కిరాక్ క్రేజ్: ఏపీలో మద్యం షాపుల అప్లికేషన్ల మీదనే అంత ఆదాయం!

మద్యం దుకాణాల అలాట్ మెంట్ వ్యవహారమేమో కానీ ఏపీ ప్రభుత్వానికి కాసుల వర్షం కురిసింది.

Update: 2024-10-11 16:06 GMT

మద్యం దుకాణాల అలాట్ మెంట్ వ్యవహారమేమో కానీ ఏపీ ప్రభుత్వానికి కాసుల వర్షం కురిసింది. షాపుల అలాట్ మెంట్ తో వచ్చే ఆదాయం తర్వాత.. వాటి దరఖాస్తుల మీదనే కిరాక్ ఆదాయం వచ్చి పడింది. గత ప్రభుత్వంలో మద్యం దుకాణాల్ని ప్రభుత్వమే నిర్వహించిన సంగతి తెలిసిందే. అందుకు భిన్నంగా చంద్రబాబు సర్కారు మాత్రం.. గతంలో మాదిరి మద్యందుకాణాలకు లాటరీ పద్దతిలో అలాట్ చేసే విధానాన్ని ఖరారు చేయటం తెలిసిందే.

మద్యం దుకాణాలకు సంబంధించిన అప్లికేషన్లకు ఆఖరి గడువుగా శుక్రవారం సాయంత్రం 7 గంటలుగా నిర్ణయించారు. ఇందుకోసం భారీ స్పందన లభించింది. ఏపీలో మద్యం దుకాణాలకు రాష్ట్రం నుంచే కాదు తెలంగాణ రాష్ట్రం నుంచి కూడా పలువురు అప్లికేషన్లు పెట్టుకోవటం మామూలే అయినా.. అమెరికాలోని ఎన్ఆర్ఐలు సైతం పెద్ద ఎత్తున ఆసక్తిని ప్రదర్శించటం హాట్ టాపిక్ గా మారింది.

మరోవైపు.. మద్యం దుకాణాలకు అప్లికేషన్లు పెట్టే విషయంలో కూటమి సర్కారుకు చెందిన ఎమ్మెల్యేలు.. ఎంపీలు పలువురు ఎంట్రీ ఇచ్చి.. దరఖాస్తులు పెద్దగా నమోదు కాకుండా అడ్డుకుంటున్నారన్న వార్తలు వచ్చాయి. దీంతో.. అలెర్టు అయిన ముఖ్యమంత్రి చంద్రబాబు.. పార్టీ నేతలకు అంతర్గతంగా హెచ్చరికలు జారీ చేసినట్లుగా తెలుస్తోంది. దరఖాస్తుల సమయంలో నేతల జోక్యంపై ఆయన అగ్రహం వ్యక్తం చేయటంతో కొందరు నేతలు వెనక్కి తగ్గినట్లుగా తెలుస్తోంది.

ఏపీ వ్యాప్తంగా మద్యం దుకాణాల కోసం గడువు ముగిసే సమయానికి దాదాపు 90వేల వరకు దరఖాస్తులు వచ్చినట్లుగా చెబుతున్నారు. ఈ అప్లికేషన్ల మీద వచ్చిన సొమ్మే దగ్గర దగ్గర రూ.1800 కోట్లుగా తెలుస్తోంది. దరఖాస్తు గడువు ముగిసినప్పటికీ శుక్రవారం రాత్రి 12 గంటల్లోపు అప్లికేషన్ల ఫీజు చెల్లించేందుకు అబార్కీ శాఖ అవకాశం ఇచ్చింది. దీంతో.. మరింత ఆదాయం సమకూరే వీలుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 3396 మద్యం దుకానాలకు అప్లికేషన్లను స్వీకరించిన అధికారులు ఈ నెల 14న లాటరీ ద్వారా షాపుల కేటాయింపు జరపనున్నారు. అక్టోబరు 15న షాపుల్ని లాటరీలో దక్కించుకన్న వారికిఅబార్కీ శాఖ షాపుల్ని అప్పగించనుంది. ఈ నెల 16 నుంచి కొత్త లిక్కర్ పాలసీ అమల్లోకి రానుంది. మొత్తంగా చూస్తే.. మద్యం దుకాణాల పుణ్యమా అని ప్రభుత్వానికి భారీ ఎత్తున ఆదాయం సమకూరేలా ఉందన్న మాట వినిపిస్తోంది. దరఖాస్తులు పెట్టే విషయంలో వ్యక్తమైన క్రేజ్ హాట్ టాపిక్ గా మారింది.

Tags:    

Similar News