మరింతగా రాజుకుంటోంది: పెళ్లి చేయిస్తున్న అర్చకుడి మీద అకతాయి దారుణం!

పెళ్లి జరిపిస్తున్న పురోహితుడిని పెళ్లిలో పాల్గొన్న కొందరు ఎంత దారుణంగా వ్యవహరించారన్నది రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడో చర్చగా మారింది.

Update: 2024-04-22 05:22 GMT

సోషల్ మీడియా పుణ్యమా అని కాకినాడ జిల్లాలోని ఒక గ్రామంలో చోటు చేసుకున్న ఒక అకతాయి చర్య ఇప్పుడు అంతకంతకూ రాజుకుంటోంది. ఒక చిన్న ఉదంతం.. ఒక సామాజిక వర్గంపై కొందరు ప్రదర్శించే దారుణాలు ఎలా ఉంటాయన్న విషయాన్ని కళ్లకు కట్టినట్లుగా చూపుతోంది. పెళ్లి జరిపిస్తున్న పురోహితుడిని పెళ్లిలో పాల్గొన్న కొందరు ఎంత దారుణంగా వ్యవహరించారన్నది రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడో చర్చగా మారింది.

పెళ్లి మండపం మీద పెళ్లి కుమారుడు.. పెళ్లి కుమార్తెలను దీవిస్తున్న వేళ.. వెనుక నుంచి సిమెంట్ సంచిని తల మీద ఉంచే చర్యను పలువురు ఖండిస్తున్నారు. ఈ తీరుపై ఆగ్రహం వ్యక్తమవుతోంది. అక్కడితో ఆగకుండా పురోహితుడి మీద పసుపు.. కుంకుమ.. నీళ్ల పాకెట్లను విసురుతూ కామెడీ చేస్తున్న విషయాన్నీ పలువురు తప్పు పడుతున్నారు. ఈ వీడియో వైరల్ కావటం.. చర్యలు తీసుకోకపోవటంతో ఈ వివాదం అంతకంతకూ రాజుకుంటోంది.

కాకినాడ జిల్లా కొత్తపల్లి మండలం మూలపేటకు చెందిన ఆచెల్ల సూర్యనారాయణమూర్తి శర్మ ఏప్రిల్ 12న ఒక పెళ్లి చేయిస్తున్న సందర్భంగా దారుణ అనుభవాన్ని ఎదుర్కొన్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావటంతో బ్రాహ్మణ.. హిందూ సంఘాల నుంచి తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. ఈ సందర్భంగా కాకినాడ.. పిఠాపురం.. బిక్కవోలు ప్రాంతాల్లో బ్రాహ్మణులపై జరిగిన దాడుల్ని గుర్తు చేస్తున్నారు. తమపై జరుగుతున్న దాడులపై చర్యలు ఉండటం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

తాజా ఎపిసోడ్ పై పోలీసు ఉన్నతాధికారులు ఆలస్యంగా స్పందించారు. తాజాగా పిఠాపురం సీఐ శ్రీనివాస్ ఆదివారం విచారణ జరిపి.. పురోహితుడి నుంచి కంప్లైంట్ ఇవ్వాలని కోరారు. ఇదిలా ఉంటే బ్రాహ్మణులపై దాడులు ఆపకుంటే ఎన్నికలు బహిష్కరిస్తామని రాష్ట్ర బ్రాహ్మణ సంఘం ప్రతినిధులు హెచ్చరిస్తున్నారు. బ్రామ్మణ ఎట్రాసిటీ చట్టం తీసుకురావాలని వారు డిమాండ్ చేస్తున్నారు. పురోహితుడిపై అమానవీయంగా ప్రవర్తించిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ వ్యవహారంపై సదరు పురోహితుడిపై సానుభూతి వ్యక్తమవుతోంది. అదే సమయంలో ఆకతాయి తీరును తీవ్రంగా ఖండిస్తున్నారు.

Tags:    

Similar News