మరో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేకు కాంగ్రెస్ సర్కార్ షాక్..

ఆయా వ్యాపారాల్లో బకాయిలు ఉండడంతో ప్రస్తుతం వాటిని వసూలు చేసుకునేందుకు కాంగ్రెస్ సర్కారు సిద్ధమైంది.

Update: 2023-12-16 10:15 GMT

బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలకు కాంగ్రెస్ సర్కార్ షాక్ ల మీద షాక్ లు ఇస్తుంది. కేసీఆర్‌ హయాంలో తమ వ్యాపారాలను విస్తరించిన ఎమ్మెల్యేలపై కాంగ్రెస్ ప్రభుత్వం విరుచుకుపడుతుంది. వారి వ్యాపారాలపై ఆరా తీస్తుంది. ఆయా వ్యాపారాల్లో బకాయిలు ఉండడంతో ప్రస్తుతం వాటిని వసూలు చేసుకునేందుకు కాంగ్రెస్ సర్కారు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో పలువురు మాజీ ఎమ్మెల్యేలకు సంబంధించిన షాపింగ్ కాంప్లెక్స్ లు, రైస్ మిల్లు్లకు చెందిన బకాయిలు కట్టాలని నోటీసులు జారీ చేయడం, కేసులు నమోదు చేయడం వంటివి చేస్తుంది. ఇందులో ఉమ్మడి నిజామాబాద్ కు చెందిన ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు ఉండడం గమనార్హం.

ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి తన సతీమణి రజిత రెడ్డి పేరిట ఆర్మూర్ పట్టణంలోని టీఎస్ ఆర్టీసీ స్థలాన్ని విష్ణుజిత్ ఇన్ ఫ్రా డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ పేరిట లీజుకు తీసుకున్నారు. ఇందులో గతేడాది మాల్ అండ్ మల్టిప్లెక్స్ పేరిట ఐదంతస్తుల భవనం నిర్మించారు. ఈ మేరకు తమ వద్ద తీసుకున్న రూ.20 కోట్ల రుణంతో పాటు వడ్డీ మరో రూ.25 కోట్లు కలిపి మొత్తం రూ.45 కోట్లు చెల్లించాలంటూ స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ అధికారులు మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి నోటీసులు జారీ చేశారు. ఈ మేరకు ఆ నోటీసులకు ఆర్మూర్ లోని ఆయన ఇంటికి అంటించారు. పైగా బకాయిలు చెల్లించే వరకు మాల్ తెరిచేది లేదంటూ సీజ్ చేశారు. ఇదంతా కొన్ని రోజులుగా జరుగుతుండగా, ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో చర్చనీయాంశమైంది. ఇదిలా ఉండగా, మరో ఎమ్మెల్యేకు సర్కారు షాకిచ్చింది.

షకీల్ రైస్ మిల్లుల్లో సోదాలు..

బోధన్ మాజీ శాసన సభ్యుడు మహ్మద్ షకీల్ కు కాంగ్రెస్ సర్కారు ఝలక్ ఇచ్చింది. ఆయన కుటుంబ సభ్యుల రైస్ మిల్లుల్లో అధికారులు సోదాలు చేశారు. సీఎంఆర్ ధాన్యం మాయమైనట్లు, బకాయిలు చెల్లించనున్నట్లు గుర్తించారు. సుమారు రూ.70 కోట్ల విలువైన కస్టమ్ మిల్లింగ్ రైస్ ఎక్కడికి పోయిందోనన్న లెక్కలు లేవు. దీనికి తోడు రూ.9 కోట్ల బకాయిలు చెల్లించాల్సి ఉందంటూ కేసు నమోదు చేశారు.

వీరే కాకుండా.. పలువురు ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు తమ వ్యాపారాలను కాపాడుకునేందుకు ప్రభుత్వ శాఖల్లోని వివిధ కార్పొరేషన్ల ద్వారా రుణాలు తీసుకున్నారు. వాటిని చెల్లించకపోవడంతో ప్రభుత్వం రికవరీ చేసుకునేందుకు నోటీసులు, కేసులు నమోదు చేస్తున్నది.

Tags:    

Similar News