ఎన్నికల యుద్ధానికి రెడీ అవుతున్నారా ?
ఇవన్నీ ఒకవైపు చేస్తునే మరోవైపు విశాఖపట్నంకు ముఖ్యమంత్రి కార్యాలయాన్ని తరలించేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు
రాబోయే ఎన్నికల యుద్ధానికి జగన్మోహన్ రెడ్డి అన్ని విధాలుగా రెడీ అవుతున్నారు. ఈనెలాఖరులోగా నామినేటెడ్ పోస్టుల భర్తీ చేయాలని డిసైడ్ అయ్యారు. అలాగే వచ్చే నెల మొదటివారంలో అసెంబ్లీ సమావేశాలను నిర్వహించాలని అనుకుంటున్నారు. గడపగడపకు వైసీపీ చివరి వర్క్ షాపు నిర్వహించాలని అనుకున్నారు. మంత్రులు, ఎంఎల్ఏల సమక్షంలోనే ఫైనల్ రివ్యూ చేసి పనితీరును చదవి వినిపించాలని జగన్ అనుకుంటున్నారు. దసరా పండుగ నాటికి 175 నియోజకవర్గాల్లో గెలుపు గుర్రాలను ఎంపిక పూర్తిచేయాలన్నది జగన్ డెడ్ లైన్ .
ఇవన్నీ ఒకవైపు చేస్తునే మరోవైపు విశాఖపట్నంకు ముఖ్యమంత్రి కార్యాలయాన్ని తరలించేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. వైజాగ్ లో సీఎంవో కు అవసరమైన భవనాలను శరవేగంగా పూర్తిచేస్తున్నారు. ఎంఎల్ఏల పనితీరుపై జగన్ ప్రతినెల రెగ్యులర్ గా మూడు, నాలుగు మార్గాల్లో సర్వే రిపోర్టులు తెప్పించుకుంటున్నారు. ఐప్యాక్ బృందం చేస్తున్న సర్వేకి అదనంగా పార్టీలో నమ్మకస్తులైన నేతలు, ఇంటెలిజెన్స్ విభాగం ద్వారా కూడా ఎప్పటికప్పుడు సర్వేలు చేయించుకుంటున్నారు.
తనకు ఏకకాలంలో అందుతున్న మూడు సర్వే రిపోర్టులను జగన్ ఎప్పటికప్పుడు బేరీజు వేసుకుంటున్నారు. రాబోయే ఎన్నికల్లో 175 నియోజకవర్గాల్లోను కచ్చితంగా గెలవాల్సిందే అని జగన్ పదేపదే చెబుతున్న విషయం తెలిసిందే. ఎంఎల్ఏలు, నేతలు తన ఆలోచనలకు తగ్గట్లుగా నియోజకవర్గాల్లో కష్టపడి పనిచేయాల్సిందే అని ఆదేశించారు. ఒకవైపు సొంతపార్టీ బలంపై సర్వేలు చేయించుకుంటు మరోవైపు ప్రత్యర్ధిపార్టీల బలాలు, బలహీనతలపైన కూడా రిపోర్టులు తెప్పించుకుంటున్నారు.
రాబోయే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ప్రతి నియోజకవర్గంలోని బలమైన ద్వితీయ శ్రేణి నేతలతో జగన్ డైరెక్టుగా టచ్ లోకి వెళుతున్నట్లు పార్టీవర్గాలు చెబుతున్నాయి. బలమైన ద్వితీయ శ్రేణి నేతలను గుర్తించటం, వాళ్ళతో మాట్లాడి పార్టీలో యాక్టివ్ అయ్యేట్లుగా చూసే బాధ్యతలను చంద్రగిరి ఎంఎల్ఏ చెవరెడ్డి భాస్కరరెడ్డికి అప్పగించారు. చెవిరెడ్డి కోసం ప్రత్యేకంగా సెంట్రల్ ఆఫీసులో ప్రత్యేకమైన సెటప్ కూడా ఏర్పాటుచేసినట్లు సమాచారం. ఏదేమైనా పార్టీలోని అంతర్గత కలహాలను పరిష్కారంపై దృష్టిపెడుతునే బలోపేతం చేయటానికి అవసరమైన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మరి ఈ చర్యల ఫలితం ఎలాగుంటుందో చూడాలి.