పాపం.. వ‌లంటీర్లు.. ఏపీలో ఇప్పుడిదే హాట్ టాపిక్‌...!

``పాపం వాలంటీర్లు`` ఈ మాట ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా వినిపిస్తోంది.

Update: 2024-10-21 12:30 GMT

``పాపం వాలంటీర్లు`` ఈ మాట ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా వినిపిస్తోంది. ఎన్నికలకు ముందు వాలంటీర్లను విధుల్లోకి తీసుకుంటామని చెప్పిన కూటమి నాయకులు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటివరకు ఆ దిశగా అడుగులు వేయలేదు. కనీసం వారిని పట్టించుకోలేదు. దీంతో వాలంటీర్లు కొన్నిచోట్ల నిరసన వ్యక్తం చేస్తున్నారు. అయితే వాటిని ప్రొజెక్టు కానివ్వకుండా కొందరు మేనేజ్ చేస్తుండడంతో వారు చేస్తున్న ఉద్యమాలు నిరసనలు కూడా ఎక్కడా ఎవరికీ తెలియడం లేదు.

కర్నూలు, అనంతపురం, విజయవాడ, విశాఖపట్నంలో వాలంటీర్లపై కేసులు కూడా పెట్టారు. ఇదిలా ఉంటే, అసలు వలంటీర్లు చేసుకున్న పాపం ఏంటి అనేది సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రధాన చర్చ. ఎందుకంటే గడిచిన ఐదు సంవత్సరాల్లో వైసిపి అధినేత జగన్మోహన్ రెడ్డి పెట్టిన వ్యవస్థగా వాలంటీర్లు ముద్ర వేసుకున్నారే తప్ప వ్యక్తిగతంగా వారిపై ఎలాంటి దుష్పరిణామాలు కానీ దుష్ప్రభావాలు కానీ లేకపోవడం గమనార్హం. ఉన్నంతలో ప్రజలకు సేవలే అందించారు.

ఇచ్చింది 5000 రూపాయలు అయినా నిరంతరం ప్రజల మధ్య ఉంటూ ప్రజలకు అందుబాటులో ఉంటూ ఏ సమస్య వచ్చినా వాటికి స్పందించారు. ఆయా సమస్యలకు పరిష్కారం చూపించారు. ఆదిశ‌గానే వాలం టీర్లు అడుగులు వేశారు. నిజానికి చెప్పాలంటే టిడిపి నాయకులకు కూడా వాలంటీర్లు సేవలందించారు. ఈ విషయాన్ని ప్రస్తుతం మంత్రిగా ఉన్న నిమ్మ‌ల‌ రామానాయుడు కూడా గతంలో చెప్పారు. ``మా నియోజకవర్గంలో కూడా వాలంటీర్లు బాగానే పనిచేస్తున్నారని`` అనేక సందర్భాల్లో ఆయన కితాబు ఇచ్చారు.

బర్త్‌ సర్టిఫికెట్ల నుంచి డెత్ సర్టిఫికెట్ల వరకు ప్రభుత్వ పథకాల నుంచి వ్య‌క్తిగత సమస్యల వరకు కూడా వాలంటీర్లు ప్రజలకు అందుబాటులో ఉండి నాయకుల కన్నా ఎక్కువగా సేవలు చేశారు. వీరి సేవలను ఎవరూ తక్కువ చేయడానికి సాహసించే పరిస్థితి కూడా లేకపోయింది. అందుకే ముందు వాలంటీర్లపై విమర్శలు చేసిన పార్టీలు కూడా తర్వాత కాలంలో సరిదిద్దుకొని మేము వస్తే వాలంటీర్లను కొనసాగిస్తామని కూడా చెప్పుకొచ్చారు. అయితే అక్కడక్కడ ఒకరిద్దరూ వ‌లంటీర్లు చేసిన పొరపాట్లు కావచ్చు, తప్పులు కావచ్చు దాని కారణంగా వ‌లంటీర్లపై చిన్న విమర్శలు అయితే ఉన్నాయి.

కానీ భయంకరమైనటువంటి విమర్శలు గాని భయంకరమైనటువంటి తప్పులు గాని లేకపోవడం గమనార్హం. ఇక్కడ విశేషమేమిటంటే విజయవాడలో వరదలు సంభవించినా, ఏలూరులో వరదలు వచ్చినా, కాకినాడలో వరదలు సంభవించినా.. ఎన్యుమరేషన్ సమయంలో ప్రస్తుత కూటమి ప్రభుత్వం వాలంటీర్ల సేవలను వినియోగించుకుంది. మరి అలాంటప్పుడు వాలంటీర్లను ఎందుకు విధుల్లోకి తీసుకోకూడదు అనేది ప్రధాన ప్రశ్న. పోనీ ఎన్నికలకు ముందు పదివేల రూపాయలు ఇస్తారు అన్న వాగ్దానం ఉంది కాబట్టి అంత సొమ్ము ఇవ్వలేకపోతున్నారా? అని అనుకుందాం.

అదే నిజ‌మైతే.. గతంలో వైసిపి ఇచ్చినట్టుగానే ఐదువేల రూపాయలు ఇచ్చి వారందరినీ కొనసాగిస్తే ప్రభుత్వానికి మంచి సహాయకారులుగా వారు ఉంటారు. ఎమ్మెల్యేల ప్రభావం ఎక్కువగా ఉండడం, మద్యం ఇసుక వంటి కీలక విషయాల్లో దూకుడుగా ఉన్న సమయంలో వాలంటీర్ వ్యవస్థను తీసుకువస్తే ఈ రెండు విషయాల్లోనూ కూడా ప్రభుత్వానికి చేదోడువాదోడుగా వారు ఉంటారని తెలుస్తోంది. ఈ రెండు కీలక అంశాల్లోనూ ప్రభుత్వానికి మచ్చ రాకుండా ఉంటుందని కూడా కొందరు మేధావులు సూచిస్తున్నారు. ఏదేమైనా చంద్రబాబు ఈ విషయంలో సత్వరమే నిర్ణయం తీసుకుంటే బాగుంటుందని చెబుతున్నారు.

Tags:    

Similar News