రాజ్యాంగంపై బీజేపీ ఎంపీ వివాదాస్పద వ్యాఖ్యలు!
దేశంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో బీజేపీ నేతలను మించినవారు ఎవరూ లేరనే సంగతి తెలిసిందే
దేశంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో బీజేపీ నేతలను మించినవారు ఎవరూ లేరనే సంగతి తెలిసిందే. తాజాగా ఇదే కోవలో కర్ణాటకకు చెందిన బీజేపీ ఎంపీ అనంత్ కుమార్ హెగ్డే రాజ్యాంగంపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర కలకలం రేపాయి. రాజ్యసభలో తమకు మూడింట రెండు వంతులు మెజారిటీ ఉంటే రాజ్యాంగాన్ని సవరిస్తామని ఆయన తాజాగా బాంబుపేల్చారు.
తమకు పార్లమెంటు రెండు సభల్లో మద్దతు ఉంటే హిందువులకు వ్యతిరేకంగా కాంగ్రెస్ ప్రభుత్వాలు తెచ్చిన అనేక చట్టాలను రద్దు చేస్తామని బీజేపీ ఎంపీ అనంతకుమార్ హెగ్డే వ్యాఖ్యానించారు. ఉత్తర కన్నడ జిల్లా సిద్ధాపూర్ లో జరిగిన కార్యక్రమంలో ఈ మేరకు ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.
‘‘కాంగ్రెస్ నేతలు కొన్ని అనవసరమైన విషయాలను ప్రవేశపెట్టి ప్రాథమికంగా రాజ్యాంగాన్ని మార్చినందున దాన్ని సవరించాలి. ముఖ్యంగా హిందూ సమాజాన్ని లొంగదీసుకునే చట్టాలను మార్చాల్సి ఉంది. వీటిని మార్చాలంటే బీజేపీకి లోక్ సభతో పాటు రాజ్యసభలోనూ మూడింట రెండొంతుల మెజారిటీ ఉండాలి’’ అని అనంతకుమార్ హెగ్డే తెలిపారు. రాజ్యాంగ పీఠికను సవరించేందుకు అవసరమైన మెజారిటీ ఉండాలన్నారు
రాజ్యాంగంలోని రాజ్యాంగ పీఠికను సవరించాలంటే బీజేపీ 20కి పైగా రాష్ట్రాల్లో అధికారంలోకి రావాల్సి ఉంటుందని అనంతకుమార్ హెగ్డే తెలిపారు.
‘‘ప్రధాని మోడీ చెప్పారు.. ఈసారి మాకు లోక్ సభలో 400 సీట్లు ఇవ్వాలని. ఎందుకంటే ఇదే కారణం. మాకు లోక్ సభలో మూడింట రెండొంతుల మెజారిటీ ఉంది. కానీ రాజ్యసభలో మాకు మూడింట రెండు వంతుల మెజారిటీ లేదు.. మాకు తక్కువ మెజారిటీ ఉంది. రాష్ట్ర ప్రభుత్వాలలో మాకు తగిన మెజారిటీ లేదు’’ అని హెగ్డే వ్యాఖ్యానించారు.
రానున్న లోక్ సభ ఎన్నికల్లో 400కు పైగా సీట్లు, రాజ్యసభలో కూడా మెజారిటీని బీజేపీ సాధించాల్సి ఉందని అనంతకుమార్ హెగ్డే తెలిపారు. ఇది జరిగితే మూడింట రెండు వంతుల రాష్ట్రాల్లో అధికారంలోకి రావడానికి దోహదపడుతుందని అన్నారు.
ఈ నేపథ్యంలో అనంతకుమార్ హెగ్డే వ్యాఖ్యలు కలకలం రేపడంతో బీజేపీ స్పందించింది. ఆయన వ్యాఖ్యలు వ్యక్తిగతమని పార్టీకి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేసింది. ఈ వ్యాఖ్యలపై ఆయన వివరణ కోరుతున్నట్టు ఎక్స్ వేదికగా వెల్లడించింది. బీజేపీ వేసే ప్రతి అడుగు, ప్రతి నిర్ణయం ఎల్లప్పుడూ దేశ ప్రయోజనాలకు, రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణంగానే ఉంటుందని ఆ పార్టీ తెలిపింది. కాగా కర్ణాటక నుంచి ఆరుసార్లు అనంత్ కుమార్ హెగ్డే లోక్ సభ ఎంపీగా ఎన్నికయ్యారు.