అనంత సెబ్ పోలీసుల ఘనకార్యం.. ఐటీ ఉద్యోగిపై అమానుష దాడి

రోజులానే మంగళవారం ఉదయం వాకింగ్ చేస్తున్న వేళ.. ఇద్దరు ఆగంతకులు వచ్చి అతడి మీద పడి గట్టిగా పట్టుకున్నాడు.

Update: 2023-11-22 05:08 GMT

నిందితుడ్ని గుర్తించే విషయంలో అనంతపురం సెబ్ పోలీసుల పొరపాటు ఒక ఐటీ ఉద్యోగికి చేదు అనుభవాన్ని మిగల్చటంతో పాటు.. గాయాలపాలు చేసింది. సంచలనంగా మారిన ఈ ఉదంతంలో ఎలాంటి తప్పు చేయని ఐటీ ఉద్యోగి బాధితుడిగా మిగిలాడు. అతను చేసిన తప్పు ఏమైనా ఉందంటే.. అది ఉదయాన్నే లేచి వాకింగ్ కు దగ్గర్లోని గ్రౌండ్ కు వెళ్లటం. అతన్ని చూసి.. తాము వెతుకుతున్న నిందితుడు అతడేనని భావించి.. అదుపులోకి తీసుకునే క్రమంలో అతడిపై దాడి చేసిన వైనం షాకింగ్ గా మారింది.

మంగళవారం తెల్లవారుజామున చోటు చేసుకున్న ఈ ఉదంతం సంచలనంగా మారింది. అనంతపురం పట్టణానికి చెందిన ఐటీ ఉద్యోగి చంద్రశేఖర్ రెడ్డి ఎప్పటిలానే ఉదయాన్నే వాకింగ్ కు బయలుదేరాడు. తనకు దగ్గర్లోని జేఎన్ టీయూ గ్రౌండ్స్ కు వెళుతుంటాడు. రోజులానే మంగళవారం ఉదయం వాకింగ్ చేస్తున్న వేళ.. ఇద్దరు ఆగంతకులు వచ్చి అతడి మీద పడి గట్టిగా పట్టుకున్నాడు. దీంతో పెనుగులాడిన చంద్రశేఖర్ రెడ్డి.. వారిలో ఒకరిని గట్టిగా కొరికాడు. దీంతో.. వారిద్దరు చంద్రశేఖర్ మీద పడి దారుణంగా కొట్టారు. ఈ క్రమంలో అతడి తలకు గాయమైంది. దీంతో.. స్థానికులు స్పందించి అతడ్ని ఆసుపత్రికి తరలించారు.

అదే సమయంలో ఆ ఆగంతకులు తాము పొరపడ్డామన్న విషయాన్ని గుర్తించి చల్లగా జారుకున్నారు. ఇంతకూ ఆ ఇద్దరు ఆగంతకులు ఎవరో కాదు.. అనంతపురం సెబ్ పోలీసులు. అసలు విషయం ఏమంటే తాడిపత్రికి చెందిన రామాంజనేయ రెడ్డి అనంతపురంలో ఉంటూ గోవా మద్యాన్ని సప్లై చేస్తుంటాడు. అతడి నుంచి మద్యాన్ని కొనుగోలు చేసిన ఒకరు ఇటీవల సెబ్ పోలీసులకు పట్టుబడ్డాడు. విచారణలో రామాంజనేయరెడ్డి గురించి వివరాలు తెలుసుకొని.. అతడి కోసం గాలిస్తున్నారు.

ఇందులో భాగంగా రామాంజనేయ రెడ్డి ఫోన్ నెంబరు ఆధారంగా అతడి లొకేషన్ ను గుర్తించి పట్టుకునే క్రమంలో.. మంగళవారం ఉదయం జేఎన్ టీయూ మైదానంలో ఉన్నట్లుగా చూపించింది. దీంతో.. అక్కడకు చేరుకున్న సెబ్ పోలీసులు.. చంద్రశేఖర్ ను చూసి అతడ్ని రామాంజేయ రెడ్డిగా పొరపడి అతడ్ని పట్టుకునే ప్రయత్నం చేశారు. అయితే.. తనపై ఎవరో అకారణంగా దాడి చేస్తున్నారని భావించిన చంద్రశేఖర్ రెడ్డి రియాక్ట్ అయ్యారు. దీంతో.. సెబ్ పోలీసులు మరింత మొరటుగా వ్యవహరిస్తూ అతడ్ని తీవ్రంగా కొట్టారు.

తీవ్ర గాయాలైన చంద్రశేఖర్ ను చూసి.. తాము అదపులోకి తీసుకోవాల్సిన వ్యక్తి అతడు కాదన్న విషయాన్ని గుర్తించి.. అక్కడి నుంచి వెళ్లిపోయారు. మరోవైపు గాయాలబారిన పడిన చంద్రశేఖర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. లొకేషన్ తప్పుగా చూపించటంతో ఈ తప్పిదం జరిగినట్లుగా సెబ్ అదనపు ఎస్పీ పేర్కొనటం గమనార్హం. కనీసం.. గాయాలైన బాధితుడ్ని పరామర్శించి.. అతడికి నష్టపరిహారం చెల్లంచాలన్న మాట పలువురి నోట వినిపిస్తోంది.

Tags:    

Similar News