అమరావతికి మరో శుభవార్త.. హడ్కో నుంచి రూ.11 వేల కోట్లు

ఐదేళ్లుగా పడకేసిన పనులతో అడవిలా మారిన రాజధాని అమరావతి ఇప్పుడిప్పుడే కొత్త రూపు తెచ్చుకుంటోంది.

Update: 2025-01-23 04:56 GMT

కూటమి పాలనలో అమరావతికి అన్నీ మంచి శకునాలే కనిపిస్తున్నాయి. ఐదేళ్లుగా పడకేసిన పనులతో అడవిలా మారిన రాజధాని అమరావతి ఇప్పుడిప్పుడే కొత్త రూపు తెచ్చుకుంటోంది. ఆగిపోయిన నిర్మాణాలు పున: ప్రారంభానికి ఆర్థిక భరోసా దక్కుతోంది. ఇప్పటికే ప్రపంచ బ్యాంకు నుంచి రూ.15 వేల కోట్లు రిలీజ్ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ రాగా, తాజాగా రూ.11 వేల కోట్లు ఇచ్చేందుకు హడ్కో అంగీకరించింది. దీంతో రాజధాని నిర్మాణానికి ఏకంగా రూ.26 వేల కోట్లు సమకూరినట్లైంది.

రాజధాని అమరావతికి నిధుల కొరత తీరిపోయింది. కేంద్ర ప్రభుత్వం గ్యారెంటీతో ప్రపంచ బ్యాంకు, ఏడీబీ కలిపి రూ.15 వేల కోట్లు అందించేందుకు రుణ ప్రణాళిక విడుదల చేసింది. ఈ నెలలో తొలి విడత డబ్బు అందనుంది. ఆరేళ్ల పాటు క్రమం తప్పకుండా ఈ నిధులు సమకూరనున్నాయి. ఈ నిధులతో రాజధానిలో భవన నిర్మాణాలు, మౌలిక వసతులు కల్పించాలని షరతులు విధించింది. దీంతో రాజధాని పనులను ప్రభుత్వం పట్టాలెక్కించింది. ఇక ఈ పనులు చకచక జరుగుతుండగా, మరో శుభవార్త అందింది. రాజధాని పనుల కోసం తాము రూ.11 వేల కోట్లు ఇవ్వనున్నట్లు హడ్కో లేఖ రాసింది.

రాజధాని అమరావతి నిర్మాణానికి మొత్తంగా రూ.45 వేల కోట్లు అవసరం అవుతాయని ప్రభుత్వం అంచనా వేస్తోంది. ఈ నిధుల సమీకరణకు తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ప్రభుత్వ ఏర్పడిన వెంటనే రాజధానిపై ఫోకస్ చేసిన సీఎం చంద్రబాబు కేంద్ర ప్రభుత్వం ద్వారా ప్రపంచ బ్యాంకును సంప్రదించి రూ.15 వేల కోట్లు సాధించారు. అదేవిధంగా రుణం కోసం హడ్కోకు దరఖాస్తు చేయగా, ముంబైలో సమావేశమైన బోర్డు రూ.11 వేల కోట్లు ఇచ్చేందుకు అంగీకరించింది. ఇలా నెల రోజుల వ్యవధిలో రూ.26 వేల కోట్లు సమకూరాయి. ఇంకా రూ.19 వేల కోట్లు సమీకరిస్తే రాష్ట్ర ప్రజలు కలలు కంటున్న రాజధాని సాకారమవుతుంది. ప్రస్తుతానికి నిధుల కొరత లేకపోవడంతో తొలి దశ పనులు చకచకా జరుగుతున్నాయి. ఈ నిధులతో పరిపాలనా భవనాలు, అసెంబ్లీ, హైకోర్టు, కరకట్ట విస్తరణ గ్రీనరీ, రిజర్వాయర్లు, కాలువలు నిర్మించనున్నారు.

Tags:    

Similar News