జగన్ లెక్కకు చెక్ పెడుతున్న అమిత్ షా !

అలాగే గతంలో వచ్చిన 22 ఎంపీల కంటే ఎక్కువగానే గెలుచుకుని తీరుతామని కూడా స్పష్టం చేశారు.

Update: 2024-05-27 07:52 GMT

ఏపీలో ఫలితాలు పూర్తిగా ఏకపక్షంగా ఉంటాయని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పూర్తి నమ్మకంగా ఉన్నారు. ఆయన ఐ ప్యాక్ టీం తో భేటీ తరువాత 151 సీట్ల కంటే అదనంగానే గెలిచి తీరుతామని ధీమా వ్యక్తం చేశారు. అలాగే గతంలో వచ్చిన 22 ఎంపీల కంటే ఎక్కువగానే గెలుచుకుని తీరుతామని కూడా స్పష్టం చేశారు.

వైసీపీ నుంచి పోలింగ్ అనంతరం రెండు రోజుల మధనం తరువాత ఏకంగా అధినేత హోదాలోనే ఇచ్చిన నివేదిక ఇది. అంతే కాదు జూన్ 9న జగన్ రెండోసారి సీఎం గా విశాఖలో చేసే ప్రమాణ స్వీకారానికి తరలిరావాలని కూడా వైసీపీ అఫీషియల్ గానే ట్వీట్ చేసింది.

మరో వైపు టీడీపీ కూటమి తాము గెలుస్తున్నామని చెబుతోంది. అయితే ఆ నమ్మకానికి బలం ఇస్తూ కేంద్ర హోం మంత్రి బీజేపీ పెద్ద అయిన అమిత్ షా ఒక బిగ్ నంబర్ చెప్పారు. ఏపీలో ఏకంగా 17 ఎంపీ సీట్లను ఎన్డీయే కూటమి గెలుచుకుంటుందని అమిత్ షా చెప్పడం ఇపుడు అందరినీ ఆలోచనలలో పడవేస్తోంది.

పోలింగ్ మే 13న జరిగింది. మరో పద మూడు రోజుల వ్యవధి తీసుకుని మరీ అన్ని విధాలుగా చెక్ చేసుకుంటూ అమిత్ షా ఇచ్చిన నివేదిక ఇదని అంటున్నారు. ఆయన ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఏపీలో అధికారంలోకి వచ్చేది ఎన్డీయే కూటమి మాత్రమే అని స్పష్టం చేశారు.

అంటే జగన్ చెప్పిన లెక్కలను సరి చేస్తూ అమిత్ షా కొత్త లెక్కలు చెప్పినట్లు అయింది అని అంటున్నారు. అదెలా అంటే జగన్ 151 కంటే ఎక్కువ సీట్లు అన్నారు. అమిత్ షా చెప్పినది చూస్తే 119 సీట్ల దాకా ఎన్డీయే కూటమి ఏపీలో గెలుచుకుంటుందని అంటున్నారు. దాదాపుగా ఇవే లెక్కలను టీడీపీ కూడా చెబుతోంది.

తాము వేసుకున్న అంచనాలూ అమిత్ షా వేసిన లెక్కలూ రెండూ సరిపోయాయని ఆ పార్టీ అంటోంది. ఇంకో వైపు చూస్తే కేవలం ఏపీతోనే అమిత్ షా ఊరుకోలేదు అరుణాచల్ ప్రదేశ్ అలాగే ఒడిశాలలో కూడా ఎన్డీయే ప్రభుత్వాలు ఏర్పాటు అవుతాయని, అలాగే భారీ సీట్లతో కేంద్రంలో మరోసారి ఎన్డీయే ప్రభుత్వం వస్తుందని అంటున్నారు.

ఇలా అమిత్ షా దేశమంతటా మేమే మళ్ళీ వస్తున్నామని చెప్పడంతో బీజేపీ సహా టీడీపీ జనసేన వర్గాలలో ఆనందం వెల్లి విరుస్తోంది. దేశానికి హోం మంత్రి కాబట్టి ఆయన వద్ద అన్ని రకాలైన సర్వేల నివేదికలూ ఉంటాయని వాటిని క్రోడీకరించి మరీ ఆయన తనకు ఉన్న సమాచారంతో సాధికారికంగా ఏపీలో కూటమిదే అధికారం అని గట్టిగా చెప్పారని అంటున్నారు.

అయితే దీనిని వైసీపీ ఖండిస్తోంది. అమిత్ షా చెప్పినది ఎన్నికల వ్యూహంలో భాగమే అని అంటున్నారు. ఒడిషాలో మరోసారి అధికారంలోకి వచ్చే చాన్స్ కచ్చితంగా నవీన్ పట్నాయక్ కే ఉందని అంటున్నారు. ఆ విధంగా చూస్తే అమిత్ షాది అంచనా తప్ప నిజం కాదని అదే రకంగా ఏపీలో గ్రౌండ్ లెవెల్ రియాల్టీస్ అన్నీ చూస్తే కనుక వైసీపీకే అవకాశాలు మెండుగా ఉన్నాయని వారు చెబుతున్నారు

మొత్తానికి వైసీపీ దూకుడుకు అమిత్ షా తన దైన లెక్కలతో చెక్ పెట్టారని కూటమి నేతలు అంటున్నారు. ఎవరు ఎన్ని అనుకున్నా ఫలితం మాతం ఈవీఎంలలో భద్రంగా ఉందని అంటున్నారు. అందువల్ల జూన్ 4న వచ్చేదే అసలైన తీర్పు అని ఇవన్నీ జస్ట్ అంచనాలే అని అంటున్నారు. అయిదేళ్ళ పాటు ఏపీని ఏలిన పార్టీగా వైసీపీ కంటే ఎవరికీ ఎక్కువ తెలియదు అని కూడా వైసీపీ నేతలు అంటున్నారు. చూడాలి మరి ఎవరి నమ్మకం నిజం అవుతుందో ఎవరి అంచనా అన్నది కరెక్ట్ అవుతుందో.

Tags:    

Similar News