వైరల్... వివేక్ ‘డోజ్’ నుంచి తప్పుకోవడం వెనుక మస్క్ మెలిక ఇదే!
ట్రంప్ 2.0 లో అత్యంత ప్రతిష్టాత్మక పాత్ర పోషించబోయే అవకాశం ఉందని చెబుతున్న డోజ్ బాధ్యతల నుంచి వివేక్ రామస్వామి వైదొలిగారు.
గత ఏడాది జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో గెలుపు అనంతరం డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న ఓ ఆసక్తికర, ప్రతిష్టాత్మక నిర్ణయం డిపార్ట్ మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియెన్సీ (డొజ్) ఏర్పాటు. వృథా ఖర్చులను తగ్గించడంతో పాటు ప్రభుత్వ వ్యవస్థల్లో సమూల మార్పులు తీసుకురావడమే దీని లక్ష్యం అని చెప్పారు.
ఇంత కీలకమైన డొజ్ బాధ్యతలను భారతీయ అమెరికన్ బిజినెస్ మేన్ వివేక్ రామస్వామితో పాటు ప్రపంచ కుబేరుడు, టెస్లా అధినేత అయిన ఎలాన్ మస్క్ కు అప్పగించారు. వీరిద్దరూ డోజ్ కు సంయుక్త సారధులుగా డొనాల్డ్ ట్రంప్ నియమించారు. అయితే.. తాజాగా ఆ బాధ్యతల నుంచి వివేక్ రామస్వామి వైదొలగడం చర్చనీయాంశంగా మారింది.
అవును... ట్రంప్ 2.0 లో అత్యంత ప్రతిష్టాత్మక పాత్ర పోషించబోయే అవకాశం ఉందని చెబుతున్న డోజ్ బాధ్యతల నుంచి వివేక్ రామస్వామి వైదొలిగారు. ఈ సమయంలో.. అంత ప్రతిష్టాత్మకమైన పని నుంచి తప్పుకోవడం వెనుక రామస్వామికి బలమైన కారణం ఉందనే చర్చ తెరపైకి వచ్చింది. ఇప్పుడు ఇది హాట్ టాపిక్ గా మారింది.
దీనికి సంబంధించి ‘పొలిటికో’ అనే పత్రిక ఓ ఆసక్తికర కథనం ప్రచురించింది. ఇందులో భాగంగా... డోజ్ లో తనతో పాటు సంయుక్త సారథిగా వివేక్ రామస్వామి ఉండటంపై ఎలాన్ మస్క్ అభ్యంతరం వ్యక్తం చేశారని ఆ కథనంలో షాకింగ్ అంశం లేవనెత్తింది. దీంతో... అసలు ఏమి జరిగింది..? ఎందుకు మస్క్ అలాంటి ఆలోచన చేశారు..? అనేది ఆసక్తిగా మారింది.
వాస్తవానికి... డొనాల్డ్ ట్రంప్ 2.0లో మస్క్ పాత్ర అత్యంత కీలకం. ఇప్పుడు ట్రంప్ తర్వాత ట్రంప్ అంతటి వారు ఎలాన్ మస్క్ అని చెప్పినా అతిశయోక్తి కాదు. అంతటి పవర్ ఉన్న మస్క్... డోజ్ కు తనతో పాటు సంయుక్త సారథిగా వివేక్ రామస్వామి వంటి అమెరికన్ – ఇండియన్ వద్దు అని చెప్పారని.. ఫైనల్ అదే జరిగిందని ఆ పత్రిక పేర్కొంది.
వివేక్ రామస్వామి చేసిన నేరమేమి?:
డొజ్ విషయంలో తనతో పాటు సంయుక్త సారథిగా ఉండటానికి వివేక్ రామస్వామిని వద్దు అని ఎలాన్ మస్క్ చెప్పడానికి అసలు కారణం ఏమిటి..? ఈ విషయంలో అసలు రామస్వామి చేసిన తప్పేమిటి..? అనేది హాట్ టాపిక్ గా మారింది. అటు రిపబ్లికన్స్ తో పాటు ఇటు ఇండియన్ – అమెరికన్ కమ్యునిటీలోనూ ఈ విషయం చర్చనీయాంశంగా మారింది.
డిసెంబర్ 26న వివేక్ రామస్వామి ఎక్స్ లో ఓ పోస్ట్ చేశారు. ఇందులో భాగంగా... అమెరికన్ కంపెనీలు విదేశీ ఇంజినీర్లను ఎంపిక చేసుకుంటున్నాయంటే దానర్థం అమెరికన్ ప్రజలకు ఐక్యూ లెవెల్స్ తక్కువ ఉన్నాయని కాదు.. అందుకు కారణం "సీ" అనే అక్షరం.. ఇక్కడ "సీ" అంటే కల్చర్ అని అర్ధమని రామస్వామి పేర్కొన్నారు.
ఇదే సమయంలో... అమెరికా సమాజంలో చదువుకు, ప్రతిభకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వరని అన్నారు. విదేశాల నుంచి అమెరికా వచ్చి స్థిరపడిన తల్లితండ్రులు.. అమెరికాలోని స్థానిక తల్లితండ్రులు తమ తమ పిల్లల చదువులకు ఇచ్చే ప్రాధాన్యతలో చాలా తేడా ఉంటుందని వివరించారు. ఈ సమయంలో మనం మేల్కొనపోతే చైనా అధిక్యం చూపిస్తుందని చెప్పారు.
ఇలా వాస్తవాలను గ్రహించి, భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని, చైనా నుంచి ఇబ్బందులు రాకుండా అమెరికా మేలుకోరి అన్నట్లుగా రామస్వామి చేసిన ట్వీట్ లోని అభిప్రాయాలు ఎలాన్ మస్క్ & కో కి నచ్చలేదని అంటున్నారు. ఈ విషయంలో వాస్తవ విషయాలకంటే ఎక్కువగా.. అమెరికా కల్చర్ ను అవమానించినట్లుగా వారు అర్ధం చేసుకున్నారని చెబుతున్నారు.
ఈ నేపథ్యంలోనే రిపబ్లికన్స్ లో ఓ వర్గం వివేక్ రామస్వామిపై గుర్రుగా ఉన్నారని అంటున్నారు. పైగా... "అమెరికా ఫస్ట్" అనేది ట్రంప్ నినాదం. అది చదువులో అయినా, ఉద్యోగాల్లో అయినా అనేది ట్రంప్ ఉద్దేశం. ప్రధానంగా అమెరికాలో ఇటీవల నిరుద్యోగం రేటు పెరగడానికి విదేశీ ఉద్యోగుల తాకిడే కారణం అని చెబుతున్నారు.
ఇలాంటి సమయంలో రామస్వామి ఈ కామెంట్లు చేయడంతో విషయం మరింత తీవ్రమైందని చెబుతున్నారు. దీంతో... రామస్వామి చెప్పిన వాస్తవ విషయాలను గ్రహించే స్థాయి ఆలోచన చేయలేదో.. లేక, వివేక్ మాటల సారాంశాన్ని సంకుచిత మనస్తత్వంతో అర్ధం చేసుకున్నారో తెలియదు కానీ... డోజ్ సంయుక్త సారథిగా వివేక్ ఎంపికను మస్క్ అడ్డుకున్నారని అంటున్నారు.