డీఎస్సీ ల‌క్ష్యం.. అడ్డు ప‌డుతోందెవ‌రు ..!

అందుకే.. డీఎస్సీపై రోజుకో మెలిక‌.. రోజుకో మ‌లుపు తెర‌మీదికి వ‌స్తున్నాయి. ఎస్సీ సామాజిక వ‌ర్గాల్లోని ఉప కులాల‌కు కూడా.. రిజ‌ర్వేష‌న్ అందించేలా వ‌ర్గీక‌ర‌ణ చేయాల‌ని సుప్రీంకోర్టు ఆదేశించిన నేప‌థ్యం లో దీనిపై ఏక‌స‌భ్య క‌మిష‌న్‌ను ఏర్పాటు చేశారు.

Update: 2024-12-30 04:01 GMT

ఏపీలో కూట‌మి పార్టీల‌కు, ప్ర‌భుత్వానికి కూడా నేతృత్వం వ‌హిస్తున్న టీడీపీ ఎన్నిక‌ల‌కు ముందు ఇచ్చిన ప్ర‌ధాన హామీ .. మెగా డీఎస్సీ. 21 వేల ఉద్యోగాల‌ను భ‌ర్తీ చేస్తామ‌ని హామీ ఇచ్చిన టీడీపీ.. అధికారంలోకి వ‌చ్చీ రాగానే.. డీఎస్సీ ప్ర‌క‌ట‌న చేసింది. మ‌రీ ముఖ్యంగా సీఎం చంద్ర‌బాబు తొలి సంత‌కం కూడా.. డీఎస్సీపైనే చేశారు. మొత్తంగా అన్ని లెక్క‌లు వేసుకుని 16 వేల పైచిలుకు పోస్టును భ‌ర్తీ చేయ‌నున్న‌ట్టు ప్ర‌క‌టించారు. దీంతో ఆశావ‌హులు, నిరుద్యోగులు సంబ‌ర ప‌డ్డారు.

అయితే.. ఇది జ‌రిగి ఆరు మాసాలు అయిన త‌ర్వాత కూడా.. ఇప్ప‌టి వ‌ర‌కు నోటిఫికేష‌న్ రాలేదు. అంతేకా దు.. ముందుగానే నిర్ణ‌యించుకున్న‌ట్టు .. వ‌చ్చే ఏడాది ప్రారంభంలోనే ఉపాధ్యాయ నియామ‌కాలు పూర్తి చేస్తామ‌న్న హామీ కూడా.. నెర‌వేరే ప‌రిస్థితి లేకుండా పోయింది. చంద్ర‌బాబుకు కానీ, మంత్రి నారా లోకేష్ కు కానీ.. ఈ ఉద్యోగాలు ఇవ్వ‌కూడ‌ద‌ని కానీ, నిరుద్యోగుల‌ను ఇబ్బంది పెట్టాల‌ని కానీ.. ఎక్క‌డాలేదు. కానీ, కార్యాకార‌ణ సంబంధాలు వారిని వెంటాడుతున్నాయి.

అందుకే.. డీఎస్సీపై రోజుకో మెలిక‌.. రోజుకో మ‌లుపు తెర‌మీదికి వ‌స్తున్నాయి. ఎస్సీ సామాజిక వ‌ర్గాల్లోని ఉప కులాల‌కు కూడా.. రిజ‌ర్వేష‌న్ అందించేలా వ‌ర్గీక‌ర‌ణ చేయాల‌ని సుప్రీంకోర్టు ఆదేశించిన నేప‌థ్యం లో దీనిపై ఏక‌స‌భ్య క‌మిష‌న్‌ను ఏర్పాటు చేశారు. ఈ క‌మిటీ రిపోర్టుకు.. డీఎస్సీకి.. లింకు పెట్టారు. నిజానికి ఈ క‌మిటీ రిపోర్టు జ‌న‌వ‌రి 9నే రావాలి. అయితే.. ఆ స‌మ‌యంలోగా రిపోర్టు వ‌చ్చే అవ‌కాశం లేదు. దీనికి మ‌రింత గ‌డువు కోరే అవ‌కాశం ఉంది.

అయితే.. అస‌లు స‌మ‌స్య‌.. ఏపీలో లేద‌న్న‌ది మేధావులు చెబుతున్న మాట‌. కేంద్రమే డీఎస్సీకి అడ్డు ప‌డుతోంది! ఆశ్చ‌ర్యంగా ఉన్న‌ప్ప‌టికీ నిజం. నిజానికి కేంద్ర‌మే అడ్డు ప‌డ‌క‌పోతే.. జ‌గ‌న్ హ‌యాంలోనే డీఎస్సీకి నోటిఫికేష‌న్ ఇచ్చి.. భ‌ర్తీ కూడా చేసేవారు. జాతీయ నూత‌న విద్యావిధానం మేర‌కు.. కేంద్రం డీఎస్సీపై ఆంక్ష‌లు విధించింది. ఇది అన్ని రాష్ట్రాలూ పాటిస్తున్నాయి. అందుకే తెలంగాణ‌లో కూడా.. డీఎస్సీ వివాదం ఉంది.

ప‌ది మంది పిల్ల‌లు ఉన్న పాఠ‌శాల‌లు, ఏకోపాధ్యాయ పాఠ‌శాల‌లు(సింగిల్ టీచ‌ర్ స్కూల్‌) వంటివాటిని కేంద్రం ర‌ద్దు చేసింది. దీంతో ఉపాధ్యాయుల సంఖ్య త‌గ్గిపోయింది. ఫ‌లితంగానే డీఎస్సీ వేయ‌డంలోనూ.. నిర్వ‌హించ‌డంలోనూ నాడు జ‌గ‌న్‌కు, నేడు కూట‌మి స‌ర్కారుకు ఇబ్బందులు వ‌స్తున్నాయి. అయితే.. అలాగ‌ని కేంద్రాన్ని ఎవ‌రూ నిందించ‌రు. ఎందుకంటూ.. అంద‌రికీ కేంద్ర‌మే బంధువు క‌దా..!

Tags:    

Similar News