డిప్యూటీ సీఎం మీద లోకేష్ కి మోజు లేదా ?

టీడీపీ తమ్ముళ్ళకు ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మంత్రి నారా లోకేష్ ఆశాకిరణం. తమ నాయకుడు ఉన్నత పదవులు అందుకోవాలని వారు బలంగా కోరుకుంటారు

Update: 2025-01-22 11:47 GMT

టీడీపీ తమ్ముళ్ళకు ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మంత్రి నారా లోకేష్ ఆశాకిరణం. తమ నాయకుడు ఉన్నత పదవులు అందుకోవాలని వారు బలంగా కోరుకుంటారు. ఇది సహజం కూడా. అయితే మాత్రం ప్రస్తుతం ప్రభుత్వంలో కానీ పార్టీలో కానీ లోకేష్ అధిక ప్రాముఖ్యతనే దక్కుతోంది. ఆయనకు టీడీపీలో అయితే ఎదురులేదు.

ఆయన పార్టీ మీద దాదాపుగా పట్టు సాధించారు. ఇక ప్రభుత్వంలో చూసుకుంటే ఆయన చంద్రబాబు తరువాత స్థానంలోనే ఉన్నారు. ఆయనకు విశేషమైన మర్యాద కూడా లభిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రత్యేకంగా ఆరవ వేలు లాంటి ఉప ముఖ్యమంత్రి పదవి లోకేష్ కి అవసరమా అన్న చర్చ కూడా ఉంది.

అయితే దానిని మహాసేన రాజేష్ ప్రతిపాదించి ముందుకు వదిలారు. ఆ మీదట కడపకు చెందిన టీడీపీ పొలిట్ బ్యూరో మెంబర్ శ్రీనివాసరెడ్డి ఎత్తుకున్నారు. మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, అలాగే పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ వంటి వారు కూడా ఫుల్ సపోర్టు ఇచ్చారు.

దాంతో అది పెద్ద ఇష్యూ అయిపోయింది. నిజానికి ఉప ముఖ్యమంత్రి పదవి మీద నారా లోకేష్ కి మోజు ఉందా అన్నది కదా ఇక్కడ తేలాల్సిన పాయింట్. అయితే దీని మీదనే దావోస్ లో ఒక టీవీ చానల్ ఇంటర్వ్యూలో లోకేష్ మాట్లాడినపుడు ఈ ప్రశ్న వచ్చింది. దానికి లోకేష్ బదులిస్తూ ఈ డిమాండ్ ని లైట్ తీసుకున్నట్లుగానే కనిపించారు.

తనకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్నో కీలకమైన శాఖలు ఇచ్చారని వాటితోనే చేతి నిండా పని ఉందని ఆయన గుర్తు చేశారు. తన మంత్రిత్వ శాఖలలోనే తాను పూర్తి స్థాయిలో పనిచేస్తూ ఏపీలో అభివృద్ధిని మరో స్థాయికి తీసుకుని వెళ్ళేందుకు కృషి చేస్తున్నాను అని చెప్పారు.

అందువల్ల తాను ప్రస్తుతం చేస్తున్న పనిలో తనకు అప్పగించిన బాధ్యతలతో ఫుల్ బిజీగానే ఉన్నానని బదులిచ్చారు. అందువల్ల డిప్యూటీ సీఎం అంటూ వస్తున్న వార్తలు జరుగుతున్న ప్రచారం అంతా కూడా రాజకీయ వ్యాఖ్యలుగానే ఆయన తీసుకున్నారు.

ఒక విధంగా లోకేష్ ఇచ్చిన ఈ సమాధానంతో డిప్యూటీ సీఎం అన్న డిమాండ్ కి చెక్ పెట్టేశారు అని అంటున్నారు. దీని వల్ల కొత్తగా ఒరిగేది ఏదీ లేకపోగా కూటమిలో ఇబ్బందులు వస్తాయన్నది కూడా టీడీపీ పెద్దలకు తెలియనిది కాదు అని అంటున్నారు. మరో వైపు చూస్తే కూటమిలో ఈ విషయంలో ఏమైనా గ్యాప్ ఏర్పడితే విభేదాలు వస్తే రాజకీయంగా అడ్వాంటేజ్ గా తీసుకునేందుకు వైసీపీ కాచుకుని కూర్చింది అంటున్నారు.

మరి ఈ విషయం లోకేష్ కి తెలియనిది కాదు అని అంటున్నారు. చంద్రబాబు తరువాత టీడీపీని లీడ్ చేయాల్సిన నాయకుడిగా లోకేష్ వర్తమానం, భవిష్యత్తు వంటివి ఒక డెసిషన్ తో ఎలా ఉండబోతాయో అంచనా వేయగలరనే అంటున్నారు.

అందుకే లోకేష్ తనకు ఉన్న బాధ్యతలు ఎక్కువగానే ఉన్నాయని అంటున్నారు. అంతే కాదు తాను వాటితోనే సంతృప్తిగా ఉన్నట్లుగా చెప్పకనే చెప్పేసారు. దాంతో టీడీపీ కూటమిలొ డిప్యూటీ సీఎం ఇష్యూ దాదాపుగా క్లోజ్ అయినట్లుగా భావించవచ్చా అంటే ప్రస్తుతానికి మాత్రం ఇదే నిజం అనుకోవాల్సి వస్తోంది మరి. రానున్న రోజులలో ఏమి జరుగుతుంది అన్నది మాత్రం రాజకీయ వెండి తెర మీద చూడాల్సిందే.

Tags:    

Similar News