వైసీపీ హాట్ ఫేవరేట్ నంబర్ అదేనట...!?
వైసీపీ సంగతీ అలాగే ఉంది. లేటెస్ట్ గా వైసీపీ నేతలు వేసుకుంటున్న లెక్కలు అంతర్గతంగా సాగుతున్న చర్చలు చూస్తే ఒక నంబర్ దగ్గర ఆ పార్టీ ఆగింది అని అంటున్నారు. ఆ నంబరే 95 అని అంటున్నారు.
రాజకీయాలు జీవితాలూ అన్నీ కూడా నంబర్ల చుట్టే తిరుగుతాయి. మరీ ముఖ్యంగా కుర్చీ కోసం పోరాటం సాగే ప్రతీ సారీ నంబర్ గేం తోనే అంతా జరుగుతుంది. ఏపీలో చూస్తే 88 అన్నది మ్యాజిక్ ఫిగర్ ఈ నంబర్ చాలా ఆకర్షణీయంగా ఉందిపుడు.
ఈ నంబర్ ని టచ్ చేసిన పార్టీకి అయిదేళ్ళ పాటు సీఎం కుర్చీ దక్కుతుంది. దాంతో ఈ నంబర్ ని ఎలా రీచ్ కావాలన్నదే అటు అధికార వైసీపీకి అయినా ఇటు విపక్ష టీడీపీ కూటమికి అయినా కత్తి మీద సాముగా ఉంది. మాకు 175కి 175 సీట్లు అని వైసీపీ రెండేళ్ళుగా చెబుతూ వస్తోంది.
అయితే ఆ నినాదం ఇచ్చినప్పటి సీన్ వేరు. అపుడు ఒక్క టీడీపీయే ఉంది. పొత్తులు అన్నవి లేవు. ఆ తరువాత చంద్రబాబు అరెస్ట్ కావడంతో రాజకీయం కొంత మారింది. టీడీపీకి అనుకూలత సానుభూతి రూపంలో పెరిగింది. ఆ తరువాత జనసేన పొత్తుతో సామాజిక సమీకరణలు మారిపోయాయి. చివరిలో వచ్చి చేరిన బీజేపీ కూటమికి తులాభారంగా నిలిచింది.
దాంతో ఎలక్షనీరింగ్ లో అధికారంలో ఉన్న వైసీపీకి టీడీపీ కూటమి చుక్కలు చూపించింది అని అంటున్నారు. తమకు దరిదాపుల్లో కూడా టీడీపీ నిలవలేదని భావించిన వైసీపీకే రివర్స్ లో ఎటాక్ ఇచ్చే స్థాయికి టీడీపీ చేరుకుంది అంటే అదంతా బాబు మార్క్ వ్యూహం అని అంటున్నారు.
ఏదైతేనేమి పోలింగ్ జరిగిపోయింది. ఫలితాలు రావాల్సి ఉంది. ఇపుడు ఎలాగైనా అధికారం దక్కించుకోవడం అన్న దాని మీదనే పార్టీలు దృష్టి పెడుతున్నాయి. పైకి టీడీపీ 160 సీట్లు అని చెబుతున్న ముందు 88 మ్యాజిక్ ఫిగర్ ని టచ్ చేస్తే చాలు అన్నట్లుగానే ఉంది అంటున్నారు.
వైసీపీ సంగతీ అలాగే ఉంది. లేటెస్ట్ గా వైసీపీ నేతలు వేసుకుంటున్న లెక్కలు అంతర్గతంగా సాగుతున్న చర్చలు చూస్తే ఒక నంబర్ దగ్గర ఆ పార్టీ ఆగింది అని అంటున్నారు. ఆ నంబరే 95 అని అంటున్నారు. ఈ నంబర్ సీట్లు వైసీపీకి కచ్చితంగా దక్కుతాయని అంటున్నారు. ఆరు నూరు అయినా ఈ నంబర్ కి ఒక సీటు ఎగస్ట్రా వస్తుంది తప్ప తగ్గే సీన్ లేదు అని అంటున్నారు.
అదేలా అంటే రాయలసీమలోని నాలుగు జిల్లాలలో ఉన్న మొత్తం సీట్లు 52కి 2019లో వైసీపీకి మూడు తప్ప 49 సీట్లు దక్కాయి. ఈసారి వేవ్ ఆ రేంజిలో లేకపోతే పన్నెడు సీట్లు గరిష్టంగా తగ్గినా 40 ఖాయమని లెక్క వేసుకుంటోంది. ఇక నెల్లూరు ప్రకాశం జిల్లాలలో చూస్తే అక్కడ ఉన్న 22 సీట్లలో ఎంత చెడ్డా 10 సీట్లకు తక్కువ వైసీపీకి రావు అని మరో బండ లెక్క వేసుకుంటున్నారుట.
అదే విధంగా క్రిష్ణా గుంటూరులలో మొత్తం 33 సీట్లు ఉన్నాయి. ఇందులో చూస్తే కనిష్టంగా అయినా 15 సీట్లకు తగ్గేది లేదు అన్నది వైసీపీకి ఉన్న నమ్మకంగా ఉంది అంటున్నారు. అలాగే ఉభయ గోదావరి జిల్లాలు ఉత్తరాంధ్రా కలిపి మొత్తం 68 అసెంబ్లీ సీట్లు ఉంటే అందులో సగానికి సగం అంటే 30 సీట్లు ఖాయమని వైసీపీ ధీమాగ ఉందిట.
ఇలా ఇవన్నీ కలుపుకుంటే మ్యాజిక్ ఫిగర్ 88కి దాటేసి మరో ఏడు సీట్లు అదనంగా అంటే 95 దగ్గర తాము నిలుస్తామని ఇంటర్నల్ డిస్కషన్ లో లెక్కలేసుకుంటున్నారుట. ఇక ఆ మీదట అనుకూలత ఇంకా పెరిగితే వంద సీట్లు పై దాటుతామని కూడా భావిస్తున్నారుట. మొత్తం మీద చూస్తే మరోసారి అధికారం ఖాయమని వైసీపీ ధీమా వ్యక్తం చేస్తూనే ఆ నంబర్ దగ్గరే ఆగుతోంది. సో వైసీపీకి హాట్ ఫేవరేట్ నంబర్ 175 కాదు 95గా ఇపుడు ఉంది అని అంటున్నారు. చూడాలి మరి ఈవీఎం ఇచ్చే నంబర్ ఏమిటో.