13 ఏళ్ల బాలుడు.. 1.30 కోట్లు.. ఐపీఎల్ వేలంలో కొన్నదెవరంటే?
అంగ్ క్రిష్ రఘువంశీ ఢిల్లీ కుర్రాడు అయితే.. బిహార్ కు చెందిన మరో వంశీ వైభవ్ సూర్యవంశీ. సహజంగా అయితే..టి20 ఫార్మాట్ లో మన తెలుగు రాష్ట్రాల వారిలాగానే బిహారీ క్రికెటర్ల గురించి పెద్దగా చెప్పుకోవాల్సిన పనిలేదు.
వచ్చే సీజన్ కు సంబంధించి ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) మెగా వేలం రెండు రోజుల పాటు సందడిగా సాగింది. ఈ ఏడాది మెగా వేలం కావడంతో ఆటగాళ్లపై కాసుల వర్షం కురిసింది. అందులోనూ రిషభ్ పంత్, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ వంటి స్టార్ ఆటగాళ్లు వేలంలోకి రావడంతో మరింత సందడి నెలకొంది. అయితే, మెగా వేలం కంటే ముందు అందరినీ ఆకర్షించిన పాయింట్ ఒకటుంది. అదే 13 ఏళ్ల బాలుడు ఐపీఎల్ వేలంలో నిలవడం. వేలానికి వచ్చిన అత్యంత చిన్న వయస్కుడు ఇతడు.
ఢిల్లీ బాబు..
ఐపీఎల్ మెగా వేలంలో ఇద్దరు ‘వంశీలు’ సోల్డ్ అయ్యారు. అయితే, ఒకరు అంగ్ క్రిష్ రఘువంశీ అయితే మరొకరు వైభవ్ సూర్యవంశీ. ఢిల్లీకి చెందిన అంగ్‌క్రిష్ ను రూ.3 కోట్లకు కోల్‌కతా నైట్ రైడర్స్ సొంతం చేసుకుంది. ఇతడి వయసు కూడా తక్కువే. భారత అండర్ 19 జట్టుకు ఆడాడు. ప్రస్తుతం 20 ఏళ్లున్న అంగ్ క్రిష్ టాప్ ఆర్డర్ బ్యాటర్. దూకుడుగా ఆడే బ్యాట్స్ మన్ అయిన అతడిని శ్రేయస్ అయ్యర్ కు ప్రత్యామ్నాయంగా కోల్ కతా తీసుకుందని భావించాలి. సీనియర్ స్థానాన్ని కొంతైనా అంగ్ క్రిష్ భర్తీ చేస్తాడో లేదో చూడాలి.
బిహారీ బాబు..
అంగ్ క్రిష్ రఘువంశీ ఢిల్లీ కుర్రాడు అయితే.. బిహార్ కు చెందిన మరో వంశీ వైభవ్ సూర్యవంశీ. సహజంగా అయితే..టి20 ఫార్మాట్ లో మన తెలుగు రాష్ట్రాల వారిలాగానే బిహారీ క్రికెటర్ల గురించి పెద్దగా చెప్పుకోవాల్సిన పనిలేదు. కానీ, ఈ వైభవ్ కథ వేరు. 12 ఏళ్ల వయసుకే ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఆడాడు. ఎడమచేతివాటం దూకుడైన ఆటగాడు. 13 ఏళ్ల 243 రోజుల వయసున్న ఇతడిని మెగా వేలంలో ఐపీఎల్ ఫ్రాంచైజీ రాజస్థాన్ రాయల్స్ సొంతం చేసుకుంది. కనీస ధర రూ.30 లక్షలకు వేలంలోకి వచ్చిన సూర్యవంశీని ఎవరు కొనుగోలు చేస్తారనేది ఆసక్తి రేపింది. అతడిని టీమ్ ఇండియా స్టార్ సంజూ శాంసన్ కెప్టెన్ గా ఉన్న రాజస్థాన్ తీసుకుంది.
జైశ్వాల్, యశస్వితో కలిసి..
టీమ్ ఇండియా కుర్రాళ్లు, ఓపెనర్లు యశస్వి జైశ్వాల్, సంజూ శాంసన్ లలో ఒకరితో కలిసి సూర్యవంశీ రాజస్థాన్ ఇన్నింగ్స్ ను ప్రారంభించే అవకాశం ఉంది. అయితే, అది అన్ని మ్యాచ్ లలో కాదు.. ఏదైనా ఒకటీ, రెండు మ్యాచ్ లలో ఆడించవచ్చు. అదే జరిగితే అత్యంత చిన్న వయసులో ఐపీఎల్ ఆడిన క్రికెటర్ గా వైభవ్ రికార్డులకెక్కుతాడు.
తదుపరి టీమ్ ఇండియానే?
ఇప్పుడు టీమ్ ఇండియాలోకి ఎంపికవ్వాలంటే ఐపీఎల్ ప్రదర్శనను పరిగణనలోకి తీసుకుంటున్నారు. ఒకవేళ సూర్యవంశీ గనుక ఐపీఎల్ లో రాణిస్తే భవిష్యత్ లో అతడిని టీమ్ ఇండియాకు ఎంపిక చేసినా ఆశ్చర్యం లేదు. దీంతో అత్యంత చిన్న వయసులోనే భారత జట్టుకు ఆడిన దిగ్గజ బ్యాట్స్ మన్ సచిన్ టెండూల్కర్ (16 ఏళ్లు) రికార్డును వైభవ్ బద్దలుకొట్టే చాన్సుంది.