వాలంటీర్ల మీద తేల్చుడేనా ?

వైసీపీ తెచ్చిన వాలంటీర్ల వ్యవస్థ టీడీపీ కూటమికి ఒక తీవ్రమైన అంశంగా మారుతోంది.

Update: 2024-09-17 03:35 GMT

వైసీపీ తెచ్చిన వాలంటీర్ల వ్యవస్థ టీడీపీ కూటమికి ఒక తీవ్రమైన అంశంగా మారుతోంది. ఈ వ్యవస్థ ఉంచాలా లేక తీసేయాలా అన్నది కూడా కూటమి ప్రభుత్వం తేల్చుకోలేకపోతోంది. దానికి కారణం ఎన్నికల ముందు వాలంటీర్లకు పదివేల గౌరవ వేతనం చెల్లిస్తామని వారికి ఇంకా మంచి అవకాశాలు ఇస్తామని చంద్రబాబు సహా ఇతర కూటమి పెద్దలు ప్రామిస్ చేసి ఉన్నారు.

దాంతోనే ఇపుడు గట్టిగా చెప్పలేని పరిస్థితి. అలాగని కొనసాగించాలీ అంటే లక్షలలో ఉన్నారు. గతంలో వైసీపీ అయిదు వేల వేతనం ఇచ్చినపుడే ఆర్ధికంగా భారంగా ఉండేది. ఇపుడు ఖజానా పరిస్థితి బాగులేదు. పైగా వాలంటీర్లు ఏమి చేయాలో విధి విధానాలు కూడా సరిగ్గా లేవు. వారు చేసే అతి పెద్ద విషయం అయిన సామాజిక పెన్షన్ల పంపిణీ కూడా గడచిన మూడు నెలలుగా సక్సెస్ ఫుల్ గా సచివాలయ ఉద్యోగులు చేస్తున్నారు.

పైగా వాలంటీర్లు అన్నది అటు ప్రభుత్వ వ్యవస్థ కాదు, ఇటు ప్రైవేట్ వ్యవస్థ కాదు, ఇలా యంత్రాంగం అన్నది ఏ విధంగానూ వారిని నిర్వచించలేని పరిస్థితి. రెండున్నర లక్షల మంది వాలంటీర్లు ఉన్నారు. అసలు ఇంత మంది అవసరమా వారి సేవలు అంత ముఖ్యమా అన్నది కూడా ఉంది. మరో వైపు చూస్తే టీడీపీ నేత, పంచాయతీ రాజ్ ఛాంబర్ రాష్ట్ర అధ్యక్షుడు రాజేంద్రప్రసాద్‌ వాలంటీర్ల వ్యవస్థను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.

దీంతో వాలంటీర్లు భగ్గుమంటున్నారు. తమను కొనసాగించాల్సిందే అని వారు డిమాండ్ చేస్తున్నారు అంతే కాదు రాజేంద్ర ప్రసాద్ తన వ్యాఖ్యలను విరమించుకోవాలని కూడా కోరుతున్నారు. ఇక ఇక కూటమి ఈ నెల 18న నిర్వహించే మంత్రివర్గ సమావేశంలో వాలంటీర్ల వ్యవస్థ మీద కీలక నిర్ణయం తీసుకోవాలని కూడా వారు డిమాండ్ చేస్తున్నారు. ఈ మొత్తం పరిణామాల క్రమంలో అసలు ప్రభుత్వ ఉద్దేశ్యం ఏమిటో ఇంకా తేటతెల్లం కావడం లేదు.

వాలంటీర్ల వ్యవస్థ కొనసాగుతుందని కొందరు అంటున్నారు. లేదు అని కొందరు అంటున్నారు. అవసరం లేదని కూడా అంటున్నారు. ఇపుడు రాజేంద్ర ప్రసాద్ కుండ బద్ధలు కొట్టారు. ఆయన టీడీపీ నేత కూడా కావడంతో ఆయన మాట మీద కూడా రచ్చ సాగుతోంది. మరి ప్రభుత్వం ఈ విషయంలో ఎంత కాలం నానుస్తుంది అన్నది చర్చగా ఉంది. ఏదో ఒకటి తేల్చుకోవాల్సిన అవ్సరం అయితే ఉంది అని అంటున్నారు మరి మంత్రి వర్గ సమావేశంలో వాలంటీర్ల వ్యవస్థ మీద తేల్చుకుంటారా అన్నది చూడాల్సి ఉంది. ఏది ఏమైనా వాలంటీర్ల వ్యవస్థ మీద ప్రజలలో అయితే ఏ రకమైన అభిప్రాయం లేదనే అంటున్నారు. ఎందుకంటే వారు ఉన్నా లేకపోయినా ప్రజా జీవితంలో ఏ రకమైన ఇబ్బందులు అయితే లేవు అన్నది ఒక భావన గా ఉంది.

Tags:    

Similar News