అందు కోసమే ఈటల దూకుడు?
సౌమ్యుడు, మృదు స్వభావిగా చెప్పుకునే మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ ఒక్కసారిగా దూకుడు చూపడం రాజకీయంగా ఆసక్తికర చర్చకు దారితీస్తోంది.
సౌమ్యుడు, మృదు స్వభావిగా చెప్పుకునే మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ ఒక్కసారిగా దూకుడు చూపడం రాజకీయంగా ఆసక్తికర చర్చకు దారితీస్తోంది. తనలో ఆగ్రసివ్ యాంగిల్ ఉందనే చెప్పుకోడానికే ఈటల స్టైల్ మారిందా? అనే చర్చ జరుగుతోంది. ఏకశిలానగరులో ఓ రిలర్టరుపై ఈటల చేయిచేసుకోవడం అనుకోకుండా జరిగినా.. ఆయనలో అంతర్ముఖంగా ఎప్పటి నుంచో దాగున్న, దాక్కున్న మరో మనిషి బయటకు వచ్చారని ఈటల అనుచరులు చెబుతున్నారు. ఎప్పుడు శాంతంగా, మౌన మునిలా కనిపించే ఈటలలో సడన్ చేంజ్ కు మరో కారణం కూడా ఉందంటున్నారు. ఎప్పటి నుంచో తనను ఊరిస్తున్న బీజీపీ రాష్ర్ట అధ్యక్ష పదవికి తనకు అన్ని అర్హతలు ఉన్నాయని నిరూపించుకునేందుకే ఈటల అలా వ్యవహరించాల్సివచ్చిందా? అని అంటున్నారు.
2021 నుంచి బీజేపీలో కొనసాగుతున్న ఈటల రాజేందర్ ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవికి గట్టి పోటీదారుగా చెబుతున్నారు. బలమైన బీసీ నేత అయిన ఈటలపై పార్టీలో సానుకూల అభిప్రాయం ఉన్నా, ఆయన మెతక వైఖరే అధ్యక్ష పదవికి దూరం చేస్తోందనే వాదన వినిపిస్తోంది. ప్రతిపక్షంలో ఉండగా దూకుడు చూపించే నేత అధ్యక్షుడిగా ఉంటేనే ప్రజలకు ఆకట్టుకోవచ్చని కమల నాథులు భావిస్తున్నారని ప్రచారం జరుగుతోంది. అందుకే అన్ని విధాల అర్హత ఉన్నా ఈటలకు పార్టీ అధ్యక్ష పదవి ఇవ్వడంలో ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తున్నారని అంటున్నారు.
రాష్ట్ర రాజకీయాల్లో సీనియర్ నేతగా ఈటలకు మంచి గుర్తింపు ఉంది. అంతేకాకుండా బలమైన బీసీ సామాజిక నేపథ్యం కూడా ఆయనకు సానుకూలంగా చెబుతున్నారు. ఆరు సార్లు ఎమ్మెల్యేగా, రెండు సార్లు మంత్రిగా పనిచేసిన ఈటల ప్రస్తుతం ఎంపీగా వ్యవహరిస్తున్నారు. దాదాపు రెండున్నర దశాబ్దాలుగా రాజకీయాల్లో ఉన్నా, తెలంగాణ ఉద్యమ చరిత్ర అదనపు అర్హతగా ఉన్నా ఆయన స్లోగా ఉంటారని, మాటలోనూ పెద్దగా పంచ్ ఉండదనే కారణంతో పార్టీ అధ్యక్ష పదవి ఇవ్వడంలో బీజేపీ అధిష్టానం మీమాంస పడుతోందంటున్నారు. అయితే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ వంటివారికి తానే ప్రత్యామ్నాయం అనుకుంటున్న ఈటల తన విషయంలో పార్టీ తడబాటును అధిగమించాలనే ఆలోచనతోనే దూకుడు మార్గాన్ని ఎంచుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఎప్పుడు సౌమ్యంగా ఉండే ఈటలలో ఒక్కసారి యాగ్రసివ్ పొలిటీషయన్ బయటపడటంతో బీజేపీ అధ్యక్ష పదవికి లైన్ క్లియర్ అయినట్లు చెబుతున్నారు.