ఇళ్ల ధరలు భారీగా పెరగవు.. ఆ సంస్థ అధిపతి కీలక వ్యాఖ్య

మాంచి ఊపు మీద ఉన్న రియల్ రంగం కారణంగా.. ఇళ్ల ధరలు భారీగా పెరిగిపోయాయి.

Update: 2024-05-23 09:30 GMT

సొంతింటి కలను తీర్చుకోవటానికి చేసే ప్రయత్నాలు అన్నిఇన్ని కావు. కొవిడ్ కు ముందుతో పోలిస్తే.. సొంతింటి కలను తీర్చుకోవాల్న ఆసక్తి.. ఆత్రుత దేశ వ్యాప్తంగా భారీగా పెరిగిందని చెప్పాలి. కొవిడ్ పుణ్యమా అని ఇంటి విషయంలో కొత్త ఆలోచనలు తెర మీదకు రావటమే కాదు.. రియల్ ఎస్టేట్ రంగాన్ని సమూలంగా మార్పులు చేసిందని చెప్పాలి. ఇదంతా ఒక ఎత్తు అయితే కొవిడ్ తర్వాత కొంత కాలం మార్కెట్ స్తబ్దుగా ఉన్నా.. ఆ తర్వాత పుంజుకోవటం వేగంగా రికవరీ ఉండటం తెలిసిందే.

మాంచి ఊపు మీద ఉన్న రియల్ రంగం కారణంగా.. ఇళ్ల ధరలు భారీగా పెరిగిపోయాయి. ఇలాంటివేళ.. సొంతింటి కోసం ఆత్రుత పడే వారి హడావుడికి బ్రేకులు వేసేలా కీలక వ్యాఖ్య చేశారు కుష్ మన్ అండ్ వేక్ ఫీల్డ్ ఇండియా అధిపతి అన్షుల్ జైన్. ఆయన చేసిన వ్యాఖ్యను చూస్తే.. ఇళ్ల ధరలు గరిష్ఠంగా ఉన్నాయని.. రానున్న రోజుల్లో ధరల విషయంలో భారీ మార్పు ఉంటుందని తాను అనుకోవట్లేదన్నారు.

కొవిడ్ పరిణామాల నేపథ్యంలో ఇళ్లకు పెరిగిన గిరాకీ కారణంగా ఇళ్ల సరఫరాతో పాటు ధరలు కూడా భారీగా పెరిగాయి. రానున్న కొద్ది నెలల్లో ఇళ్ల ధరల్లో పెద్దగా మార్పులు ఉండే అవకాశం తక్కువని స్పష్టం చేశారు. దీని వెనకున్న లాజిక్కు చెబుతూ.. ‘‘కొవిడ్ తర్వాత ఇళ్లకు గిరాకీ పెరిగింది. గడిచిన రెండేళ్లలో ఇళ్ల సరఫరా భారీగా జరిగింది. దీంతో ధరలు ఎక్కువయ్యాయి. ఈ కారణంగా రానున్న కొంతకాలం వరకు ఇళ్ల ధరల్లో నామమాత్రం తప్పించి ఎక్కువగా పెరిగే అవకాశాలు తక్కువ’’ అని పేర్కొన్నారు.

అయితే.. ఇళ్ల గిరాకీ మాత్రం పెరుగుతుందని.. దీనికి కారణం ప్రతి ఒక్కరు సొంతిల్లు మీద మక్కువ పెంచుకుంటున్నారని.. దీనికి తోడు పెరిగిన ఆదాయాలు కూడా అందుకు కారణంగా మారిందన్నారు. 2013-19 మధ్య కాలంలో భారతదేశంలో ఇళ్లకు గిరాకీ స్తబ్దుగా ఉండేదని.. ధరలు పెద్దగా పెరిగింది లేదన్నారు. అద్దెకు ఉన్నా సరిపోతుందన్న భావనతో పాటు.. సొంతిల్లు ఎందుకు? అన్నట్లుగా అప్పట్లో ఉండేవారన్న ఆయన.. ‘‘కరోనాతో ఈ ఆలోచనా తీరును పూర్తిగా మార్చేసింది. అద్దె ఇంట్లో ఉన్న వారు అప్పట్లో చాలా బాధలు పడ్డారు. ఆ టైంలో సొంతిట్లో ఉండే స్థిరత్వాన్ని అర్థం చేసుకున్నారు. అంతేకాదు.. అభిరుచుల్లోనూ మార్పు వచ్చింది. పెద్ద ఇళ్ల వైపు చూసే వారి సంఖ్య పెరిగింది’’ అంటూ వివరించారు. తక్కువగా ఉండే వడ్డీ రేట్లు కూడా పెద్ద ఇళ్లను కొనే విషయంలో తమ ఆలోచనల్ని మార్చేలా చేసిందంటున్నారు.

ఇప్పటికే పెరిగిన ఇళ్ల ధరల కారణంగా రాబోయే రోజుల్లో గిరాకీ ఉన్నప్పటికీ ధరల్లో వ్యత్యాసం పెద్దగా ఉండదని చెప్పిన జైన్.. మరో ఆసక్తికర అంశాన్ని వెల్లడించారు. 2023లో 8 ప్రధాన నగరాల్లో ఇళ్ల అమ్మకాలు జీవనకాల గరిష్ఠానికి చేరగా.. ధరలు మాత్రం యావరేజ్ ను ఏడాదికి పది శాతం చొప్పున పెరిగినట్లుగా పేర్కొన్నారు. ఇందుకు భిన్నంగా పట్టణాలు.. నగరాల్లో మాత్రం 40 శాతం నుంచి 70 శాతం వరకు పెరిగినట్లుగా వెల్లడించారు. ఈ కారణంగానే రానున్న కొంతకాలం వరకు ధరలు భారీగా పెరిగే అవకాశాలు లేవంటున్నారు. ఇళ్లు కొనాలన్న ఆలోచన ఉన్న వారు హడావుడితో కాకుండా ఆలోచనతో నిర్ణయం తీసుకుంటే మంచిదన్న సూచన చేస్తున్నారు.

Tags:    

Similar News