మొరాకో భారీ భూకంపంలో .. ప్రముఖ తెలుగు ట్రావెలర్

తాజాగా మొరాకో విపత్తుకు గురైంది. 300 మందిపైగా ప్రాణాలు కోల్పోయినట్లుగా తెలుస్తోంది. శుక్రవారం రాత్రి భూకంపం సంభవించింది.

Update: 2023-09-09 07:09 GMT

ఆఫ్రికా దేశం మొరాకోను భారీ భూకంపం కుదిపేసింది. అట్లాంటిక్ సముద్ర తీరంలో ఉండే ఈ దేశం ఆఫ్రికన్, ఇస్లామిక్, అరబ్, యూరోపియన్ కల్చర్ తో ప్రభావితం అయి ఉంటుంది. అత్యంత చిన్న దేశం అయినప్పటికీ ఏటా 5 లక్షల మందిపైగా ఈ దేశాన్ని సందర్శిస్తారు. ఇటీవలే పశ్చిమాసియాలోని తుర్కియే, సిరియాలు భూకంపం బారిన పడగా.. తాజాగా మొరాకో విపత్తుకు గురైంది. 300 మందిపైగా ప్రాణాలు కోల్పోయినట్లుగా తెలుస్తోంది. శుక్రవారం రాత్రి భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్ పై దీని తీవ్రత 6.8గా నమోదైంది. మరణాల సంఖ్య మరింత పెరిగే ప్రమాదం ఉందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అల్‌ హౌజ్‌, మర్రాకేశ్‌, క్వార్జాజేట్‌, అజిలాల్‌ సహా పలు ప్రాంతాల్లో ప్రాణ నష్టం ఎక్కువగా ఉంది. 150 మందిపైగా గాయపడ్డారని ప్రభుత్వం పేర్కొంది. కాగా, క్షతగాత్రులతో మొరాకోలోని భూకంప ప్రభావిత ప్రాంత ఆసుపత్రులు నిండిపోయాయి.

వందేళ్లలో లేనంత విపత్తు పశ్చిమాసియాలో.. ఆఫ్రికా ఖండానికి దగ్గరగా ఉండే దేశాలు సిరియా, తుర్కియే. ఈ ఏడాది ఫిబ్రవరిలో వీటిలో సంభవించిన భూకంపం భారీ ఆస్తి, ప్రాణ నష్టాన్ని మిగిల్చింది. ఇప్పుడు మొరాకోలో శతాబ్దకాలంలో ఉత్తర ఆఫ్రికాలో ఎరుగనటువంటి భూకంపం వచ్చింది. మర్రాకేశ్‌ కు నైరుతి దిశగా 71 కిలోమీటర్లు దూరంలో భూకంపం కేంద్రం ఉంది. కాగా, భూకంపం సృష్టించిన విధ్వంసం దృశ్యాలు సోషల్ మీడియాలోకి వచ్చాయి. కాగా, మొరాకోలో భూకంపంపై భారత ప్రధాని మోదీ స్పందించారు. ప్రాణ నష్టం అధికంగా ఉండడంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మొరాకో ప్రభుత్వంతో కలిసిపనిచేయడానికి సిద్ధమని ప్రకటించారు.

మొరాకోలో చిక్కుకున్న నా అన్వేషణ సాహస, ఆసక్తికర యాత్రలకు పేరుగాంచిన తెలుగు యాత్రికుడు అన్వేష్ ప్రస్తుతం మొరాకోలోనే ఉన్నాడు. ఏపీలోని విశాఖపట్టణానికి చెందిన అతడు ప్రపంచ యాత్ర చేస్తున్నాడు. ఇప్పటికే చాలా దేశాలు పర్యటించాడు. కొద్ది రోజుల కిందటే మొరాకో చేరుకుని అక్కడి విశేషాలను చిత్రీకరించి తన యూట్యూబ్ చానల్ 'నా అన్వేషణ'లో ఉంచుతున్నాడు. ఇలానే మొరాకోలోని బ్లూ సిటీ, చారిత్రక ప్రదేశాలను వీడియోలు చిత్రీకరించాడు. అయితే, మరికొద్ది రోజుల్లో యాత్ర ముగించుకుని వచ్చేసే ప్రణాళికలో ఉండగా భూకంపంలో చిక్కుకున్నారు.

బ్రెజిల్ యువతితో కలిసి..అన్వేష్ గతేడాది బ్రెజిల్ లో పర్యటించారు. ఆ సమయంలో అమెజాన్ అడవిలో ఎన్నో సాహస యాత్రలు సాగించారు. అప్పుడే బ్రెజిల్ కు చెందిన యువతి మెలిసా ఆయనకు పరిచయమైంది. ఇద్దరూ క్లోజ్ ఫ్రెండ్స్ అయ్యారు. మధ్యలో కొంత సమాచార గ్యాప్ వచ్చినా.. మళ్లీ మొరాకో పర్యటన సందర్భంగా కలుసుకున్నారు.

మెలిసాతో కలిసే మొరాకోలో పర్యటిస్తున్నారు. కాగా, భూకంపం సమయంలోనూ మెలిసాను అన్వేషణ అప్రమత్తం చేశారు. వీరిద్దరూ చేతికి దొరికిన వస్తువులతో బయటకు వచ్చేశారు. కాగా, భూకంపం గురించి ఎల్ సాల్వడర్, గ్వాటెమాలాలో ఉన్న సమయంలో అనుభవం ఎదుర్కొన్న అన్వేష్ మొరాకో ప్రజలను అప్రమత్తం చేశారు.

అన్వేష్ సోషల్ మీడియాలో ఫేమస్ విశాఖ జిల్లాలోని పేద కుటుంబంలో పుట్టిన అన్వేష్.. కష్టపడి హోటల్ మేనేజ్ మెంట్ వరకు చదివారు. అదే అర్హతతో అమెరికాలో నాలుగేళ్లు ఉద్యోగం కూడా చేశారు. పర్యటనలో ఉన్న ఆసక్తితో ప్రపంచాన్ని చుట్టివచ్చేందుకు సమాయత్తం అయ్యారు. కాగా, అన్వేష్ సోషల్ మీడియాలో చాలా ఫేమస్. తన మాట తీరు ప్రత్యేకంగా ఉండడంతో పాటు ప్రపంచంలోని ఎవరూ చూడని ప్రదేశాలను చూపిస్తూ ఆకట్టుకుంటాడు. అతడి యూట్యూబ్ చానల్ కు 15 లక్షల మంది సబ్ స్ర్కైబర్లున్నారు. అతడి వీడియోలకు లక్షల్లో వ్యూస్ వస్తుంటాయి. భూకంపంపై చిత్రీకరించిన వీడియోకే 2 లక్షల వ్యూస్ వచ్చాయి.

టాలీవుడ్ కూ ప్రయత్నాలు అన్వేష్ కు టాలీవుడ్ లోనూ మంచి పరిచయాలు ఉన్నాయి. సాహస యాత్రికుడిగా ఉన్న ప్రత్యేకతతో పాటు తన మాటతీరే దీనికి కారణం. ఈ నేపథ్యంలోనే అన్వేష్ ను సినిమాల్లో నటింపజేసే ప్రయత్నాలు సాగాయి. అయితే, అతడు ప్రపంచ యాత్రలో ఉండడంతో దీనికి ఇప్పటికి అవకాశం రాలేదు.

Full View
Tags:    

Similar News