పవన్ చెప్పిందేంటి? పోలీసులు చేసిందేంటి? ఇదో మరక!
తాజాగా ఒకే రోజు రెండు ఘటనలలో పోలీసులు వ్యవహరించిన తీరుపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది. సివిల్ కేసుల్లో తల దూర్చి.. న్యాయవాదిని స్టేషన్‌కు పిలిచి బెదిరించడంతో సదరు న్యాయవాది కుప్పకూలి మరణించారు.
పోలీసులు చట్టాన్ని అమలు చేసేందుకు మాత్రమే ఉన్నారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకునేందుకు కాదు- అని పదే పదే న్యాయస్థానాల నుంచి నాయకుల వరకు చెబుతున్నారు. కానీ, తాజాగా ఒకే రోజు రెండు ఘటనలలో పోలీసులు వ్యవహరించిన తీరుపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది. సివిల్ కేసుల్లో తల దూర్చి.. న్యాయవాదిని స్టేషన్‌కు పిలిచి బెదిరించడంతో సదరు న్యాయవాది కుప్పకూలి మరణించారు. అదేవిధంగా కడప జిల్లా గాలివీడు ఎంపీడీవోపై దాడి చేయించారన్న ఆరోపణలతో వైసీపీ నేతను కాలర్ పట్టుకుని నడిరోడ్డుపై ఈడ్చుకెళ్లారు.
ఈ రెండు ఘటనలపై ఆదివారం అయినప్పటికీ.. కోర్టులో అత్యవసర పిటిషన్లు దాఖలు చేసేందుకు సామాజిక ఉద్యమ కారులు రెడీ అయ్యారు. ఇది ఎటు దారి తీస్తుందనేది పక్కన పెడితే.. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. కడప జిల్లాలో పర్యటించి.. పరోక్షంగా చేసిన వ్యాఖ్యల ప్రభావం అయితే కనిపిస్తోందని పరిశీలకులు చెబుతున్నారు. వాస్తవానికి పవన్ కల్యాణ్ అయినా.. సీఎం చంద్రబాబు అయినా.. రోడ్డెక్కి వీరంగం వేయమని పోలీసులకు చెప్పలేదు.
చట్ట ప్రకారం.. న్యాయ ప్రకారం మేరకు పోలీసులు నడుచుకుని.. అక్రమాలు, అరాచకాలను కట్టడి చేయాలని పేర్కొంటున్నారు. కానీ.. పోలీసులు సర్వంసహా చక్రవర్తుల మాదిరిగా.. రోడ్డెక్కి గల్లా పట్టుకుని ఉగ్రవాదిని తీసుకువెళ్లినట్టు ఒక నిందితుడిని తీసుకువెళ్లడం ద్వారా వారితోపాటు ప్రభుత్వాన్ని కూడా ఇబ్బందుల్లో పడేసేలా చేస్తున్నారు. ఓ సివిల్ వివాదంలో మహిళ చేసిన ఫిర్యాదు మేరకు ఓ న్యాయవాది ని స్టేషన్‌కు పిలిచిన సీఐ.. తీవ్రస్థాయిలో బెదిరించాడు. దీంతో న్యాయవాది గుండె పోటుతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనపై అనంతపురం న్యాయవాదులు ధర్నాలు, నిరసనలు చేస్తున్నారు.
ఇక, ఎంపీడీవోపై దాడి చేయించారని ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపీ నాయకుడు సుదర్శన్ రెడ్డిని అరెస్టు చేయడం తప్పులేదు. పవన్ కల్యాణ్ చెప్పింది కూడా ఇదే. కానీ, సీఐ కొండారెడ్డి అత్యుత్సాహం ప్రదర్శించి.. పిక్ పాకెటర్‌ను గల్లా పట్టుకుని ఈడ్చుకు వెళ్లినట్టు నడిరోడ్డుపై ఈడ్చుకు వెళ్లారు. పైగా ఆయన న్యాయవాది కావడంతో ఇక్కడ కూడా.. న్యాయవాదులు రోడ్డెక్కారు. దోషం చేశారని తేలకుండా.. ఎలా ఈడ్చుకు వెళ్తారంటూ.. అత్యవసర పిటిషన్‌ను దాఖలు చేసేందుకు రెడీ అయ్యారు. ఈ పరిణామాలు రెండు కూడా.. ప్రభుత్వంపై మరకలు పడేలా చేస్తున్నాయి. ఏదేమైనా.. అత్యుత్సాహం సరికాదు. చట్ట ప్రకారం అనుసరిస్తే.. ఎవరికీ ఇబ్బంది ఉండదని న్యాయవాదులు చెబుతున్నారు.