సజ్జల చేసిన పనిని సరిదిద్దే బాధ్యత సాయిరెడ్డిపై పడిందా..?
వచ్చే ఎన్నికల్లో తాను ఎట్టి పరిస్థితిలోనూ చీరాల నుంచే పోటీ చేయాలని నిర్ణయించుకున్నట్టు సంకేతాలు ఇస్తున్నారు
ఒకరు చేసిన తప్పును మరొకరు సరిచేయడం అంటే ఇదే! 2019 ఎన్నికల తర్వాత.. చీరాల నుంచి గెలిచిన టీడీపీ సీనియర్ కరణం బలరాంను వైసీపీలోకి ఆహ్వానించారు. దీనికి కర్తకర్మ క్రియ అంతా కూడా.. సలహా దారు సజ్జల రామకృష్ణారెడ్డి. ఆయన సూచన, సలహాతోనే సీఎం జగన్ కరణంను పార్టీలోకి తీసుకున్నారు. అయితే. అధికారికంగా మాత్రం కరణం ఇంకా టీడీపీ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు.
ఇదిలావుంటే, చీరాల నుంచి గత ఎన్నికల్లో వైసీపీ తరఫున పోటీ చేసి ఓడిపోయిన ఆమంచి కృష్ణ మోహన్ కు ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే కరణం కుటుంబానికి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో ఈ సమస్య పరిష్కారం జఠిలంగా మారింది. మరోవైపు.. చీరాల నియోజకవర్గం ఎమ్మెల్యే టికెట్‌ను కరణం కుటుంబానికి కేటాయించే చాన్స్ ఉందని పార్టీ చెప్పకనే చెప్పింది.
ఇదేసమయంలో పరుచూరు టికెట్‌ను ఆమంచికి కేటాయించింది. అక్కడ పనిచేసుకోవాలని.. కొన్నాళ్లుగా సూచిస్తునే ఉన్నారు. కానీ, ఆయన మాత్రం ఇంటి నుంచి బయటకు రావడం లేదు. వచ్చే ఎన్నికల్లో తాను ఎట్టి పరిస్థితిలోనూ చీరాల నుంచే పోటీ చేయాలని నిర్ణయించుకున్నట్టు సంకేతాలు ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో చీరాలలో కరణం కుటుంబంతో తరచుగా వివాదం ఏర్పాడి రోడ్డున పడుతున్నారు.
అయితే.. ఇప్పుడు ఈ వివాదాన్ని పరిష్కరించే బాధ్యత పార్టీ ప్రధాన కార్యదర్శి, ఎంపీ విజయసాయిరెడ్డిపై పడింది. ఎందుకంటే.. ప్రస్తుతం బాలినేని శ్రీనివాసరెడ్డి స్థానంలో బాధ్యతలు నిర్వహిస్తున్నారు. దీంతో ఇక్కడ ఇంచార్జ్‌గా ఉన్న సాయిరెడ్డి.. కరణంను కూల్ చేయడం, ఆమంచిని మచ్చిక చేసుకోవడం బాధ్యతలు తీసుకోవాల్సి వచ్చింది. ఇప్పటికే ఒక సిట్టింగ్ కూడా అయిపోయినా.. ఎలాంటి రిజల్ట్ రాలేదు. ఆమంచి-కరణంలు పట్టుదలతోనే ఉన్నారు. ఈ నేపథ్యంలో సాయిరెడ్డి ఈ సమస్యను ఎలా పరిష్కరిస్తారో చూడాలి.