తుస్సు మనిపించారు అందుకే మండిపోయారా ?

ఇదే విషయాన్ని పార్టీ నేతలు మాట్లాడుతు ఖమ్మం బహిరంగసభ ఎఫెక్టు వల్లే అమిత్ షాకు తెలంగాణా నేతలపై బాగా మండిపోతున్నదని చెప్పారు.

Update: 2023-09-19 05:31 GMT

తెలంగాణా బీజేపీ నేతలపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా మండిపోయారట. తెలంగాణా విమోచన దినోత్సవం సందర్భంగా జరిగిన బహిరంగసభలో పాల్గొనేందుకు హైదరాబాద్ వచ్చారు. ఎలాగూ వచ్చారు కాబట్టి పార్టీలోని సీనియర్ నేతలందరితో సమావేశం ఏర్పాటు చేస్తామని కేంద్రమంత్రి, తెలంగాణా అద్యక్షుడు కిషన్ రెడ్డి అడిగారట. దాంతో షా ఒక్కసారిగా మండిపోయారట. ఎవరితోను సమావేశం పెట్టుకోవాల్సిన అవసరంలేదని స్పష్టంగా చెప్పేశారట.

అయితే కొంతసేపటి తర్వాత కిషన్ రెడ్డి సముదాయించిన తర్వాత అమిత్ షా చల్లబడ్డారట. అసలు అమిత్ సీనియర్లతో భేటీని ఎందుకు వద్దాన్నరన్నది ఆశ్చర్యంగా ఉంది. ఇదే విషయాన్ని పార్టీ నేతలు మాట్లాడుతు ఖమ్మం బహిరంగసభ ఎఫెక్టు వల్లే అమిత్ షాకు తెలంగాణా నేతలపై బాగా మండిపోతున్నదని చెప్పారు. ఇంతకీ విషయం ఏమిటంటే మూడుసార్లు ఖమ్మం బహిరంగసభ వాయిదాపడింది. చివరకు పోయిన నెలలో బహిరంగసభ జరిగింది.

అయితే తన బహిరంగసభకు భారీ ఎత్తున జనాలు వస్తారని అనుకుంటే పెద్దగా రాలేదు. చాలా ముందుగా బహిరంగసభ ఏర్పాట్లపై ప్రచారం జరిగినా ఎందుకనో జనసమీకరణలో నేతలంతా ఫెయిలయ్యారు. ఆ విషయంపైనే అప్పటినుండి అమిత్ బాగా మండిపోతున్నారట. అందుకనే నేతలతో భేటీ అని కిషన్ ప్రస్తావించగానే మండిపోయారట. అయితే కొంతసేపటి తర్వాత కూలై చివరకు భేటీ అయ్యిందనిపించారు. ఎందుకంటే ఒకపుడు తెలంగాణాలో బీజేపీ అధికారంలోకి వచ్చేస్తుందనే ఊపుండేది బీజేపీలో. అయితే అది ఇపుడు ఎక్కడా కనబడటంలేదు.

పైగా పార్టీలో చేరికలు కూడా పెద్దగా కనబడటంలేదు. ఖమ్మం బహిరంగసభలోనే భారీఎత్తున చేరికలుంటాయని అనుకున్నా ఎక్కడా కనబడలేదు. దాంతో బహిరంగసభలు సక్సెస్ చేయలేక, చేరికలూ లేకపోవటమే అమిత్ షా మంటకు కారణమైందట. మరిపుడే ఇలాగుంటే ఎన్నికలు దగ్గరపడేకొద్దీ ఈ మంట ఇంకెంత పెరుగుతుందో అని పార్టీలో చర్చించుకుంటున్నారు.

కారణం ఏమిటంటే కనుచూపుమేరలో ముఖ్యనేతల చేరికలపై ఎక్కడా సూచనలు కూడా కనబడటంలేదు. దాంతో రాబోయే ఎన్నికల్లో బీజేపీ గెలుపుపై ఢిల్లీ పెద్దల్లోనే నమ్మకాలు సడలిపోతున్నాయి. ఇలాంటి పరిస్ధితుల్లో తెలంగాణాలోని సీనియర్లపై ఢిల్లీ పెద్దలకు మంటగా ఉండకుండా ఇంకెలాగ ఉంటుంది ?

Tags:    

Similar News