ఉచిత బస్సు ... ఖజానాకు ఆరు వేల కోట్లు ఖర్చు

దాంతో భారీ పధకాలను కనుక ఒకసారి ప్రారంభిస్తే వాటిని ఆపకుండా నిరంతరాయంగా కోనసాగించాలి.

Update: 2025-02-05 12:30 GMT

ఏపీలో సూపర్ సిక్స్ హామీలను నెరవేర్చాలని టీడీపీ కూటమి ప్రభుత్వానికి ఉన్నా కూడా ఆచరణలో మాత్రం అడుగులు ముందుకు పడడం లేదు. దానికి కారణం ఆర్థికంగా ఉన్న ఇబ్బందులే. ఖజానా వట్టిపోయిన నేపథ్యం ఉంది. గట్టిగా చెప్పాలీ అంటే దైనందిన ఖర్చుల కోసమే ఇబ్బందులు పడే నేపథ్యం ఉంది. దాంతో భారీ పధకాలను కనుక ఒకసారి ప్రారంభిస్తే వాటిని ఆపకుండా నిరంతరాయంగా కోనసాగించాలి.

అందుకే పెద్ద బరువుని మోయగలమా లేదా అన్నది సర్కార్ ఒకటికి పదిసార్లు ఆలోచిస్తోంది. అలా చూస్తే కనుక ఉచిత బస్సు సదుపాయం మహిళలకు కల్పిస్తామని కూటమి పెద్దలు గత ఏడాది ఎన్నికల వేళ హామీ ఇచ్చారు. కానీ దాని లెక్క తీస్తే చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారమే అని తేలుతోంది.

ఇక ఉచిత బస్సు విషయంలో అనేక డేట్లు ప్రకటించారు. మంత్రులు కూడా అదిగో ఇదిగో అన్నారు. చూడబోతే ఏకంగా ఎనిమిది నెలల కాలం గడచిపోయింది. మొదట దసరా ఆ తరువాత సంక్రాంతి అన్నారు ఇపుడు ఉగాదీ అని అంటున్నారు. ఉగాది పండుగ కూడా ఎంతో దూరం లేదు. మార్చి 30న ఉగాది పండుగ ఉంది.

అంటే గట్టిగా యాభై రోజులు అన్న మాట. మరి ఈసారి రయ్ రయ్ మంటూ ఉచిత బస్సు ఏపీ రోడ్ల మీద తిరిగుతుందా అంటే ఇంకా ఆలోచించాల్సిందే అని అంటున్నారు. ఎందుకంటే ఈ ఉచిత బస్సు ఏపీకి కొత్తది కానీ కర్ణాటక తెలంగాణాలలో అమలు చేస్తున్నారు. ఈ రెండు రాష్ట్రాలలో కూడా ఏపీకి చెందిన ఆర్టీసీ అధికారులు మంత్రుల బృందం కూడా పర్యటించి ఈ పధకం గురించి అక్కడ అమలు తీరు సాదక బాధకాలను తెలుసుకున్నారు.

ఇక హోం శాఖ, రవాణాశాఖ, మహిళ శిశు సంక్షేమశాఖకు చెందిన మంత్రులతో కూడిన కమిటీ తెలంగాణా కర్ణాటకలలో పర్యటించింది. ఆ తరువాత మంత్రుల కమిటీ ప్రభుత్వానికి సమర్పించిన నివేదికలో పలు కీలకమైన అంశాలు ఉన్నాయని అంటున్నారు. ఆయా రాష్ట్రాలలో మహిళలకు ఉచిత బస్సు సదుపాయం ఉంది. దాంతో చాలా చోట్ల పురుషులకు సీటు కూడా దొరకడం లేదు, అనేక రూట్లలో ఇదే పరిస్థితి ఉందని అంటున్నారు.

అదే విధంగా అంతర్రాష్ట్ర సర్వీసులకు మాత్రమే ఉచిత బస్సు పధకాన్ని అమలు చేస్తున్నారు. అంటే పొరుగు రాష్ట్రాల సరిహద్దుల దాకా నడిపి అక్కడితో ఉచిత బస్సుని ఆపేస్తున్నారు. అలా కొన్ని సర్వీసులకు మాత్రమే ఉచిత బస్సు పధకాన్ని పరిమితం చేశారు అని అంటున్నారు.

ఇక అసలు విషయానికి వస్తే మహిళలకు ఉచిత బస్సు పధకం వల్ల ఆయా రాష్ట్రాలలో ఖజానా మీద పెను భారమే పడింది నివేదికలో ప్రస్తావించారు. దాంతో తప్పనిసరిగా ఆర్టీసీ చార్జీల ధరలను పెంచారు. దాని వల్ల సాధారణ ప్రజలకు ఇబ్బందిగా మారిందని ఆ నివేదికలో ప్రస్తావించారు. ఉచిత బస్సుల కారణంగా ఏర్పడిన సమస్యలను పరిష్కరించలేదని తెలంగాణాలో ఆర్టీసీ కార్మికులు ప్రభుత్వానికి నోటీసులు ఇచ్చారు అని అంటున్నారు. అంతే కాదు ఆ రెండు రాష్ట్రాలలో ఆటో కార్మికుల నుంచి కూడా ప్రభుత్వాలకు నిరసనలు వినిపిసున్నాయని అంటున్నారు.

దీంతో ఏపీలో ఉచిత బస్సు సేవలను అందించాలీ అంటే ఎక్కువ బస్సులను కొనుగోలు చేయడం అలాగే అదనపు సిబ్బందిని నియమించడం ద్వారానే పొరుగు రాష్ట్రాల్లో ఈ పధకం అమలు ద్వారా ఏర్పడిన లోపాలను అధిగమించగలమని మంత్రుల కమిటీ ప్రభుత్వానికి నివేదికలో సూచించింది.

ఇలా అనేక సమస్యలు ఈ ఉచిత బస్సు పధకం అమలులో ఉన్నాయని అంటున్నారు. వీటిని అధిగమించాలి అంటే ప్రభుత్వం నెలకు ఉచిత బస్సు పధకానికి ఏకంగా నాలుగు నుంచి అయిదు వందల కోట్లు ఖర్చు చేయాల్సి ఉంటుందని లెక్క తేలింది. అంటే ఏడాదికి అక్షరాలా ఆరు వందల కోట్లు అని అంటున్నారు. మరి ఇపుడున్న ఆర్ధిక పరిస్థితులలో ఇంత పెద్ద మొత్తం కూటమి ప్రభుత్వం ఖర్చు చేయగలదా అన్నదే చర్చగా ఉంది. ఉగాదికి ఉచిత బస్సు అమలు అవుతుందా అంటే వేచి చూడాల్సి ఉంది.

Tags:    

Similar News