మద్యపాన ప్రియులకు సర్కార్ గుడ్ న్యూస్.. తెరపైకి సర్ ప్రైజింగ్ రేట్లు!

అయితే.. మరోపక్క అది కాస్తా సామాన్యుడి నడ్డి విరిచిందనే చర్చ జరిగింది!

Update: 2024-09-18 11:58 GMT

ఏపీలో గత ప్రభుత్వ హయాంలో తీసుకొచ్చిన లిక్కర్ పాలసీ ఏ స్థాయిలో వివాదాస్పదమైందనే సంగతి తెలిసిందే! భారీగా ధరలు పెంచడం వల్ల మద్యపాన వినియోగం తగ్గుతుందనే ఆలోచనలు అప్పట్లో వినిపించాయి! అయితే.. మరోపక్క అది కాస్తా సామాన్యుడి నడ్డి విరిచిందనే చర్చ జరిగింది!

ఈ సమయంలో.. తాము అధికారంలోకి వస్తే తక్కువ ధరకే నాణ్యమైన మద్యం అందుబాటులోకి తెస్తామని టీడీపీ ప్రకటించింది. ఈ క్రమంలో చెప్పినట్లుగానే కూటమి ప్రభుత్వం తాజాగా కొత్త లిక్కర్ పాలసీని తెరపైకి తెచ్చింది. తాజాగా నూతన మద్యం విధానానికి ఆంధ్రప్రదేశ్ కేబినెట్ ఆమోదం తెలిపింది.

అవును... సీఎం చంద్రబాబు అధ్యక్షతన సాగిన ఏపీ మంత్రివర్గ సమావేశంలో నూతన మద్యం విధానానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ సందర్భంగా నాణ్యమైన మద్యం బ్రాండ్లు అందుబాటులో ఉంచాలని నిర్ణయించింది. ఇదే క్రమంలో... సగటు మద్యం ధర రూ.99 నుంచి అందుబాటులో ఉంచాలని నిర్ణయించింది.

ఇదే క్రమంలో... వాలంటీర్ వ్యవస్థ, సచివాలయ వ్యవస్థల విషయంలోనూ కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇందులో భాగంగా... వాలంటీర్లు, సచివాలయాలను వివిధ శాఖల్లో కలిపేలా చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. వాలంటీర్లు, సచివాలయాలకు న్యూస్ పేపర్ ల కొనుగోలుకు నెల నెలా ఇచ్చే రూ.200 రద్దు చేశారు.

మరోపక్క బోగాపురం ఎయిర్ పోర్ట్ కు అల్లూరి సీతారామరాజు విమానాశ్రయంగా నామకరణం చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇదే క్రమంలో... పోలవరం డయాఫ్రమ్ వాల్ నిర్మాణం, సీడబ్ల్యూసీ సూచనల మేరకు పాత ఏజన్సీకే ఇవ్వాలని నిర్ణయించారు. హోంశాఖలో కొత్త కార్పొరేషన్ ఏర్పాటు చేసి దానికి రూ.10 కోట్ల కార్పస్ ఫండ్ విడుదల చేయనున్నారు!

పింఛన్ల పంపిణీపై కీలక నిర్ణయం!:

ఇదే సమయంలో ఏపీలో పింఛన్ల పంపిణీపైనా ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు.. పింఛన్ల పంపిణీ మార్గదర్శకాలను సవరించింది. ఇందులో భాగంగా... 1వ తేదీ సెలవు రోజుగా ఉంటే.. ఆ ముందురోజే ఇళ్లవద్దకు వెళ్లి డబ్బులు అందించాలని తెలిపింది. రెండో తేదీన మిగిలిన వాటిని పూర్తి చేయాలని.. ఆరోజు సెలవు ఉంటే మూడో తేదీన పూర్తి చేయాలని స్పష్టం చేసింది.

Tags:    

Similar News