ఏపీ ప్రజలను అన్ని పార్టీలూ మోసం చేస్తున్నాయా?
ఏ పార్టీ అయినా.. ప్రజలకు సేవ చేస్తామని చెబుతాయి. ఇది అన్ని పార్టీల కామన్ ఫ్యాక్టర్.;
ఏ పార్టీ అయినా.. ప్రజలకు సేవ చేస్తామని చెబుతాయి. ఇది అన్ని పార్టీల కామన్ ఫ్యాక్టర్. కానీ, ఇక్కడే రెండు అంశాలు ఉంటాయి. ఒకటి ప్రజా సేవ, రెండు రాష్ట్ర సేవ. రాష్ట్రం అభివృద్ధి చెందితే.. ఆటోమేటిక్ గా ప్రజలకు అభివృద్ధి ఫలాలు అందుతాయి. దీనిలో ఎవరికీ రెండో అభిప్రాయం లేదు. కానీ, ఇప్పుడు జరుగుతున్న ఎన్నికల్లో ఏపీ విషయాన్ని తీసుకుంటే.. రాష్ట్రం గురించిన చర్చ ఎక్కడా జరగడం లేదు. కీలకమైన విభజన చట్టంలోనే పేర్కొన్న అంశాలను ఏ ఒక్కరూ ప్రస్తావించడం లేదు. ఒక్క కాంగ్రెస్ పార్టీ తప్ప.
వైసీపీ ఇస్తున్న దానికంటే.. రెండు మూడింతలు ఎక్కువగా ఇస్తామని చెబుతున్న టీడీపీ అయినా.. ప్రశ్ని స్తానని చెబుతున్న పవన్ పార్టీ అయినా.. ఎక్కడా రాష్ట్రం ఎదుర్కొంటున్న కీలక అంశాలను ప్రస్తావించ డం లేదు. ఇక, ఐదేళ్లు అధికారంలో ఉండి సాధించలేక పోయినా.. వైసీపీ కూడా.. ఆయా అంశాలపై పెదవి విప్పడం లేదు. కానీ, జనాలకు కావాల్సింది.. తాత్కాలిక ఉపశమనమా? అంటే.. కాదనేది అందరూ చెబుతున్న మాటే. రాష్ట్రానికి విభజన హక్కు చట్టం ప్రకారం కీలకమైన అంశాలు రావాల్సి ఉంది.
వీటిని అంతర్గత చర్చల్లోనో.. లేక.. అవకాశం వచ్చినప్పుడో,.. అన్ని పార్టీలూ చెబుతున్నవే. మరోవైపు.. విభజన చట్టం కాల పరిమితి కూడా.. పదేళ్లు తీరిపోతోంది. `పదేళ్లలో వీటిని అమలు చేయాలి` అనిరాసి ఉన్న విభజన చట్టానికి రేపు జూన్ 1 వస్తే.. పదేళ్లు పూర్తవుతాయి. కానీ, వాటిలో పేర్కొన్న పోలవరం ప్రాజెక్టు పూర్తికానీ, ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చే అంశం కానీ.. కడప ఉక్కు ఫ్యాక్టరీ నిర్మాణం కానీ, ఉత్తరాంధ్ర, రాయలసీమకు ఇచ్చే(వెనుకబడిన జిల్లాలు) ప్రత్యేక ప్యాకేజీ విషయంపైనా ఎవరూ మాట్లాడరు.
మధ్యలో తెరమీదికి వచ్చిన విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ.. రాజకీయ వస్తువుగానే చూస్తున్నారు కానీ.. కీలక పార్టీలు ఏవీ కూడా.. దీనిపై ఇతమిత్థంగా ప్రకటన చేయడం లేదు. కేంద్రంపై పోరాడి సాధించుకుం దామనే ఆలోచన దిశగా అడుగులు కూడా వేయడం లేదు. టీడీపీ, జనసేనలు వీటిపై మాట్లాడవు. ఇక, ఈ చిచ్చుకు ప్రధాన కారణమైన బీజేపీతో ఈ పార్టీలు చేతులు కలిపాయి. దీంతో ఆయా అంశాలకు సీలు వేసినట్టుగా వ్యవహరిస్తున్నాయి. దీంతో రాష్ట్ర విస్తృత ప్రయోజనాలు.. అభివృధ్ధికి దోహద పడే అంశాల విషయంపై ఆయా పార్టీలు.. ఏపీ ప్రజలను మోసం చేయడం కాక మరేమిటనేది.. విజ్ఞుల మాట.
చంద్రబాబు నుంచి జగన్ వరకు ఎవరు మాట్లాడినా.. మీకు ఇంతిస్తాం.. మీరు మాకు ఓటేయండి.. అని అడుగుతున్నారే తప్ప.. కీలకమైన ఈ విషయాలు సాధిస్తామని ఒక్కరంటే ఒక్కరు మాట మాత్రంగా కూడా ప్రస్తావించడం లేదు. మరోవైపు.. కాంగ్రెస్ పార్టీ మాత్రమే వీటిని ప్రశ్నిస్తోంది. ఎక్కడ ఏ వేదిక ఎక్కినా .. తన అన్న, సీఎం జగన్ ను తిడుతున్న వైఎస్ షర్మిల.. వాటితో పాటు.. ఏపీ అంశాలను కూడా ప్రస్తావిస్తున్నారు.
తొలి సంతకం.. హోదాపైనే ఉంటుందని, పోలవరం పూర్తి చేస్తామని.. ఉత్తరాంధ్ర, రాయల సీమలకు.. ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామని చెబుతున్నారు. కానీ, చిత్రం ఏంటంటే.. ఏపీని విడగొట్టిన నేపథ్యంలో ఆ పార్టీకి ప్రజలు దూరమయ్యారు. ఇప్పటి వరకు కాంగ్రెస్‌ను ఆదరించాలనే ఆలోచన కూడా రావడం లేదు. సో.. ఈ పార్టీకి ఓటు బ్యాంకు లేదు. కంఠ శోష తప్ప! ఉన్న పార్టీలు.. అలా వెనుకడుగులు వేస్తున్నాయి. ఈ పరిణామాలను గమనిస్తే.. ఏపీని మోసం చేయడం కాదా! అనే ప్రశ్నలు తెరమీదికి వస్తున్నాయి.