాలు. విద్యార్థులకు రెండేళ్ల పాటు ఏటా రూ.10 వేల కోచింగ్ ఫీజు.

- మారుమూల ప్రాంతాల్లో ఉన్నత తరగతులు చదివే విద్యార్థులకు ఉచితంగా టాబ్ లు/ల్యాప్ టాప్ లు.

- శ్రీనగర్ నగరంలోని దాల్ సరస్సును ప్రపంచ స్థాయి పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయడం.

- జమ్మూ నగరంలో స్పెషల్ ఎకనామిక్ జోన్ (సెజ్)గా ఐటీ హబ్ ఏర్పాటు.

- అటల్ ఆవాస్ యోజన ద్వారా భూమి లేని లబ్ధిదారులకు 5 మర్ల భూమి ఉచితం.

- వినియోగదారులందరికీ విద్యుత్, నీటి బకాయిల నుంచి ఉపశమనం కల్పించేలా పథకం.

- వృద్ధాప్య, వితంతు, వికలాంగుల పింఛన్లను రూ.1,000 నుంచి రూ.3వేలకు పెంపు.

- బలహీన వర్గాలకు గౌరవప్రదమైన జీవితానికి భరోసా.

- పిఎం కిసాన్ సమ్మాన్ నిధి కింద ఏటా రూ.10 వేలు.ప్రస్తుతం ఉన్న రూ.6 వేలకు అదనంగా మరో రూ.4వేలు.

- శిథిలమైన 100 దేవాలయాల పునరుద్ధరణ. ప్రస్తుతం ఉన్న దేవాలయాలను మరింత అభివృద్ధి చేయడం.

- మరింత అభివృద్ధి చేసే దేవాలయాలుగా శంకరాచార్య ఆలయం (జ్యేష్టేశ్వర ఆలయం), రఘునాథ్ ఆలయం, మార్తాండ సూర్య దేవాలయాలు.

- కశ్మీరీ పండిట్ కమ్యూనిటీకి పునరావాసం.

Tags:    

Similar News