ఇసుక పాలసీ... ఏది ఉచితం, ఏది కాదు
ఏపీలో తమ పాలనకు.. తాము తీసుకుంటున్న నిర్ణయాలకు ప్రజలు జై కొడుతున్నారని టీడీపీ పేర్కొంది
ఏపీలో తమ పాలనకు.. తాము తీసుకుంటున్న నిర్ణయాలకు ప్రజలు జై కొడుతున్నారని టీడీపీ పేర్కొంది. తాజాగా ఏపీలో తీసుకువచ్చిన ఉచిత ఇసుక పాలసీని సోమవారం ప్రారంభించిన విషయం తెలిసిందే. మొత్తం 20 జిల్లాల్లో ఇసుక పంపిణీని ప్రారంభించారు. కేవలం రవాణా చార్జీలు, కూలి చెల్లించి.. ఇసుకను తీసుకువెళ్లేందుకు అవకాశం కల్పించింది. ఇసుకకు సంబంధించి ప్రభుత్వానికి ఎలాంటి చార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదని ప్రభుత్వం తెలిపింది.
దీంతో ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. దీనిని ప్రస్తావిస్తూ.. టీడీపీ అధికారికంగా ప్రకటన చేసింది. తాము చేపట్టి ఉచిత ఇసుక పథకానికి ప్రజల నుంచి విశేష ఆదరణ లభిస్తోందని తెలిపింది. 20 టన్నుల ఇసుకను కేవలం 11,800 రూపాయలకు తీసుకువెళ్లే పరిస్థితి వచ్చిందని పేర్కొంది. జగన్ దుర్మార్గపు ప్రభుత్వంలో 20 టన్నుల ఇసుకకు ప్రజలు రూ.50 వేల వరకు చెల్లించాల్సి వచ్చిందని తెలిపింది. దీంతో టన్ను ఇసుక ..అన్ని చార్జీలు కలుపుకొని రూ.590 మాత్రమే పడుతోందని.. ఇది భవన నిర్మాణాలు చేసుకునే మధ్యతరగతి వర్గాలు మేలు చేస్తోందని పేర్కొంది.
మరోవైపు.. రాష్ట్ర వ్యాప్తంగా ఇసుక కొనుగోళ్లు ఊపందుకున్నాయి. పలు జిల్లాల్లో మంత్రులు ఉచిత ఇసుక పథకాన్ని ప్రారంభించి అమ్మకాలు చేస్తున్నారు. ఇదిలావుంటే.. తూర్పు, పశ్చిమ గోదావరి, విజయవాడ తదితర ప్రాంతాల్లో.. ఇసుకను ఉచితంగా ఇవ్వడంపై.. భవన నిర్మాణ కార్మికులు హర్షం వ్యక్తం చేస్తున్నా రు. తద్వారా తమకు ఉపాధి లభించిందని.. పేర్కొన్నారు. ఈ క్రమంలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చిత్రపటాలకు పాలాభిషేకం చేసి తమ హర్షం వ్యక్తం చేశారు.
ఇదీ.. ఇసుక పాలసీ..
ఏపీ ప్రభుత్వం పాత ఇసుక విధానం రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 2019, 2021 ఇసుక విధానాలు రద్దు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చిన ప్రభుత్వం.. ఉచిత ఇసుకపై విధివిధానాలు ఖరారు చేస్తూ జీవో విడుదల చేసింది. కొత్త ఇసుక విధానాన్ని రూపొందించే వరకు ఈ విధి విధానాలు వర్తిస్తాయని, రాష్ట్ర ఖజానాకు రెవెన్యూ లేకుండా ఇసుక సరఫరా జరపాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. వినియోగదారులకు ఇసుకను అందుబాటులోకి తేవడమే లక్ష్యంగా ఈ మార్గదర్శకాలు జారీ చేసినట్లు వెల్లడించింది.
ఇసుక తవ్వకాల నిమిత్తం జిల్లా కలెక్టర్ ఛైర్మన్‌గా జిల్లా స్థాయి కమిటీలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. జిల్లాల్లోని స్టాక్ పాయింట్లను స్వాధీనం చేసుకోవాలని ఆ కమిటీలకు సూచించింది. ఇసుక లోడింగ్, రవాణా ఛార్జీలను నిర్థారించే బాధ్యత కూడా జిల్లా కమిటీలకే ఉంటుందని తెలిపింది. ఈ చెల్లింపులను కేవలం డిజిటల్ విధానం ద్వారానే జరపాలని స్పష్టం చేసింది.
ఇసుకను తిరిగి విక్రయించినా, ఇతర రాష్ట్రాలకు తరలించినా కఠిన చర్యలు ఉంటాయని, భవన నిర్మాణాలు మినహా ఉచిత ఇసుకను మరే ఇతర అవసరాలకు వినియోగించవద్దని తెలిపింది. ఇసుక అక్రమ రవాణా చేసినా, ఫిల్లింగ్ చేసినా జరినామాలు ఉంటాయని ఉత్తర్వుల్లో పేర్కొంది. వినియోగదారులకు రోజుకు 20 టన్నుల వరకు ఇసుకను ఉచితంగా అందించనున్నారు.