వార్ వన్ సైడే.. ఏపీలో రెండు పట్టభద్రుల ఎన్నిక లాంఛనమేనా?

అసెంబ్లీ ఎన్నికల జోరుతో ఈ ఎన్నికల్లోనూ విక్టరీ సాధిస్తామని.. వార్ వన్ సైడేనని అధికార కూటమి ధీమా వ్యక్తం చేస్తోంది.

Update: 2025-01-30 16:30 GMT

ఏపీలో మండలి ఎన్నికల రాజకీయం ఆసక్తికరంగా మారింది. గతంలో ఎన్నడూ లేనట్లు పట్టభద్ర ఎమ్మెల్సీ ఎన్నికలను అధికార పార్టీ ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. నాలుగు నెలల క్రితమే అభ్యర్థులను ప్రకటించింది. అభ్యర్థుల గెలుపు బాధ్యతను ఎమ్మెల్యేలు, ఎంపీలకు అప్పగించింది. అంతేకాకుండా ఓటర్ల చేరికనూ పర్యవేక్షించడంతోపాటు ఏ మాత్రం ఏమరపాటు వద్దని నేతలను నిరంతరం అప్రమత్తం చేస్తూనే ఉంది. సాక్ష్యాత్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా ఈ ఎన్నికలపై ఫోకస్ చేశారంటే కూటమి ఈ ఎన్నికను ఎంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుందో అర్థమవుతోంది. ఈ పరిస్థితుల్లో కూటమి అభ్యర్థులను తట్టుకోవడం మిగిలిన వారికి సాధ్యమేనా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల జోరుతో ఈ ఎన్నికల్లోనూ విక్టరీ సాధిస్తామని.. వార్ వన్ సైడేనని అధికార కూటమి ధీమా వ్యక్తం చేస్తోంది.

రాష్ట్రంలో రెండు పట్టభద్ర ఎమ్మెల్సీలకు ఫిబ్రవరి 27న ఎన్నికల జరగనుంది. ఇందుకోసం ఫిబ్రవరి 3న నోటిఫికేషన్ విడుదల చేస్తారు. మిగిలిన ఎన్నికలకు పట్టభద్ర ఎమ్మెల్సీలకు చాలా తేడా ఉంటుంది. ఈ ఎన్నికల్లో అభ్యర్థలను ప్రాధాన్యక్రమంలో ఎన్నుకోవాల్సివుంటుంది. ప్రాధాన్యత ఓట్లలో ఎవరికి ఎక్కువ వస్తే వారే విజేతలుగా గెలుస్తారు. 2004లో శాసనమండలి ఏర్పడిన తొలి నాళ్లలో మండలి ఎన్నికలను ప్రధాన రాజకీయ పక్షాలు పెద్దగా పట్టించుకునేవి కావు. కేవలం వామపక్షాలు, ఇండిపెండింట్లే ఎక్కువగా పోటీ చేసి గెలిచేవారు. ప్రధాన పార్టీలు కేవలం గవర్నర్ కోటాతోపాటు స్థానిక సంస్థలు, ఎమ్మెల్యేల కోటా సీట్లపైనే దృష్టి పెట్టేవి. అయితే గత ప్రభుత్వంలో ఈ సీన్ మారింది. అధికార, ప్రతిపక్ష పార్టీలు పట్టభద్ర ఎమ్మెల్సీ ఎన్నికలను సాధారణ ఎన్నికల రేంజ్ లో చూడటం మొదలుపెట్టాయి. దీంతో ఈ ఎన్నికకు ప్రాధాన్యం పెరిగిపోయింది.

2023లో రాష్ట్రంలో జరిగిన మూడు పట్టభద్ర ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ గెలిచింది. అదే అప్పటి వైసీపీ ప్రభుత్వానికి డేంజర్ బెల్ మోగించింది. క్యాడరులో జోష్ నింపిన ఈ ఎన్నిక అసెంబ్లీ పోరులో జైత్రయాత్రగా మారింది. ఈ పరిస్థితుల్లో అధికారంలోకి వచ్చిన వెంటనే గుంటూరు-క్రిష్ణా, గోదావరి జిల్లాల్లోని రెండు పట్టభద్ర ఎమ్మెల్సీలపైనా సీఎం చంద్రబాబు ఫోకస్ చేశారు. వాస్తానికి ఈ రెండు స్థానాల్లో ప్రస్తుతం పీడీఎఫ్ నేతలే ఎమ్మెల్సీలుగా వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో ఈ రెండు నియోజకవర్గాల పరిధిలో భారీగా ఓటర్ల నమోదు చేశారు. గతంలో రెండు చోట్ల లక్ష 50 నుంచి రెండు లక్షల ఓటర్లు మాత్రమే ఉండగా, ఇప్పుడు మూడు నుంచి మూడున్నర లక్షల మంది ఓటర్లు నమోదయ్యారు. గతంలో ఉపాధ్యాయులు, ఉద్యోగులు మాత్రమే పట్టభద్ర ఎమ్మెల్సీ ఓటర్లుగా నమోదయ్యేవారు కానీ, ఇప్పుడు డిగ్రీ చేసిన వారంతా ఓటర్లుగా తమపేరు నమోదు చేసుకోవడంతోపాటు టీడీపీ సానుభూతిపరులు పెద్ద సంఖ్యలో ఓటర్లుగా చేరారు. దీంతో వచ్చే ఎన్నిక ఏకపక్షంగా మారే అవకాశాలు ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

గత ప్రభుత్వంలో వైసీపీ కూడా తమ అభ్యర్థులను నిలిపినా, అప్పట్లో ప్రభుత్వ వ్యతిరేకత వల్ల టీడీపీ హవా కొనసాగింది. ఇప్పుడు వైసీపీ పోటీ చేసే పరిస్థితి లేకపోవడం, ప్రభుత్వం అధికారంలోకి వచ్చి కేవలం ఏడు నెలలు మాత్రమే అవ్వడంతో టీడీపీ కూటమికి ఎదురే ఉండదని అంటున్నారు. ప్రస్తుతానికి టీడీపీ కూటమి అభ్యర్థులుగా గోదావరి జిల్లాల పట్టభద్రుల స్థానానికి పేరాబత్తుల రాజశేఖర్, క్రిష్ణా-గుంటూరు జిల్లాల అభ్యర్థిగా మాజీ మంత్రి ఆలపాటి రాజా పోటీ చేస్తున్నారు. వీరితో పలువురు ఇండిపెండెంట్లు, వామపక్షాల నేతలు పోటీకి సై అంటున్నారు. అయితే అధికార పక్షాన్ని ఢీకొట్టే స్థితిలో లేకపోవడంతో వార్ వన్ సైడ్ అవుతుందా? లేక అధికార పక్ష ఓటర్లు అంతా ఎవరైనా అభ్యర్థికి మద్దతుగా నిలుస్తారా? అన్నది చూడాల్సివుంది. ఏదిఏమైనా రెండు నియోజకవర్గాల్లో ప్రస్తుతం రాజకీయం ఆసక్తికరంగా మారింది.

Tags:    

Similar News