ఉమా, వర్మ.. ఈ సారైనా?

ఎమ్మెల్యేల కోటాలో ఐదు ఎమ్మెల్సీ స్థానాలకు మార్చి 20 ఎన్నిక జరగనుంది. ఆరుగురు అభ్యర్థులు నామినేషన్ వేస్తేనే ఎన్నిక ఉంటుంది.

Update: 2025-02-24 20:30 GMT

టీడీపీలో త్యాగరాజుల తలరాత ఈ సారైనా మారబోతుందా? ఖాళీ అవుతున్న ఎమ్మెల్సీ స్థానాల్లో ఎవరికి చాన్స్ దక్కుతుంది? ఫస్ట్ పోస్టింగు నీకే అంటూ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నుంచి హామీ పొందిన పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ పరిస్థితి ఏంటి? క్రిష్ణా డెల్టాలో సీనియర్ గా గుర్తింపు పొందిన దేవినేనికి చాన్స్ ఇస్తారా? ఎస్పీ మహిళా కోటాలో ప్రతిభాభారతి.. చివరి నిమిషంలో చాన్స్ కోల్పోయిన గండి బాబ్జీ, మరోసారి పొడిగింపు కోరుతున్న యనమల, అశోక్ బాబు.. ఎమ్మెల్సీ హామీతో రాజ్యసభ సభ్యత్వాన్ని వదులుకున్న మోపిదేవి.. ఇలా ఎందరో టీడీపీ నేతలు ఎమ్మెల్సీ సీటుపై కన్నేశారు. మరి అధిష్టానం లిస్టులో ఎవరున్నారు? ముఖ్యంగా దేవినేని ఉమా, పిఠాపురం వర్మ ఫేటు ఇప్పటికైనా మారుతుందా? టీడీపీలో ఇప్పుడు ఇదే చర్చ సాగుతోంది. మరో రెండు వారాల్లో ఎమ్మెల్సీ కాబోయే లక్కీ లీడర్లు ఎవరంటూ నేతలు చర్చించుకుంటున్నారు.

ఎమ్మెల్యేల కోటాలో ఐదు ఎమ్మెల్సీ స్థానాలకు మార్చి 20 ఎన్నిక జరగనుంది. ఆరుగురు అభ్యర్థులు నామినేషన్ వేస్తేనే ఎన్నిక ఉంటుంది. ఐదుగురు మాత్రమే నామినేషన్లు దాఖలు చేస్తే ఎన్నిక ఏకగ్రీవం కానుంది. ప్రస్తుతం కూటమికి ఉన్న బలంతో ఐదు స్థానాలు గెలుచుకునే అవకాశం ఉంది. జనసేన, బీజేపీకి కేటాయించగా మిగిలిన స్థానాల కోసం టీడీపీలో తీవ్రమైన పోటీ కనిపిస్తోంది. ముఖ్యంగా రిటైర్ అవుతున్న యనమల, అశోక్ బాబు, జంగా క్రిష్ణమూర్తి మరో అవకాశం కోరుతున్నారు. యనమల టీడీపీలో సీనియర్ నేత.. ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉన్న ఆయన ఎమ్మెల్సీగా కొనసాగేందుకు ఆసక్తి చూపుతున్నారంటున్నారు. పైగా ముఖ్యమంత్రి చంద్రబాబుకు కుడి భుజంగా భావించే యనమలకు మంత్రి పదవి ఇవ్వలేదు. దీంతో ఆయన ఎమ్మెల్సీగా కొనసాగించాలని ఒత్తిడి చేస్తున్నారు. అదే సమయంలో ఉద్యోగ సంఘాల నేతగా గతంలో ఎమ్మెల్సీగా ఎన్నికైన అశోక్ బాబు.. పార్టీ వాయిస్ ను గట్టిగా వినిపించే నాయకుడిగా గుర్తింపు పొందారు. గత ప్రభుత్వంలో ఎంత ఒత్తిడి వచ్చినా ఆయన వెనక్కి తగ్గలేదు. ఈ కారణంగా ఆయన మరో చాన్స్ ఆశిస్తున్నారని చెబుతున్నారు. మరోవైపు ఎన్నికలకు ముందు వైసీపీ నుంచి పల్నాడు జిల్లాలో టీడీపీ గెలుపునకు పనిచేసిన తనకు అవకాశం ఇవ్వాలని మరో ఎమ్మెల్సీ జంగా క్రిష్ణమూర్తి కోరుతున్నారు. దీంతో టీడీపీలో కౌన్ బనేగా ఎమ్మెల్సీ అనేది ఇంట్రస్టింగ్ టాపిక్ గా మారింది.

రిటైరవుతున్న ముగ్గురి వాదనల్లో నిజమున్నా, ప్రస్తుత పరిస్థితుల్లో వారిని కొనసాగిస్తారా? లేదా? అనేది అధిష్టానంపై ఆధారపడివుంది. అయితే ఈ ముగ్గురిలో ఎవరిని కొనసాగించినా, చాన్స్ కోసం ఎదురుచూస్తున్న మిగిలిన నేతలకు నిరాశ తప్పదు. ముఖ్యంగా ఎమ్మెల్యే సీటును త్యాగం చేసిన నేతలకు ఎమ్మెల్సీ చాన్స్ ఇస్తామని గతంలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు హామీ ఇచ్చారు. అదేసమయంలో సామాజిక సమీకరణలు, యూత్, సీనియర్స్ ఇలా అనేక కోణాల్లో పరిశీలించి, ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సివుంటుందని అంటున్నారు. దీంతో ఎమ్మెల్సీ రేసులో ముందున్న పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ, మాజీ మంత్రి దేవినేని ఉమా వంటివారు టెన్షన్ కు గురవుతున్నారు.

డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కోసం మాజీ ఎమ్మెల్యే వర్మ తన సీటు త్యాగం చేశారు. తాను పక్కాగా గెలుస్తాననే నమ్మకంతో ఉన్న ఆయనను ఒప్పించడం అప్పట్లో టీడీపీ అధినేతకు శిరోభారంగా మారిందని గుర్తు చేస్తున్నారు. అయితే చంద్రబాబు మాటపై గౌరవంతో పోటీ నుంచి తప్పుకున్న వర్మకు తొలి అవకాశం ఇస్తామని అప్పట్లో హామీ ఇచ్చారు. చంద్రబాబుతోపాటు డిప్యూటీ సీఎం పవన్ సైతం వర్మ పదవికి గ్యారెంటీ ఇచ్చారు. అయితే అదే ప్రాంతం నుంచి సీనియర్ నేత యనమల కూడా పట్టుబడుతుండటం చర్చనీయాంశం అవుతోంది. వర్మకు ఇప్పటికే ఆలస్యమైందనే భావన పార్టీలో ఉన్నా, ఇతర అంశాలను పరిశీలిస్తే వర్మకు టెన్షన్ తప్పదని అంటున్నారు. ఇక తన చిరకాల రాజకీయ ప్రత్యర్థి కోసం సీటు వదులుకున్న సీనియర్ నేత దేవినేని ఉమా కూడా ఎమ్మెల్సీ చాన్స్ కోసం ఎదురుచూస్తున్నారు.

గత ఎన్నికల్లో మైలవరం నుంచి పోటీ చేయాల్సిన ఉమా.. తన ప్రత్యర్థి అప్పటి వైసీపీ ఎమ్మెల్యే వసంత క్రిష్ణప్రసాద్ టీడీపీలో చేరికతో అవకాశం కోల్పోయారు. ఎన్నికల్లో వసంత గెలవడంతో ఉమాకు ఎమ్మెల్సీ చాన్స్ ఇస్తామని పార్టీ హైకమాండ్ హామీ ఇచ్చింది. ప్రస్తుతం క్రిష్ణా జిల్లాలో సీనియర్ నేతగా ఉమాకు గుర్తింపు ఉంది. మిగిలిన సీనియర్లకు నామినేటెడ్ పదవుల్లో నియమించినా ఉమాను మాత్రం వెయిటింగులో పెట్టారు. ప్రస్తుతం ఏర్పడిన ఖాళీల్లో ఉమాకు చాన్స్ ఇస్తారా? లేదా? అనేది ఉత్కంఠకు గురి చేస్తోంది. వర్మ, ఉమానే కాదు టీడీపీలో చాలా మంది సీనియర్లు ఎమ్మెల్సీ రేసులోకి దూసుకొస్తున్నారు. దీంతో ముఖ్యమంత్రి చంద్రబాబు చాయిస్ ఎలా ఉంటుందనేది సస్పెన్స్ క్రియేట్ చేస్తోంది. ఏదిఏమైనా నామినేషన్ల దాఖలకు చివరి రోజైన మార్చి 10 వరకు ఈ టెన్సన్ ను అనుభవించాల్సిందే...

Tags:    

Similar News