'మదనపల్లె ఫైల్స్'..బూడిద నుంచి వాస్తవాలు తీస్తాం: అనగాని

ఈ క్రమంలోనే ఈ రోజు శాసన మండలి సమావేశాల సందర్భంగా మదనపల్లె ఫైళ్ల దగ్ధం అంశంపై మంత్రి అనగాని సత్య ప్రసాద్ కీలక వ్యాఖ్యలు చేశారు.

Update: 2024-11-19 15:30 GMT

ది కశ్మీర్ ఫైల్స్ మాదిరిగా ఏపీలో ది మదనపల్లె ఫైల్స్ కొద్ది నెలల క్రితం పెను దుమారం రేపిన సంగతి తెలిసిందే. ప్రభుత్వం అత్యంత కట్టుదిట్టంగా భద్రపరచాల్సిన ఫైళ్లు...కాలి బూడిదైన వైనం సంచలనం రేపింది. గత ప్రభుత్వంలో జరిగిన అవకతవకలు బయటపడతాయన్న ఉద్దేశ్యంతోనే ఆ ఫైళ్లు తగులబెట్టారని ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలోనే ఈ రోజు శాసన మండలి సమావేశాల సందర్భంగా మదనపల్లె ఫైళ్ల దగ్ధం అంశంపై మంత్రి అనగాని సత్య ప్రసాద్ కీలక వ్యాఖ్యలు చేశారు.

మదనపల్లె ఫైళ్ల దగ్ధం వెనుక ఉన్న ఎంతటి వారున్నా వదిలిపెట్టే ప్రసక్తే లేదని, తగులబడ్డ ఫైళ్ల బూడిదలో నుంచి వాస్తవాలు వెలికితీస్తామని సత్య ప్రసాద్ చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. వైసీపీ భూధందాలు బట్టబయలవుతాయన్న ఉద్దేశ్యంతోనే ఆ ఫైళ్లు తగులబెట్టారని ఆయన ఆరోపించారు. మదనపల్లె ఆఫీసులో కావాలనే మోటరాయిల్, దోమల కడ్డీలు వంటి ఫ్లేమబుల్ వస్తువులు పెట్టారని అన్నారు. ఆఫీసులో షార్ట్ సర్క్యూట్ జరగలేదని, ఈ ఫైళ్ల దగ్ధం వెనుక కుట్ర ఉందని పోలీసులు నిర్ధారించారని అన్నారు. మాజీ మంత్రి పెద్దిరెడ్డి ఆదేశాలతోనే మాజీ ఆర్డీవో మురళీ, మాజీ మంత్రి పీఏ తుకారం తదితరులు ఫైళ్లు తగులబెట్టారని సంచలన ఆరోపణలు చేశారు.

అనగాని వ్యాఖ్యల నేపథ్యంలో ఆ ఫైళ్ల దగ్ధం వెనుక మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఉన్నారంటూ టీడీపీ సభ్యులు నినాదాలు చేశారు. దీంతో, టీడీపీ, వైసీపీ సభ్యుల మధ్య సభలో వాగ్వాదం జరిగింది. కేసు విచారణ జరుగుతుండగానే పెద్దిరెడ్డి పేరు ప్రస్తావించడంపై మండలిలో వైసీపీ సభాపక్ష నేత బొత్స సత్యనారాయణ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. సీఐడీ దర్యాప్తులో తేలిన అంశాలను తాను సభ దృష్టికి తీసుకొచ్చానని, ఈ కేసులో ఏ ఒక్కరిని వదిలిపెట్టేది లేదని వార్నింగ్ ఇచ్చారు. ఈ కేసులో ప్రతి ఒక్క దోషిని సీఐడీ శిక్షించి తీరుతుందని హెచ్చరించారు.

Tags:    

Similar News