టీడీపీ స్ట్రాంగ్ లీడర్ కే ఝలక్...జనసేన పోటీకి రెడీ...?
అలా విశాఖలోని వైసీపీ జిల్లా ప్రెసిడెంట్ గా ఉన్న పంచకర్ల రమేష్ బాబు కొద్ది నెలల క్రితం వైసీపీ నుంచి జనసేన వైపుగా మారిపోయారు
జనసేన పొత్తులలో భాగంగా ఎన్ని సీట్లు అడుగుతుంది. ఎన్ని పోటీ చేస్తుంది అన్నది ఎవరికీ తెలియడంలేదు. అయితే రాష్ట్రంలో అధికార వైసీపీలో టికెట్ దక్కని వారు జనసేన వైపు చూస్తున్నారు. వారంతా తమకు టికెట్ ఇస్తేనే పోటీ అని హామె కూడా తీసుకుంటున్నారు. వారికి జనసేన నాయకత్వం నుంచి ఆ మేరకు హామీ దక్కుతోందని అంటున్నారు.
అలా విశాఖలోని వైసీపీ జిల్లా ప్రెసిడెంట్ గా ఉన్న పంచకర్ల రమేష్ బాబు కొద్ది నెలల క్రితం వైసీపీ నుంచి జనసేన వైపుగా మారిపోయారు. ఆయనకు పెందుర్తి టికెట్ ఇస్తామని పార్టీ హామీ ఇచ్చిందని ప్రచారం సాగింది. అయితే పెందుర్తి నుంచి మాజీ మంత్రి టీడీపీ సీనియర్ నేత బండారు సత్యనారాయణమూర్తి రంగంలో కచ్చితంగా ఉంటారని అందరికీ తెలుసు.
ఆయన చంద్రబాబుకు అత్యంత సన్నిహితులు. అలాగే ఏపీ టీడీపీ ప్రెసిడెంట్ అచ్చెన్నాయుడుకు స్వయాన వియ్యంకుడు. మరి ఆయనకు కాకుండా జనసేనకు టికెట్ ఎలా ఇస్తారు అన్నది ఒక ప్రశ్నగా ఉంది. ఇపుడు మరో సీటుకు జనసేన హై కమాండ్ నుంచి హామీ తీసుకుని వైసీపీ మాజీ ప్రెసిడెంట్, మాజీ ఎమ్మెల్యే మళ్ల విజయప్రసాద్ వడివడిగా అడుగులు వేస్తున్నారు అని అంటున్నారు.
ఆయనకు 2019 ఎన్నికల్లో వైసీపీ టికెట్ ఇచ్చింది. జగన్ వేవ్ లో సైతం ఆయన ఓటమిని చూసారు. ఇక పార్టీ అధికారంలోకి వచ్చాక ఆయనకు ఆంధ్రప్రదేశ్ విద్య, సంక్షేమం, మౌలిక వసతుల అభివృద్ధి సంస్థ చైర్మన్ గా నియమించారు. ఆ పదవిలో ఉండగానే ఆయన పలు ఆర్ధిక నేరల మీద అరెస్ట్ అయి జైలుకు వెళ్లారు. ఆ మీదట వైసీపీ అధినాయకత్వం ఆయన ప్లేస్ లో విశాఖ పశ్చిమ సీటుని విశాఖ డైరీ చైర్మన్ అయిన ఆడారి ఆనంద్ కి అప్పగించింది. దాంతో పాటు ఆయన నామినేటెడ్ పదవి కూడా పోయింది.
ఈ పరిణామాలతో ఆయన వైసీపీ మీద అసంతృప్తిగా ఉన్నారని టాక్. ఆయనకు వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలవాలని ఉంది. 2009లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసి విజయం సాధించిన మళ్ళ విజయప్రసాద్ కి విశాఖ పశ్చిమలో మంచి బలం బలగం ఉన్నాయి. దాంతో ఆయన తన అనుచరులతో కలసి జనసేనలోకి వెళ్లి పోటీ చేయాలని చూస్తున్నారు అని తెలుస్తోంది. ఈ మేరకు ఆయన జనసేన అధినాయకత్వంతో కూడా చర్చించినట్లుగా తెలుస్తోంది.
ఆయన పార్టీలోకి వస్తే జనసేన తరఫున పశ్చిన టికెట్ ని ఇస్తామని హామీ ఇచ్చారని ఆయన వర్గం అంటోంది. దాంతో మంచి ముహూర్తం చూసుకుని మళ్ళ జనసేనలోకి జంప్ చేస్తారు అని అంటున్నారు. అయితే ఈ సీటు లో టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే గణబాబు ఉన్నారు. ఆయన ఇప్పటికి ముమ్మారు ఇదే సీటు నుంచి గెలిచిన స్ట్రాంగ్ లీడర్. సిట్టింగులకే వచ్చే ఎన్నికల్లో టికెట్లు అని చంద్రబాబు ప్రకటించి ఉన్నారు.
పైగా గణబాబు చంద్రబాబుకు సన్నిహితుడు. ఆయన నియోజకవర్గంలో చంద్రబాబు పర్యటించి మంచి పనితీరుని కనబరుస్తున్నారు అని ప్రశంసించి వెళ్లారు కూడా. గణబాబుని కాదని పొత్తులలో ఈ సీటు జనసేనకు టీడీపీ ఇవ్వదని అంటున్నారు. మరి జనసేన నేతలు మాత్రం సీటు గ్యారంటీ అని వైసీపీ నేతలకు చెబుతున్నారని అంటున్నారు. అదెలా సాధ్యమంటే ఒంటరిగా జనసేన పోటీ చేస్తేనే అంటున్నారు.
మరి జనసేన ఇంతకీ విశాఖ జిల్లాలో పొత్తుల పేరిట ఎన్ని సీట్లు కోరబోతోంది, టీడీపీ ఎన్ని సీట్లు ఇస్తుంది అన్నది కూడా ఇపుడు చర్చగా ఉంది. ఏది ఏమైనా వైసీపీ అసంతృప్తులకు జనసేన గేలం వేస్తోంది. టికెట్లు దక్కవని భావించిన వారు ఆ వైపు గా చూస్తున్నారు. మరి రేపటి రోజున పొత్తులు కుదరకపోతే ఒంటరిగా పోరుకు జనసేన వేసుకున్న ప్లాన్ బీగా దీన్ని చూడాలా అన్న చర్చ కూడా ఉంది. మొత్తం మీద టీడీపీ స్ట్రాంగ్ సీట్ల మీదనే జనసేన టార్గెట్ చేస్తోంది అని అంటున్నారు.