నాడూ నేడూ మేమే....జగన్ కి పోలీస్ కౌంటర్ !
ఏపీలో శాంతి భద్రతలు లేవని జగన్ హాట్ కామెంట్స్ చేశారు. ఈ రోజు అధికార పార్టీకి కొమ్ము కాసిన వారిని వదిలిపెట్టబోమని ఆయన అన్నారు.
తాము ఎపుడూ రాజకీయానికి సెల్యూట్ కొట్టలేదని చట్టం, ధర్మం, న్యాయం, సత్యం అనే నాలుగు సింహాలకే సెల్యూట్ చేస్తామని ఏపీ పోలీసు అధికారుల సంఘం ఘాటైన కౌంటర్ ఇచ్చింది. తాము ఎవరి కోసమో పనిచేయమని లా అండ్ ఆర్డర్ కోసం చట్టబద్ధంగానే పనిచేస్తామని సంఘం అధ్యక్షుడు జే శ్రీనివాసరావు సీరియస్ గానే రియాక్ట్ అయ్యారు.
ఇంతకీ పోలీసులకు ఇంత కోపం రావడానికి కారణం జగన్ చేసిన కామెంట్స్. ఆయన తమ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని విజయవాడ జిల్లా జైలులో ములాఖత్ సందర్భంగా కలిసారు. అనంతరం మీడియా ముందు ఆగ్రవేశాలు జగన్ ప్రదర్శించారు.
ఏపీలో శాంతి భద్రతలు లేవని జగన్ హాట్ కామెంట్స్ చేశారు. ఈ రోజు అధికార పార్టీకి కొమ్ము కాసిన వారిని వదిలిపెట్టబోమని ఆయన అన్నారు. వారు రిటైర్ అయినా లేక సప్త సముద్రాల అవతల ఉన్నా వారిని తెచ్చి మరీ బట్టలు ఊడగొడతామని జగన్ చేసిన ఈ కామెంట్స్ పోలీసులకు తీవ్ర ఆగ్రహాన్ని కలిగించాయి.
పోలీసుల సంఘం దీనిని చాలా తీవ్రంగా తీసుకుంది. దాంతో శ్రీనివాసరావు మీడియా ముందుకు వచ్చి జగన్ మీద ఫైర్ అయ్యారు. సీఎం గా పనిచేసిన జగన్ ఈ విధంగా మాట్లాడటం తగునా అని ప్రశ్నించారు. ఆయనే ఈ విధంగా మాట్లాడితే ఇక ఆయన తరువాత స్థాయి వారు వైసీపీలో ఏ విధంగా మాట్లాడుతారో ఊహించగలమా అన్నారు.
పోలీసులు ఇపుడు మారిపోయారని వైసీపీ అధినేతకు అనిపించడం చిత్రమని అన్నారు సరిగ్గా ఎనిమిది నెలల క్రితం వీరంతా జగన్ ప్రభుత్వంలో పనిచేసిన వారే అని ఆయన చెప్పారు. మరి ఆనాడూ ఈనాడూ నాలుగు సింహాలకే సలాం చేస్తూ వచ్చారు తప్ప ఎవరికీ కాదని ఆయన స్పష్టం చేశారు.
జగన్ మాట్లాడుతున్నది కేవలం రాజకీయ ప్రయోజనాలకు దృష్టిలో ఉంచుకుని మాత్రమే అని అన్నారు. ఏపీలో శాంతి భద్రతలు దిగజారాయని జగన్ వ్యాఖ్యానించడం తగదని అన్నారు. బట్టలూడదీసి నిలబెడతామని జగన్ వ్యాఖ్యానించడం సమంజసమా అని ప్రశ్నించారు. జగన్ చేసిన ఈ వ్యాఖ్యలు పోలీసుల మనోభావాలను దెబ్బ తీయడమే కాకుండా వారిని పూర్తిగా బెదిరిస్తున్నట్లుగా ఉందని కూడా అన్నారు.
ఈ తరహా బెదిరింపులు జగన్ మానుకోవాలని ఆయన కోరారు. జగన్ తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటే గౌరవంగా ఉంటుందని అన్నారు. పోలీసులకు రాజకీయాలతో సంబంధం లేదని అన్నింటికీ అతీతంగా వారు విధులను నిర్వహిస్తారని చెప్పారు.
జగన్ బెదిరింపులు చూస్తుంటే ఆయనకు చట్టం పట్ల ప్రజాస్వామ్యం పట్ల ఏ మాత్రం గౌరవం లేదని అర్ధమవుతోందని శ్రీనివాసరావు విమర్శించారు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా అయిదేళ్ళ పాటు చేసిన వారు ఈ విధంగా మాట్లాడటం దురదృష్టకరమని ఆయన అన్నారు.
జగన్ ఈ తరహా వ్యాఖ్యలతో ఏ రకమైన సందేశం ప్రజస్వామాన్ని నమ్మిన వారికి ఇస్తున్నారని నిలదీశారు. జగన్ తాను చేసిన ఈ బెదిరింపు వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాల్సిందే అన్నది తమ డిమాండ్ అని ఆయన స్పష్టం చేశారు.
ఇదిలా ఉంటే గతంలో జగన్ సీఎం గా ఉన్నపుడు పోలీసుల మీద టీడీపీ అధినేత చంద్రబాబు విమర్శలు చేసేవారు. ఆ సమయంలోనూ పోలీసుల సంఘం నుంచి ఇదే రకమైన కౌంటర్లు వచ్చేవి. ఇపుడు వారు వీరు అయ్యారు. పోలీసులు మాత్రం ఎపుడూ తామే కార్నర్ అవుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సీఎంలుగా చేసిన వారు సైతం అధికారంలో ఎలా ఉంటుందో పాలన గురించి పూర్తిగా తెలిసి మరీ ఈ విమర్శలు చేయడమేంటి అని పోలీసు అధికారులు అంటున్నారు.